హైదరాబాద్, జూన్ 13(నమస్తే తెలంగాణ): ఈ ఏడాది రూ.241.37 కోట్లతో సుమారు 680 కొత్త బస్సులు కొనుగోలు చేయనున్నట్టు ఆర్టీసీ తన ప్రణాళికలో పేర్కొన్నది. ఇందులో పాత బస్సుల స్థానంలో 413, అగ్మెంటేషన్(విస్తరణ) కోసం 267 బస్సులు కొంటామని చెప్పింది. అయితే, వీటికి సంబంధించిన నిధుల విషయంలో స్పష్టత ఇవ్వడం లేదు. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరంలో 193.44 కోట్లు ఖర్చు చేసి 503 బస్సులకు ఆర్డర్ ఇస్తే.. ఆర్టీసీకి వచ్చింది కేవలం 170 మాత్రమే. మిగతా బస్సులు 2026 మార్చి 31వరకు వస్తాయని ప్రకటించినా నేటికీ వాటి జాడలేదు. అయితే, ఆర్టీసీకి ప్రభుత్వం 2025-26 బడ్జెట్లో రూ.4,305 కోట్లు కేటాయించినా, ప్రగతిపద్దులో చూపింది రూ.3,082.53 కోట్లు మాత్రమే. అవికూడా ఈ ఏడాది మహాలక్ష్మికి పథకానికి చెల్లించాల్సిన డబ్బులే. అదనంగా ఆర్టీసీ రుణాలు, బస్సుల కొనుగోలు, ఉద్యోగుల పెన్షన్‌కు ప్రభుత్వం రిక్తహస్తమే చూపింది. దీంతో బస్సుల కొనుగోలు భారమంతా ఆర్టీసీనే భరించాల్సి ఉంటుంది.
2026-27 ఆర్థిక సంవత్సరంలో సంస్థ కొనుగోలు చేయాలనుకున్న వాటిలో పల్లెవెలుగు బస్సులే అత్యధికంగా ఉన్నాయి. ఆర్టీసీ ప్రకటించిన లిస్ట్‌లో రాజధాని బస్సులు 21, సూపర్‌లగ్జరీ బస్సులు 36, డీలక్స్‌లు 39, ఎక్స్‌ప్రెస్‌లు 16, సిటీ ఆర్డినరీలు 189, పల్లె వెలుగులు 228 బస్సులు ఉన్నాయి. నిరుడు కొనుగోలు చేస్తామన్న 503 బస్సుల్లో 332 బస్సులు రావాల్సి ఉన్నది. అయితే, మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో రద్దీ పెరుగుతుండటంతో.. ఆ రద్దీకి తగ్గట్టుగా బస్సులు లేవు. దీంతో ప్రతిరోజూ మహిళలకు సిగపట్లు తప్పడం లేదు. అయితే, మహాలక్ష్మి బకాయిలు ప్రభుత్వం నుంచి రాకపోవడంతో ఈ ఏడాది కొనుగోలు చేయాల్సిన బస్సులు వివరాలను యాజమాన్యం పేరుకే ప్రకటించినట్టు ఆర్టీసీ వర్గాలు చెప్తున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి ఉచిత బస్సు’ పథకం ద్వారా మహిళలు సుమారు రూ.10వేల కోట్లు ఆదా చేసుకున్నట్టు ప్రకటించారు. అయితే, అందులో ఆర్టీసీకి ఇచ్చింది కేవలం రూ.5,552.65 కోట్లు మాత్రమే. ఇంకా ప్రభుత్వం ఆర్టీసీకి బకాయిలు పడిన మొత్తం రూ.4,447.35 కోట్లు. ఇంత భారీ మొత్తంలో బకాయిలు ఉండటం వల్లే ఆర్టీసీ చేయాల్సిన పనులు, చేపట్టాల్సిన కార్యక్రమాలు వాయిదాపడుతూ వస్తున్నాయి.
ఆర్టీసీకి ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడం వెనుక.. ఆ సంస్థను నిర్వీర్యం చేసే కుట్ర దాగి ఉన్నదని కార్మికులు చెప్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సులను వేలకొద్దీ ప్రవేశపెడుతూ ఆర్టీసీకి నిత్యం అవసరమయ్యే బస్సుల కొనుగోలులో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని కార్మికులు మండిపడుతున్నారు. తక్షణమే బకాయిలు విడుదల చేసి ఆర్టీసీని బలోపేతం చేయాలని వారు కోరుతున్నారు.