న్యూఢిల్లీ: అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న ఒంటరి వలస పిల్లలు స్వచ్ఛందంగా తమ దేశాలకు వెళ్లిపోవడానికి సిద్ధపడితే వారికి 2,500 డాలర్ల(రూ. 2.20 లక్షలు)చొప్పున నగదు సాయం అందచేయాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్) ప్రతిపాదిస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వంలోని వర్గాలు వెల్లడించాయి. ఎటువంటి అధికారిక పత్రాలు లేకుండా అమెరికాలోకి ప్రవేశించిన అక్రమ వలసదారులకు(మేజర్లు) 1,000 డాలర్ల(రూ.88,000) ఎగ్జిట్ బోనస్‌తో సహా ఆర్థిక రాయితీలను అమెరికా ప్రభుత్వం ఇప్పటికే అందచేస్తోంది.
వలసదారులను బంధించి, వారిని వారి స్వదేశాలకు తరలించడంతో పోలిస్తే స్వచ్ఛంద తరలింపు రాయితీలే ప్రభుత్వానికి తక్కువ ఆర్థిక భారమని ప్రభుత్వ అధికారులు వాదిస్తున్నారు. తల్లిదండ్రులు లేకుండా అక్రమంగా ప్రవేశించిన 14 ఏండ్లు అంతకన్నా ఎక్కువ వయసు ఉన్న మైనర్లు స్వచ్ఛందంగా అమెరికాను వదిలి తమ స్వదేశానికి పయనమైతే వారికి 2,500 డాలర్ల చొప్పున నగదు సాయాన్ని అందచేయనున్నట్లు ఓ నోటీసు పంపించింది.