హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు జూన్ 2న అపాయింటెడ్ డే ప్రకటించాలని ఆర్టీసీ కార్మిక జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎంప్లాయీస్ యూనియన్ కేంద్ర కార్యాలయంలో సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆ రోజున అపాయింటెడ్ డే ప్రకటిస్తే, ఆర్టీసీలో అమరులైన వారి ఆత్మలకు శాంతి చేకూరుతుందని పేర్కొన్నారు. సమ్మె విరమణ సమయంలో ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ఒప్పుకొన్న 32 డిమాండ్లను జాప్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని కోరారు.
అమరుడు శంకర్‌గౌడ్ కుటుంబానికి ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల మే నెల జీతం నుంచి రూ.300 చొప్పున కటింగ్ చేసి ఇవ్వాలన్న జేఏసీ ప్రతిపాదనను ఆర్టీసీ ఎండీ అంగీకరించి డబ్బులు కట్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు వేతన సవరణకు ప్రభుత్వం, యాజమాన్యం ఒప్పుకొన్నందున మాస్టర్ సేల్ అమలుచేయాలని, కొత్త జీతాలు చెల్లించాలని నాయకులు కోరారు.