Rosemary Oil | ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో సహజసిద్ధమైన మూలికలు, వాటి ప్రయోజనాలపై ఆసక్తి పెరుగుతోంది. వంటింట్లో సాధారణంగా ఉపయోగించే రోజ్మేరీ కూడా ఇప్పుడు ఆరోగ్య ప్రయోజనాల కారణంగా ప్రత్యేకంగా చర్చకు వస్తోంది. ఆయుష్ మంత్రిత్వ శాఖ రోజ్మేరీలో ఉన్న పలు ఔషధ గుణాలను ప్రస్తావిస్తూ, జ్ఞాపకశక్తి, మానసిక ఏకాగ్రతతోపాటు జుట్టు, తల చర్మ ఆరోగ్యానికి కూడా ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. అయితే రోజ్మేరీ, ముఖ్యంగా దాని ఎసెన్షియల్ ఆయిల్‌ను మోతాదుకు మించి లేదా సరైన విధానం లేకుండా ఉపయోగించడం వల్ల దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు పాటించడం అవసరం. రోజ్మేరీని ఎప్పటి నుంచో జ్ఞాపకశక్తికి సంబంధించిన మూలికగా పరిగణిస్తున్నారు. రోజ్మేరీలో ఉండే సువాసనతో కూడిన కొన్ని క్రియాశీల సమ్మేళనాలు మెదడులోని నాడీ సంకేతాల ప్రసారానికి సహాయపడటంతోపాటు ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుంచి నాడీ వ్యవస్థను రక్షించడంలో కీలకపాత్ర పోషిస్తాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా 1,8-సినియోల్ అనే సమ్మేళనం రోజ్మేరీలో ఉండే ముఖ్యమైన క్రియాశీల పదార్థాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.
నార్తంబ్రియా యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ సువాసనకు గురైనవారిలో జ్ఞాపకాలను గుర్తించే వేగం, మానసిక లెక్కల సామర్థ్యం మెరుగ్గా ఉన్నట్లు గుర్తించారు. రక్త నమూనాల పరిశీలనలో రోజ్మేరీలోని 1,8-సినియోల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నవారిలో పరీక్షల ఫలితాలు మెరుగ్గా ఉన్నట్లు సంబంధం కనిపించింది. రోజ్మేరీలో కార్నోసిక్ యాసిడ్, రోజ్‌మారినిక్ యాసిడ్ వంటి డైటర్పీన్లు కూడా ఉంటాయి. ఇవి ఎసిటైల్ కోలినెస్టరేజ్ అనే ఎంజైమ్ చర్యను నిరోధించడంలో సహాయపడుతుందని ప్రి-క్లినికల్ పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ ఎంజైమ్ ఎసిటైల్ కోలిన్ అనే న్యూరోట్రాన్స్మిటర్ను విచ్ఛిన్నం చేస్తుంది. ఎసిటైల్ కోలిన్ మెదడులో నేర్చుకోవడం, జ్ఞాపకశక్తి వంటి ప్రక్రియలకు ముఖ్యమైనది కావడంతో, రోజ్మేరీలోని కొన్ని సమ్మేళనాలు ఏకాగ్రతను కొనసాగించడంలో సహాయపడే అవకాశం ఉందని చెబుతున్నారు. రోజ్మేరీని జుట్టు, తల చర్మ సంరక్షణలో కూడా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా రోజ్మేరీ ఆయిల్ తల చర్మంలో రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా వెంట్రుకల కుదుళ్లకు అవసరమైన పోషకాలు, ఆక్సిజన్ చేరేందుకు సహాయపడుతుందని చెబుతున్నారు. సోషల్ మీడియాలో రోజ్మేరీ వాటర్ హెయిర్ రిగ్రోత్కు ఉపయోగపడుతుందనే ప్రచారం విస్తృతంగా ఉన్నప్పటికీ, దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
ఆండ్రోజెనెటిక్ అలోపేషియా లేదా ప్యాటర్న్ హెయిర్ లాస్‌తో బాధపడుతున్న 100 మందిపై నిర్వహించిన ఒక రాండమైజ్డ్ క్లినికల్ ట్రయల్‌లో రోజ్మేరీ ఆయిల్‌ను పలుచగా చేసి ఉపయోగించినవారిని, 2 శాతం మినాక్సిడిల్ ఉపయోగించినవారితో పోల్చారు. ఆరు నెలల తర్వాత రెండు గ్రూపుల్లోనూ జుట్టు సాంద్రత గణనీయంగా పెరిగినట్లు అధ్యయనం వెల్లడించింది. మినాక్సిడిల్ వాడినవారితో పోలిస్తే రోజ్మేరీ ఆయిల్ ఉపయోగించినవారిలో తల చర్మంపై దురద తక్కువగా ఉన్నట్లు కూడా గుర్తించారు. రోజ్మేరీలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు తల చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే వెంట్రుకల కుదుళ్ల స్థాయిలో డీహైడ్రోటెస్టోస్టెరోన్ (డీహెచ్‌టీ) ప్రభావాన్ని తగ్గించడంలో కూడా ఇది కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే సహజసిద్ధమైన చికిత్సలను ఉపయోగిస్తున్నప్పుడు వెంటనే ఫలితాలు వస్తాయని ఆశించకూడదు. జుట్టు సాంద్రతలో స్పష్టమైన మార్పులు కనిపించడానికి నాలుగు నుంచి ఆరు నెలల పాటు క్రమం తప్పకుండా ఉపయోగించాల్సి వస్తుంది. మెదడు ఆరోగ్యం, ఏకాగ్రత కోసం రోజ్మేరీని ఉపయోగించాలనుకునేవారు అరోమాథెరపీ రూపంలో ఉపయోగించవచ్చు. బాగా గాలి ప్రసరణ ఉండే ప్రదేశంలో 3 నుంచి 4 చుక్కల రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్‌ను డిఫ్యూజ్ చేసి 20 నుంచి 30 నిమిషాల పాటు ఉపయోగించవచ్చు. అలాగే ఎండిన రోజ్మేరీ ఆకులను ఒక టీస్పూన్ లేదా ఒక తాజా కొమ్మను వేడి నీటిలో 8 నుంచి 10 నిమిషాల పాటు నానబెట్టి రోజుకు ఒకసారి టీగా తీసుకోవచ్చు.
అయితే రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్‌ను నేరుగా తల చర్మానికి రాయకూడదు. ఇది కాంటాక్ట్ డెర్మటైటిస్, చర్మం మంట లేదా ఇతర రకాల ఇబ్బందులకు కారణమయ్యే అవకాశం ఉంటుంది. ఒక టేబుల్‌స్పూన్ అంటే సుమారు 15 మిల్లీలీటర్ల జోజోబా, స్వీట్ ఆల్మండ్ లేదా కొబ్బరి నూనెలో 3 నుంచి 5 చుక్కల రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్‌ను కలిపి పలుచగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వారానికి రెండు నుంచి మూడు సార్లు తల చర్మంపై మృదువుగా మసాజ్ చేసి, కనీసం 30 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూతో కడుక్కోవచ్చు. రోజ్మేరీ సహజమైనదే అయినప్పటికీ, దాని ఎసెన్షియల్ ఆయిల్ అత్యంత గాఢమైన పదార్థం కాబట్టి మితంగా, జాగ్రత్తగా ఉపయోగించడం ముఖ్యం. చర్మంపై మొదటిసారి ఉపయోగించే ముందు 24 గంటల ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది. ఆస్పిరిన్ లేదా సాలిసైలేట్స్కు అలర్జీ ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భిణులు, తీవ్రమైన హైపర్‌టెన్షన్ లేదా ఎపిలెప్సీ ఉన్నవారు రోజ్మేరీని అధిక మోతాదులో నోటితో తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి. రోజ్మేరీ మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి, ఏకాగ్రతతో పాటు తల చర్మం, జుట్టు ఆరోగ్యానికి ప్రయోజనాలను అందించే అవకాశం ఉంది. అయితే ఎక్కువ మోతాదులో తీసుకోవడం లేదా ఎసెన్షియల్ ఆయిల్‌ను నేరుగా చర్మానికి ఉపయోగించడం సురక్షితం కాదు. సరైన మోతాదు, సరైన విధానం, అవసరమైన జాగ్రత్తలు పాటిస్తూ ఉపయోగించినప్పుడే రోజ్మేరీ వల్ల ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది.