చెన్నై, అక్టోబర్ 29 : రష్యా ముడి చమురుతో భారత్కు పయనమైన ఓ ఆయిల్ ట్యాంకర్ బాల్టిక్ సముద్రంలో అర్ధాంతరంగా వెనుకకు మరలింది. దీంతో భారత్, రష్యా మధ్య చమురు వాణిజ్యం నిలిచిపోయినట్లు వెలువడుతున్న వార్తలకు బలం చేకూర్చినట్లు అయింది. రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్న దేశాలపై అమెరికా తాజా ఆంక్షల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. అయితే రాయితీ ధరలకు లభిస్తున్న రష్యా చమురుపై భారీగా ఆధారపడిన భారతీయ రిఫైనరీలు తాజా పరిణామంతో అనిశ్చితికి లోనయ్యే అవకాశాలు కనపడుతున్నాయి.
రష్యాలోని ప్రిమోరస్క్ పోర్టు నుంచి దాదాపు 7.30 లక్షల బ్యారెళ్ల ముడి చమురుతోబయల్దేరిన ఫూరియా అనే ట్యాంకర్ గుజరాత్లోని సిక్కా పోర్టుకు చేరుకోవలసి ఉంది. డెన్మార్క్, జర్మనీ మధ్య ఫెహమార్న్ బెల్ట్ చేరుకున్న అనంతరం హఠాత్తుగా వెనక్కు మరలిన ఆ ట్యాంకర్ ఈజిప్టులోని ఓ పోర్టు వైపు దిశ మార్చుకున్నట్లు బ్లూమ్బర్గ్ పేర్కొంది.