కోరుట్ల, ఏప్రిల్ 22 : తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా కోరుట్లలో ఆర్టీసీ ఉద్యోగులు బుధవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా విధులు బహిష్కరించిన ఉద్యోగులు పట్టణంలోని కొత్త బస్టాండ్ ఆర్టీసీ డిపో వద్ద సమ్మెకు దిగారు. దీంతో బస్సులు డిపోకు పరిమితం కావడంతో పట్టణ, పరిసర గ్రామాలకు చెందిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉద్యోగ భద్రత, పెండింగ్ సమస్యల పరిష్కారం వంటి డిమాండ్లతో కార్మికులు ఆందోళన చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.
బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు గంటల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. కొందరు ప్రత్యామ్నాయ ప్రయాణ మార్గాలను ఆశ్రయించగా, మరికొందరు తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ, సమస్యలు పరిష్కరించేవరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. సంఘాలకు అతీతంగా ఉద్యోగులు జేఏసీ గా ఏర్పడి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తామని పేర్కొన్నారు.