శాయంపేట, ఏప్రిల్ 8: హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ.. మినీ గూడ్స్ వాహనాన్ని ఢీకొనడంతో నలుగురు మహిళా కూలీలు దుర్మరణం చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. శాయంపేట మండలం పత్తిపాకకు చెందిన కూలీలు కొద్దిరోజులుగా మిర్చి ఏరేందుకు వెళ్తున్నారు. రైతులకు, కూలీలకు మధ్య ఒకరు మధ్యవర్తిత్వం వహిస్తూ రోజూ మినీ గూడ్స్ వాహనంలో తీసుకెళ్లి గ్రామంలో దింపుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజాము 4.30 గంటలకు కూలీలను తీసుకెళ్లడానికి పత్తిపాక గ్రామానికి గూడ్స్ వాహనం వచ్చింది. 40 మందికిపైగా ఆ వాహనం ఎక్కారు. మాందారిపేట సమీపంలో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం వద్ద ములుపు తిరుగుతుండగా పరకాల వైపు నుంచి హనుమకొండకు వెళ్తున్న లారీ ముందు వెళ్తున్న మరో లారీని ఓవర్టేక్ చేస్తూ వేగంగా వచ్చి కూలీలున్న గూడ్స్ వాహనాన్ని ఒక పక్క బలంగా ఢీకొట్టుకొంటూ వెళ్లింది. భారీ శబ్దం రావడంతో ఏం జరిగిందో తెలిసేలోగా వాహనంలో నిల్చున్న మహిళల తలకు గాయాలై, చేతులు తెగిపోయి వాహనంలో ఉన్న మిగతా వారిపై పడిపోయారు. తీవ్ర రక్తస్రావంతో భీతావాహ పరిస్థితి ఏర్పడింది. మిగిలిన కూలీలంతా హుటాహుటిన కిందకు దిగి పరుగులు పెట్టారు. బాబు రేణుక (48), పూల మంజుల (45) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, దండెబోయిన విమల (50), చల్లా ఐలు కొమురమ్మ (48) వరంగల్ ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా కొడిమాల సరోజన, చింతల రాధ, మేకల లక్ష్మి, సూర్యబోయిన రేణుక, జక్కుల ఐలమ్మ, గీరబోయిన ఓదెమ్మ గాయపడగా దవాఖానకు తరలించారు. వీరిలో సరోజన, చింతల రాధ ఎడమ చేతులు తెగిపోవడంతో వారి పరిస్థితి విషమంగా ఉన్నది. మరికొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.