కీవ్, సెప్టెంబర్ 3: రష్యా సైన్యం వరుస క్షిపణి దాడులతో ఉక్రెయిన్ నగరాలపై విరుచుకుపడుతున్నది. ఉక్రెయిన్ తూర్పు మధ్య ప్రాంతంలోని పోల్టావా పట్టణంపై రెండు బాలిస్టిక్ క్షిపణుల్ని రష్యా తాజాగా ప్రయోగించింది. ఈ దాడిలో కనీసం 50 మంది పౌరులు చనిపోయారని, మరో 200 మంది తీవ్రంగా గాయపడ్డారని అధ్యక్షుడు జెలెన్స్కీ మంగళవారం తెలిపారు. నగరంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ భవనం పాక్షికంగా దెబ్బతినగా, శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టామని తెలిపారు. ఓ విద్యా కేంద్రం, సమీపంలోని దవాఖానపై రష్యా క్షిపణి దాడులకు పాల్పడిందని చెప్పారు. రష్యా సరిహద్దు నుంచి 110 కిలోమీటర్ల దూరంలోని పోల్టావా నగరంపై రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. 2022 ఫిబ్రవరి 24న మొదలైన ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో తాజా దాడులు అత్యంత భీకరమైనవిగా పేర్కొన్నారు. క్షిపణి దాడులపై నగరంలో సైరన్ మోగగానే తమను తాము రక్షించుకునేందుకు ఉక్రెయిన్ ప్రజలు బాంబ్ షెల్టర్ల వైపు పరుగులు తీశారు.