.హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు బయటికి వెళ్లే వారి కోసం టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. జీహెచ్ఎంసీ పరిధిలో న్యూ ఇయర్ వేడుకల కోసం హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్బులు, ఈవెంట్లకు బయటికి వెళ్లే వారు తిరిగి వచ్చేందుకు శుక్రవారం రాత్రి 12.30 నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గురువారం ప్రకటించారు. ఈ ప్రత్యేక బస్సులు రాత్రి 7.30 గంటల నుంచి 9.30 గంటల వరకు అప్ జర్నీకి, రాత్రి 12.30 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు డౌన్ జర్నీ ట్రిప్పులు నడిపించనున్నారు.
ఈ బస్సుల్లో ప్రయాణించే వారికి రూ.100 చొప్పున చార్జి వసూలు చేయనున్నట్టు పేర్కొన్నారు. స్టాప్‌లు, పిల్లలు, పెద్దలు అన్న తేడా ఉండబోదని ఎక్కడి నుంచి ఎక్కడికైనా రూ.100తో ఒకవైపు ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. ఎక్కువ మంది ఉన్నట్లయితే 18 సీటర్ల ఏసీ బస్సులను రూ.4 వేలకు అద్దెకు ఇస్తున్నట్టు తెలిపారు. ఈ అద్దె బస్సుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఒక అప్ జర్నీ, ఒక డౌన్ జర్నీకి అనుమతి ఉంటుందని తెలిపారు. దగ్గర్లోని బస్స్టేషన్లలో ఆర్టీసీ సిబ్బందిని సంప్రదించాలని సూచించారు.