హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ) హిమాయత్‌నగర్: బ్యాంకులను లూటీ చేసి, ప్రభుత్వ భూములను కబ్జా పెట్టి, దేశసంపదను కొల్లగొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లపై ప్రయోగించాల్సిన రెవెన్యూ రికవరీ యాక్ట్‌ను పేద విద్యార్థులపై పెట్టడం దుర్మార్గమని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఇందుకు సంబంధించి జారీ చేసిన జీవో-8, 9లను వెంటనే రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పాత పద్ధతిలోనే అమలుచేయాలని, వెంటనే రూ.8 వేల కోట్లకు పైచిలుకు పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కాంగ్రెస్ సర్కార్ వైఖరికి నిరసనగా గురువారం హిమాయత్‌నగర్‌లో తెలంగాణ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ, బీసీ జేఏసీ నేత గుజ్జ కృష్ణ నేతృత్వంలో ఆందోళనకు దిగారు.
ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తిం చారు. జీవో-8,9 కాపీలను చించివేశారు. ఈ సందర్భంగా శ్రీని వాస్‌గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేసేందుకు రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. 13 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని ధ్వజమెత్తారు. పాత బకాయిలు చెల్లించకుండా, ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ నగదును విద్యార్థుల ఖాతాల్లో జమచేయాలని నిర్ణయించడం ఎంత వరకు కరెక్ట్? అని ప్రశ్నించారు. పాత విధానంలోనే స్కీమ్‌ను కొనసాగించాలని కోరారు.