
నర్సంపేట రూరల్, డిసెంబర్ 26: తల్లిదండ్రులను కోల్పోయిన ఆ అన్నాచెల్లెళ్లకు బంధువులు అండగా నిలిచారు. గత నెలలో ఇద్దరికీ పెళ్లి సంబంధాలు చూసి నిశ్చితార్థాలూ చేశారు. మరికొన్ని రోజుల్లో ఇద్దరికీ ఒకేసారి పెండ్లి చేద్దామని నిర్ణయించారు. ఇంతలోనే రోడ్డు ప్రమాదం ఆ అన్నాచెల్లెల్ని బలితీసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం దబ్బీర్పేటకు చెందిన మొగుళ్ల రమేశ్-విజయ దంపతులకు ఇద్దరు సంతానం. కుమారుడు రాకేశ్(25) ఇంటర్ పూర్తిచేసి స్థానికంగా హార్వెస్టర్ నడుపుతున్నాడు. కూతురు ప్రసన్న (22) ఇటీవలే డిగ్రీ పూర్తిచేసింది.
వరంగల్లో ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు ఆదివారం సాయంత్రం అన్నాచెల్లెళ్లు ద్విచక్ర వాహనంపై దబ్బీర్పేట నుంచి బయల్దేరారు. నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామ శివారులో నర్సంపేట-వరంగల్ ప్రధాన రహదారిపై ఓ టిప్పర్ వేగంగా వచ్చి వారి బైక్ను ఢీకొట్టింది. దీంతో రాకేశ్, ప్రసన్న అక్కడికక్కడే మృతి చెందారు. ఐదేండ్ల క్రితం జరిగిన రోడ్డుప్రమాదంలో వారి తండ్రి మొగుళ్ల రమేశ్, రెండేళ్ల క్రితం జరిగిన రోడ్డుప్రమాదంలో తల్లి విజయ మృతి చెందారు. అప్పటి నుంచి నానమ్మ మొగుళ్ల సాంబలక్ష్మి ఇంట్లో అన్నాచెల్లెళ్లు ఉంటున్నారు. ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ ఇద్దరూ మృత్యువాత పడటం అందరినీ కలిచివేసింది. ఎస్సై బొజ్జ రవీందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.