e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 20, 2022
Home News బాధ్యత కరువై.. జీవితాలు శోకమై

బాధ్యత కరువై.. జీవితాలు శోకమై

 • మద్యం మత్తు.. ఆపై మితిమీరిన వేగం
 • నిండు ప్రాణాలను బలితీసుకున్న తాగుబోతులు
 • బంజారాహిల్స్‌లో ఇద్దరు చిరుద్యోగులు..
 • నార్సింగి వద్ద దంపతులు మృతి
 • మరో రెండు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం

తాగుబోతులు యమకింకరులుగా మారారు. నిండు ప్రాణాలను బలితీసుకున్నారు. మద్యం మత్తులో మరణమృదంగాన్ని మోగించారు. అన్యాయంగా నలుగురిని పొట్టనబెట్టుకున్నారు. బాధిత కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చారు. నగరంలో సోమవారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన రోడ్డు ప్రమాదాలు పలు కుటుంబాల్లో విషాదం నింపాయి. పీకల దాకా తాగి.. మరింత కిక్కువేద్దామని బయలుదేరిన బడాబాబుల నిర్లక్ష్యానికి చిరుద్యోగుల జీవితాలు బలైపోయాయి. ఈ ఘటనకు కారకులైన ఇద్దరిని బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్‌ పెట్రోలింగ్‌ సిబ్బంది అప్రమత్తతతో నిందితులను పట్టుకోగలిగారు. దావత్‌ చేసుకొని..మద్యం మత్తులో కారును నడిపించిన ఓ వ్యక్తి.. నార్సింగి వద్ద బైక్‌పై వెళ్తున్న దంపతులను ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. వారి ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. అలాగే మాదాపూర్‌ వద్ద నలుగురు పాదచారులను ఢీకొట్టిన ఇద్దరు వైద్యులను స్థానిక పోలీసులు పట్టుకున్నారు. కాగా, మేడ్చల్‌, ఘట్‌కేసర్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో వివిధ కారణాలతో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మరో ఇద్దరు మరణించారు.

మద్యం మత్తులో మరణమృదంగం మోగింది. మందుబాబులు సృష్టించిన రోడ్డు టెర్రర్‌ సోమవారం హైదరాబాద్‌లో కలకలం రేపింది. వీరి నిర్లక్ష్యానికి నలుగురి ప్రాణాలు గాల్లో కలిశాయి. రెండు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ముగ్గురు పిల్లలు అనాథలుగా మారారు. ఒకరు ఆడపిల్ల పుట్టిందని సంతోషంతో దావత్‌ చేసుకుని మత్తులో డ్రైవింగ్‌ చేస్తూ.. ఇద్దరు దంపతులను బలితీసుకోగా.. మరోఘటనలో సాయంత్రం నుంచి ఎంత తాగినా కిక్కు ఎక్కడం లేదని అర్ధరాత్రి వంద స్పీడ్‌తో దూసుకువెళ్లిన సంపన్నులు.. రోడ్డు దాటుతున్న ఇద్దరు యువకులను చంపేశారు. మరోచోట అదుపుతప్పి ద్విచక్ర వాహనంపైనుంచి పడి మృతి చెందగా.. ఇంకోచోట డీసీఎంను తప్పించబోయి పోలీస్‌ వాహనాన్ని ఢీ కొట్టి మృతి చెందాడు. ఇలా ఒక్క రోజే నగరంలో ఆరుగురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అంతేకాకుండా మద్యం మత్తులో వాహనం నడిపిన వైద్యులు నలుగురు పాదచారులను గాయాలపాలు చేశారు. ప్రతి రోజు డ్రంకన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నా.. 304 పార్ట్‌-2 కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తున్నా.. మందుబాబుల్లో మార్పురావడంలేదు.

వారింట్లో.. ఆనందం..వీరింట్లో విషాదం..!

 • ఆడపిల్ల పుట్టిందని ఆనందంతో దావత్‌
 • మత్తులో కారు నడిపి.. ద్విచక్రవాహనాన్ని ఢీ
 • దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతి
 • అనాథలుగా మారిన ముగ్గురు చిన్నారులు
- Advertisement -

మణికొండ, డిసెంబర్‌ 6(నమస్తే తెలంగాణ): ముగ్గురు పసి బిడ్డలు చనిపోయారు. నాల్గవ సంతానం ఆడ పిల్ల పుట్టింది. ఇక ఆ తండ్రి ఆనందానికి అవధుల్లేవు. దోస్తులతో కలిసి ఫుల్‌ దావత్‌ చేసుకున్నాడు. ఆ మత్తు దిగక ముందే కారుతో రోడ్డెక్కాడు. ఎదురుగా వచ్చిన దంపతులను బలితీసుకున్నాడు. దీంతో ముగ్గురు చిన్నారులు అనాథలుగా మారారు. తల్లిదండ్రులు తిరిగిరారని తెలియక.. మమ్మీ.. డాడీ అంటూ రోధిస్తూ.. ఎదురు చూస్తున్నారు. వారింట్లో ఆనందం.. వీరింట్లో విషాధం మిగిల్చింది.

నార్సింగి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…

కోకాపేట్‌ గ్రామానికి చెందిన దుర్గ రాజు(30), మౌనిక(25) భార్యాభర్తలు. వీరికి ముగ్గురు సంతానం. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం రాజు, మౌనిక తమ బంధువులకు సంబంధించిన ఓ పంచాయితీకి హాజరై తిరిగి ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో గండిపేటలోని యూనియన్‌ బ్యాంక్‌లో వారి ఖాతా నుంచి కొంత నగదును విత్‌డ్రా చేసుకుని తమ ద్విచక్రవాహనంపై ఇంటికి బయలు దేరారు. గండిపేట ఓషియన్‌ పార్క్‌ వద్ద రాంగ్‌ రూటులో వస్తున్నారు. అదేసమయంలో మెకిలా ప్రాంతానికి చెందిన సంజీవ కోకాపేటలో ఉన్న తన భార్య, పాపను తీసుకురావడానికి క్వాలిస్‌ కారులో బయలుదేరాడు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో రాంగ్‌రూట్‌లో వస్తున్న దుర్గ రాజు, మౌనికలను సంజీవ తన క్వాలిస్‌తో ఢీకొట్టాడు. వారికి తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతి చెందారు.

ముగ్గురు పుట్టి చనిపోయారు.. నాల్గో సంతానంతో ఖుషీ..

సంజీవకు ఇప్పటి వరకు ముగ్గురు పిల్లలు పుట్టి చనిపోయారు. ఇటీవల అతడికి నాల్గో సంతానంగా ఆడపిల్ల పుట్టింది. ఈ సంతోషాన్ని సంజీవ ఆదివారం తన స్నేహితులతో పంచుకున్నాడు. అర్ధరాత్రి వరకు దావత్‌ చేసుకున్నారు. ఆ మత్తు దిగకముందే భార్య, పాపను ఇంటికి తీసుకురావడానికి తన క్వాలిస్‌తో బయలుదేరాడు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని గుర్తించక ఢీ కొట్టాడు. మద్యం మత్తు కారణంగానే సంజీవ ఎదురుగా వస్తున్న వారిని గుర్తించలేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. అతడి బీఏసీ కౌంట్‌ 180 వచ్చింది.

ముగ్గురు పిల్లలు అనాథలు..

ఈ సంఘటనలో మృతి చెందిన భార్యాభర్తలు రాజు, మౌనికలకు ముగ్గురు సంతానం. వీరి వయస్సు 7, 4, 2 సంవత్సరాలు. తల్లిదండ్రులు మృతి చెందారనే విషయాన్ని వారికి బంధువులు చెప్పకుండా దాచారు. అసలు తమ ఇంటి దగ్గరకు ఎందుకు బంధువులంతా వస్తున్నారు. అసలేం జరుగుతుంది..అని ఆ పిల్లలు గుర్తించలేక బిత్తిరి చూపులు చూస్తున్నారు. తల్లిదండ్రులు తిరిగిరాని లోకానికి వెళ్లారని తెలియని ఆ చిన్నారులు.. మమ్మి, డాడీ ఎప్పుడు వస్తున్నారని అందరినీ అడుగుతుండటతో ప్రతి ఒక్కరూ కన్నీరుమున్నీరవుతున్నారు. ఇప్పుడు ఈ పిల్లలు తల్లిదండ్రులు లేని అనాథలుగా మారారు.

మద్యం మత్తులో వైద్యుల టక్కర్‌

మాదాపూర్‌, డిసెంబర్‌ 6(నమస్తే తెలంగాణ): మద్య సేవించిన వైద్యులు పాదచారులను ఢీకొట్టారు. పాదచారులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘనటకు కారకులైన ఇద్దరు వైద్యులను మాదాపూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండాపూర్‌ ప్రాంతానికి చెందిన వైద్యులు నిఖిల్‌రెడ్డి, అఖిల్‌, తరుణ్‌లు ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో గచ్చిబౌలిలోని ఓ బార్‌లో మద్యం సేవించి తన స్నేహితుడిని కలిసేందుకు బయలుదేరారు. వీరి వెంట మద్యం తాగని తరుణ్‌ కూడా ఉన్నాడు. మద్యం సేవించి ఉన్న నిఖిల్‌ రెడ్డి కారును డ్రైవింగ్‌ చేస్తూ.. ఇనార్బిట్‌ మాల్‌ వద్దకు రాగానే రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న చట్నీస్‌ హోటల్‌ సిబ్బందిని ఢీకొట్టాడు. వారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ప్రమాదం చేసిన నిఖిల్‌రెడ్డి స్థానిక దవాఖానకు తరలించాడు. ఈ సంఘటనపై మాదాపూర్‌ పోలీసులు వైద్యులు నిఖిల్‌రెడ్డి, అఖిల్‌లపై కేసు నమోదు చేశారు.

శభాష్‌ పెట్రోలింగ్‌ పోలీస్‌..

బంజారాహిల్స్‌,డిసెంబర్‌ 6: నేరం జరిగిన వెంటనే నేరస్తుడు ఏ రూట్లో పారిపోయే అవకాశముంది. ఆయా ప్రాంతాల్లో విధులు నిర్వహించే పెట్రోలింగ్‌ పోలీసులు అప్రమత్తమై ఏ విధంగా నిందితులను పట్టుకోవాలనేది.. పోలీస్‌ ఉన్నతాధికారులు తరచూ సిబ్బందికి సూచనలు చేస్తుంటారు. పెట్రోలింగ్‌ సిబ్బంది అప్రమత్తతను పరీక్షించేందుకు నగరంలోని పలు ప్రాంతాల్లో డెకాయ్‌ ఆపరేషన్లు సైతం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్‌ రోడ్‌ నం.2లో మితిమీరిన వేగంతో కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన నిందితులను పట్టుకోవడంలో జూబ్లీహిల్స్‌ పీఎస్‌ పరిధిలోని పెట్రోలింగ్‌ కానిస్టేబుల్‌ సతీశ్‌, హోంగార్డు జితేందర్‌ చూపిన అప్రమత్తత ఉన్నతాధికారుల ప్రశంసలను అందుకుంటున్నారు.

బడాబాబుల మత్తుకు.. చిరుద్యోగులు బలి..!

 • మూడు చోట్ల తాగినా.. కిక్కెక్కలేదని..
 • అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో మళ్ళీ తాగేందుకు..
 • మద్యం మత్తులో.. 100 స్పీడ్‌తో డ్రైవింగ్‌
 • రోడ్డుదాటుతున్న చిరుద్యోగులను ఢీ..
 • ఎగిరి అవతలపడి అక్కడికక్కడే ఇద్దరు యువకులు మృతి
 • అయినా ఆగని కారు..
 • వెంబడించి పట్టుకున్న పెట్రోలింగ్‌ పోలీసులు
 • నిందితులు అరెస్టు..

రాత్రంతా విధులు నిర్వహించి మరో మూడు గంటలైతే ఇంటికి వెళ్లి హాయిగా నిద్రించొచ్చు అనుకున్న చిరుద్యోగులను పీకల దాకా మందేసిన బడాబాబులు పొట్టన పెట్టుకున్నారు. చిరుద్యోగుల జీవన పోరాటం.. బడా బాబుల మందు ఆరాటానికి బలైంది. ఒకటి కాదు రెండు కాదు మూడు చోట్ల మందేసినా కిక్కెక్కలేదంటూ మరో చోట మందు తాగేందుకు వెళ్తూ రోడ్డు దాటుతున్న ఇద్దరు యువకులను ఢీకొట్టారు. గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వెళ్తూ యాక్సిడెంట్‌ చేసి కనీసం వారికి ఏమైనా అయిందేమోనని జాలి కూడా లేకుండా ఉడాయించారు. పొట్టచేతపట్టుకుని నగరానికి వచ్చిన బడుగుజీవులు విగతజీవులుగా మారారు.

బంజారాహిల్స్‌, డిసెంబర్‌ 6 : ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని ఘాజీపూర్‌ ప్రాంతానికి చెందిన అయోద్య రాయ్‌(26) బంజారాహిల్స్‌ రోడ్‌ నం.14లోని నందినగర్‌లో నివాసముంటున్నాడు. ఒడిశాలోని జగత్‌సింగ్‌ పూర్‌ జిల్లా గోపాల్‌ పూరకు చెందిన దేవేందర్‌కుమార్‌ దాస్‌(29) గౌరీశంకర్‌ కాలనీలో అద్దెకు ఉంటున్నాడు. అతడికి ఏడాదిన్నర కిందట వివాహమైంది. భార్య సొంతూర్లోనే ఉంటోంది. వీరిద్దరూ బంజారాహిల్స్‌ రోడ్‌ నం.2లోని రెయిన్‌బో చిన్నపిల్లల దవాఖానలో కిచెన్‌లో పనిచేస్తుంటారు. కాగా ఆదివారం రాత్రి 12.55గంటల ప్రాంతంలో టీ తాగేందుకు బయటకు వచ్చిన వీరద్దరూ తిరిగి ఆస్పత్రిలోకి వెళ్తున్నారు. అదే సమయంలో పంజాగుట్ట వైపునుంచి కేబీఆర్‌ పార్కువైపు మితిమీరిన వేగంతో వచ్చిన ఓ ఫోర్షే కారు( టీఎస్‌ 08 హెచ్‌ఆర్‌ 3344) వీరిని ఢీ కొట్టడంతో ఎగిరి రోడ్డుకు అవతలవైపు పడిపోయారు. ఈ ఘటనలతో వీరిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన కారు ఆగకుండా ముందుకు వెళ్లింది.

జూబ్లీహిల్స్‌ పెట్రోలింగ్‌ సిబ్బంది అప్రమత్తతతో..

రెయిన్‌ బో ఆస్పత్రి ఎదుట రోడ్డు దాటుతున్న ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టి వేగంగా ముందుకు వెళ్లిన కారు జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ మీదుగా రోడ్‌ నం.5లోని ఉమెన్‌ కో ఆపరేటివ్‌ సొసైటీకి వెళ్లింది. కాగా అదే సమయంలో జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.5ప్రాంతంలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న జూబ్లీహిల్స్‌ పెట్రోలింగ్‌ పోలీసులు సతీశ్‌, జితేందర్‌ వేగంగా వస్తున్న కారును గమనించారు. కారు ముందు బాగం దెబ్బతినడంతో పాటు రాంగ్‌రూట్‌లో వస్తుండటంతో ఎక్కడో రోడ్డు ప్రమాదం చేసి ఉంటారని భావించిన పోలీసులు అనుమానంతో కారును వెంబడించారు. ఉమెన్‌ కో ఆపరేటివ్‌ సొసైటీలోని ఓ అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో ప్రమాదానికి కారణమైన పోర్షే కారును పార్క్‌ చేసిన నిందితులు అక్కడ పార్కింగ్‌లో ఉన్న బీఎండబ్ల్యూ తీసుకుని బయటకు వచ్చారు. అప్పటికే అక్కడకు చేరుకున్న పెట్రోలింగ్‌ పోలీసులు వారిని అడ్డుకుని ప్రశ్నించారు. దీంతో కారు నడిపిస్తున్న యువకుడిని కిందకు దింపడంతో పాటు ఫొటోలు తీసుకున్న పెట్రోలింగ్‌ పోలీసులు ఈ విషయాన్ని నైట్‌ డ్యూటీలో ఉన్న ఎస్‌ఐ హరీశ్వర్‌రెడ్డికి తెలిపారు. ఈ ఫొటోలు పరిశీలిస్తున్న సమయంలో బంజారాహిల్స్‌ రోడ్‌ నం.2లో యాక్సిడెంట్‌ చేసిన ఓ కారు జూబ్లీహిల్స్‌ వైపు వెళ్లిందంటూ వైర్‌లెస్‌లో సమాచారం వచ్చింది. దీంతో తక్షణమే స్పందించిన ఎస్‌ఐ హరీశ్వర్‌రెడ్డి పెట్రోలింగ్‌ పోలీసులను అప్రమత్తం చేశాడు. వెంటనే ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను, అతడితో పాటు ఉన్న మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు బంజారాహిల్స్‌ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకుని పీఎస్‌కు తరలించారు.

పబ్స్‌లో మద్యం తాగుతూ..

రోడ్డు ప్రమాదానికి కారణమైన వ్యక్తి ఉప్పల్‌లోని రాఘవేంద్ర కాలనీకి చెందిన బజార్‌ రోహిత్‌ గౌడ్‌(26)గా గుర్తించారు. అతడితో పాటు కర్మన్‌ఘాట్‌కు చెందిన సాయి సోమన్‌ అనే యువకుడితో కలిసి కారులో ఆదివారం సాయంత్రం నుంచి మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లోని పబ్స్‌లో పీకల దాకా మద్యం సేవించినట్లు విచారణలో తెలింది. దుర్గం చెరువు సమీపంలోని ఓలివ్‌ బిస్ట్రో, జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.45లోని ఫ్యాట్‌ పిజియన్‌, బంజారాహిల్స్‌ రోడ్‌ నం.4లోని రాడిసన్‌ బ్లూ ఫ్లాజా హోటల్‌లో మద్యం సేవించిన రోహిత్‌గౌడ్‌, సాయి సోమన్‌లు రాత్రి ఒంటిగంట ప్రాంతంలో మరింత మద్యం సేవించేందుకు పార్క్‌ హయత్‌ హోటల్‌ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో బంజారాహిల్స్‌ రోడ్‌ నం.4లోని రాడిసన్‌ హోటల్‌ నుంచి బయలుదేరి రెయిన్‌బో ఆస్పత్రి మీదుగా వెళ్తూ రోడ్డు దాటుతున్న దేవేందర్‌ దాస్‌, అయోద్యరాయ్‌లను ఢీకొట్టారు. నిందితుడు రోహిత్‌గౌడ్‌కు సోమవారం ఉదయం బ్రీత్‌ అనలైజర్‌ పరీక్షలు నిర్వహించగా 70బీఏసీ పాయింట్లుగా తేలింది. అతడితో పాటు ఉన్న సాయి సోమన్‌కు 50 బీఏసీ పాయింట్లు ఉన్నట్లు తేలింది. ఈ మేరకు నిందితులపై ఐపీసీ 304 పార్ట్‌ 2 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

304-పార్ట్‌ 2 కింద కేసులు

తమ చర్య వల్ల ప్రమాదం జరుగుతుందని తెలుసు.. కాని చంపాలనే ఉద్దేశం ఉండదు. అయినా అలాంటి చర్యకు పాల్పడినవారిపై అభియోగం నమోదు చేస్తారు. ఈ అభియోగం కోర్టు విచారణలో రుజువైతే నిందితుడికి 10 ఏండ్లు జైలు శిక్ష ఖాయం. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మద్యం సేవించి రోడ్డు ప్రమాదాలకు కారణమై అందులో మరణాలు ఉంటే వారిపై 304 పార్ట్‌ 2 కింద కేసులు నమోదు చేస్తున్నారు. దీనికి తోడు లైసెన్స్‌ లేకున్నా వారికి వాహనాలను ఇచ్చినందుకు వాహనాల యజమానులను సైతం నిందితులుగా చేర్చి వారిని కూడా అరెస్టు చేస్తున్నారు. ట్రై కమిషనరేట్‌ పరిధిలో ఏడాదికి దాదాపు లక్షకు పైగా డ్రంకన్‌ డ్రైవింగ్‌ కేసులు నమోదు చేస్తున్నారు. ప్రతి ఒకరికి ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌లో కౌన్సెలింగ్‌ ఇచ్చి కోర్టులో హాజరుపరుస్తున్నారు. జైలు శిక్షలు విధిస్తున్నారు.

వినకపోతే డయల్‌ 100కు ఫోన్‌ చేయాలి

మద్యం సేవించి వాహనాలను నడుపొద్దని, రోడ్లపై ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలనే బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఒక రోడ్డు ప్రమాదం తన సొంత కుటుంబంతో పాటు ఎదుటి వారిలో కూడా తీవ్ర విషాదాన్ని, దు:ఖాన్ని నింపుతుందని గుర్తుంచుకోవాలి. రోడ్డు ప్రమాదాల్లో ఎదుటు వారి ప్రాణాలను తీసే హక్కు ఎవరికీ లేదు. చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇలా ప్రతి ఒక్కరూ మద్యం సేవించి వాహనం నడపడాన్ని నిరోధించాలి. బార్లు, పబ్‌ల యజమానులు కూడా డ్రంకన్‌ డ్రైవింగ్‌ చేసే వారిని వాహనం నడుపకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మందుబాబులు వినకపోతే వెంటనే డయల్‌ 100కు ఫోన్‌ చేయాలి.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement