Road Accident : ఇవాళ (ఆదివారం) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. కారు ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం మధురై జిల్లా (Madhurai district) లోని కుంజంపట్టి సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు రోడ్డు దాటుతుండగా అతి వేగంగా దూసుకొచ్చిన కారు వీరిని ఢీకొట్టింది.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. ఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికిగల కారణాలపై ఆరా తీశారు. మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు మధురై పోలీసు సూపరింటెండెంట్ అరవింద్ తెలిపారు.
ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులు ఒకేసారి మరణించడంతో వారి స్వగ్రామంలో విషాదం అలుముకుంది. కాగా ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు.