ఖమ్మం, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం జిల్లాలోని ఇద్దరు కీలక మంత్రులకు గ్రామీణ ఓటర్లు షాక్ ఇచ్చారు. వారు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల పరిధిలో జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్, సీపీఎం కూటమికి ప్రజలు జైకొట్టి జిల్లా రాజకీయ చైతన్యాన్ని చాటారు. జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్-సీపీఎం కూటమి హవా కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాతినిథ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గ పరిధిలోని ముదిగొండ మండలంలో, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గ పరిధిలోని నేలకొండపల్లి, కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మంరూరల్ మండలాల పరిధిలో ఉన్న అనేక పంచాయతీల్లో బీఆర్ఎస్ విజయదుందుభి మోగించింది.
ఖమ్మం రూరల్ మండలంలో ఎన్నికలు జరిగిన 19 పంచాయతీల్లో 10 గ్రామాల్లో బీఆర్ఎస్, సీపీఎం కూటమి అభ్యర్థులు విజయం సాధించి సత్తా చాటారు. పలు వార్డు స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు విజయ ఢంకా మోగించారు. బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు ఎన్నికల్లో విజయం సాధించడంతో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత స్పష్టమైంది. అధికార పార్టీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఒకవైపు ప్రలోభాలకు గురిచేస్తున్నా, మరోవైపు ప్రత్యర్థి పార్టీల నేతలను, అభ్యర్థులను బెదిరింపులకు గురిచేస్తున్నా ఓటర్లు మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థుల వైపే మొగ్గు చూపారు. ఇటీవల అధికార పార్టీ వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్మీ రవిని తిరుమలాయపాలెం మండలం ముజాహిదీపురం సర్పంచ్‌గా ప్రజలు ఆదరించి విజయాన్ని అందించారు. బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు సత్తా చాటి కాంగ్రెస్‌కు అభ్యర్థులకు చెమటలు పట్టించారు. కొన్ని చోట్ల మాత్రం స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయింది.
కాంగ్రెస్‌కు షాక్..
ఖమ్మంరూరల్ మండలంలోని ఎం.వెంకటాయపాలెం (ఎంవీ పాలెం), పొన్నెకల్ వంటి పెద్ద పంచాయతీల్లో కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోయింది. ఈ రెండు చోట్ల సర్పంచ్ పదవిని బీఆర్ఎస్, సీపీఎం కూటమి అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలిచారు. ఎంవీ పాలెంలోని పది వార్డుల్లో బీఆర్ఎస్, సీపీఎంలు చెరో ఐదు గెలుచుకున్నాయి. పొన్నెకల్లులో బీఆర్ఎస్ కూటమి సర్పంచ్ పదవితోపాటు 8 వార్డులను గెలుచుకుంది. మేజర్ పంచాయతీ నేలకొండపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించారు.
అలాగే, ముదిగొండలో సీపీఎం అభ్యర్థి విజయం సాధించారు. తిరుమలాయపాలెం మండలంలోనూ కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ బ్రేకులు వేసింది. 25 పంచాతీయల్లో బీఆర్ఎస్ కూటమి 10 గెలుచుకుంది. నేలకొండపల్లిలో 29 పంచాయతీల్లో బీఆర్ఎస్, సీపీఎం కూటమి 8 గెలవగా.. ఒకరు స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ముదిగొండలో 25 పంచాయతీల్లో ఒకటి ఏకగ్రీవం కాగా మిగిలిన 24లో సీపీఎం, బీఆర్ఎస్ కూటమి 8 స్థానాలు గెలుచుకుంది. కూసుమంచిలో 41 పంచాయతీలకు 6 ఏకగ్రీవం కావడంతో ఎన్నికలు జరిగిన 35 పంచాయతీల్లో బీఆర్ఎస్ 11 స్థానాలు గెలుచుకుంది. చేగొమ్మ స్థానాన్ని డ్రా ద్వారా బీఆర్ఎస్ గెలుచుకుంది. కామేపల్లి మండలంలో 24 పంచాయతీలకు 6 ఏకగ్రీవం కావడంతో మిగిలిన 18 పంచాయతీల్లో బీఆర్ఎస్ 6, టీడీపీ 1 స్థానాల్లో విజయం సాధించాయి.