హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : దళితులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిది కపట ప్రేమ అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో కులాంతర వివాహం చేసుకున్న ఓ దళిత యువకుడి ఇంటిని స్థానిక సర్పంచ్ ఆధ్వర్యంలో కూల్చివేయడంపై ఆర్ఎస్పీ శుక్రవారం ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. మేజర్లు అయిన యువతీయువకులు ఇష్టపూర్తిగా వివాహం చేసుకున్నామని పోలీసులకు వివరించినప్పటికీ, వారికి కనీస రక్షణ కల్పించకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. సర్పంచ్ స్వయంగా కుట్ర చేసి ఈ దారుణానికి పాల్పడ్డాడని బాధితురాలు స్పష్టంగా వాంగ్మూలం ఇచ్చినప్పటికీ, ఎఫ్ఐఆర్లో సర్పంచ్ పేరు ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు.
ఈ దారుణానికి ఒడిగట్టిన వారిపై తక్షణమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు, శుక్రవారం అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి శ్రీశ్రీ కవితను ప్రస్తావిస్తూ తడబడిన వైనాన్ని ఎద్దేవా చేస్తూ ‘సంధ్యారాగం’ పేరిట ఓ వ్యంగ్యాస్త్ర కవితను ఎక్స్ వేదికగా విడుదల చేశారు. పాలకపక్షం తీరును కడిగిపారేస్తూ రాసిన ఆ కవితలో.. ‘లంచాలు, దందాల్లో మునిగిన కాంగ్రెస్ నాయకులను గుంట నకలతో, లంకెబిందెల వేటలో మునిగిన చోరులతో పోల్చారు. అదే సమయంలో ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్ష నేతలను ప్రవీణ్ కుమార్ ప్రశంసిస్తూ.. అసెంబ్లీ నుంచి బయటకు నెట్టినా, ఎన్ని నిర్బంధాలు విధించినా వెరవకుండా ప్రజల గొంతుకగా నిలబడి పోరాడుతున్న బీఆర్ఎస్ యోధులే రాబోయే కాలానికి అసలైన మార్గదర్శకులని కొనియాడారు.