న్యూఢిల్లీ : సౌర కుటుంబంలో శని గ్రహం చుట్టూ వలయాలు ఉన్నట్టుగానే 46.6 కోట్ల సంవత్సరాల క్రితం భూమి చుట్టూ కూడా ఇలాంటి వలయాలు ఉండి ఉండొచ్చని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఆర్డోవిసియన్ కాలంలో ఈ వలయాలు ఉనికిలో ఉండొచ్చని ‘ఎర్త్ అండ్ ప్లానెటరీ సైన్స్ లెటర్స్’ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది. ఆ వలయాలే ఆ తర్వాత ఉల్కాపాతంగా మారి మాయమై ఉండొచ్చని అంచనా వేసింది. భూమిపై జరిగిన ఉల్కల దాడి తర్వాత టెక్టోనిక్ ప్లేట్లలో జరిగిన గణనీయమైన మార్పును అధ్యయనకారులు గుర్తించారు. ఉల్కలు ఢీకొట్టడం ద్వారా ప్రభావితమైన దాదాపు రెండు డజన్ల బిలాలను అధ్యయనం చేసిన అనంతరం అధ్యయనకారులు ఈ అంచనాకొచ్చారు. ఇవన్నీ భూమధ్య రేఖకు 360 డిగ్రీల లోపలే ఉండడం గమనార్హం.