న్యూఢిల్లీ, నవంబర్ 27: గోప్యత హక్కు సంపూర్ణమేమీ కాదని, దానికి కూడా పరిమితులు ఉంటాయని కేంద్రం పేర్కొన్నది. ఈ మేరకు సుప్రీంకోర్టులో తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది. వ్యక్తిగత డిజిటల్, ఎలక్ట్రానిక్ పరికరాలు, వాటిలోని కంటెంట్‌ను స్వాధీనం చేసుకోవడం, పరిశీలించడం, భద్రపరచడం వంటి వాటికి సంబంధించి దర్యాప్తు సంస్థలను నియంత్రించాలని కోరుతూ పలువురు విద్యావేత్తలు, పరిశోధకులతో కూడిన ఓ బృందం పిటిషన్ వేసింది. పరికరాలను సీజ్ చేసేందుకు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అనుమతి తీసుకొనేలా, నేరానికి ఇవి ఏ విధంగా సంబంధమో తెలిపేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది.
వ్యక్తిగత డిజిటల్, ఎలక్ట్రానిక్ పరికరాలను తిరిగి ఇవ్వడాన్ని వ్యతిరేకించిన కేంద్ర ప్రభుత్వం.. విచారణలో స్వాధీనం చేసుకొన్న పరికరాలను తిరిగి ఇవ్వడానికి సంబంధించి ఎటువంటి నిర్దిష్ట ఆదేశాలు లేవని, అలాంటివి అనుచితమైనవని పేర్కొన్నది. ఈ పిటిషన్ విచారణయోగ్యమైనది కాదని ఆగస్టు 5న కేంద్రం కౌంటర్ ఆఫిడవిట్ వేయగా.. సంతృప్తి చెందని అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పందన తెలియజేయాలని ఆదేశించింది. అయితే కేంద్రం సమాధానం ఇవ్వకపోవడంతో సుప్రీంకోర్టు ఈ నెల 11న ప్రభుత్వానికి రూ.25 వేల జరిమానా విధించి, రెండు వారాల్లో అఫిడవిట్ వేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది.