హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఖమ్మం జిల్లాకు చెందిన పన్నెండేండ్ల బాలికపై లైంగికదాడికి యత్నించిన పొక్సో కేసులో వైద్యాధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. గురువారం నిమ్స్‌లో బాధిత బాలికను బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బాలికకు మెరుగైన చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. దీంతో వైద్యాధికారులు అత్యుత్సాహంతో బాలిక తల్లిదండ్రులతో ఓ వీడియోను తీయించారు.
నిమ్స్‌లో తమ పాపను కంటికి రెప్పలా కాపాడుతున్నారని, ట్రీట్మెంట్, మెడిసిన్, టెస్టులన్నీ ఉచితంగా చేస్తున్నారని చెప్పించారు. మెడిసిన్ కోసం డబ్బులు తీసుకోలేదని, అవసరమైన మందులన్నీ వాళ్లే ఇస్తున్నారని, ఉండడానికి రూమ్ ఇచ్చారని, ఆహారం కూ డా ఉచితంగానే అందిస్తున్నారని ఆ వీడియో సా రాంశం. అయితే బాధితుల ఐడెంటిటీని బయట పెట్టకూడదనే కనీస విచక్షణ మరచి వైద్యశాఖ అధికారులు ప్రవర్తించిన తీరు తీవ్ర చర్చనీయాంశమైంది.
కొన్ని జర్నలిస్టుల గ్రూపుల్లో ఈ అంశం చర్చకు దారితీసింది. వీడియో తీయించడమే తప్పు అంటే ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడం ఏంటీ..? అని పలువురు మండిపడ్డారు. ఇక ఈ విషయం బయటకు రావడంతో అధికారులు ఆయా గ్రూపుల నుంచి బాలిక తల్లిదండ్రుల వీడియోను డిలీట్ చేయడం కనిపించింది. కాగా ఈ కేసు వివరాలతో సహా సోషల్ మీడియా గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతుండటంతో ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి హెచ్చరికలు జారీ చేశారు.
ఈ కేసులో బాధితురాలి ఫొటో, పేరు, ఇతర వివరాలు, కుటుంబసభ్యుల వివరాలు వెల్లడిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, బాధితుల పట్ల వ్యవహరించాల్సిన తీరు గురించి పోక్సో చట్టం-2012లోని సెక్షన్ 19, 23లో ఉన్నది. ఈ సెక్షన్లను ఎవరైనా ఉల్లంఘిస్తే కనీసం ఆరు నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష పడుతుంది.