RGV | సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. సినిమాలతో పాటు సామాజిక, రాజకీయ అంశాలపై కూడా తరచూ స్పందించే ఆర్జీవీ.. తాజాగా జనసేన నేత నాగబాబు, నటుడు ప్రకాష్ రాజ్ మధ్య జరిగిన సోషల్ మీడియా వివాదంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇటీవల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు ఎక్స్ వేదికగా చేసిన ఒక పోస్ట్ చర్చనీయాంశమైంది. “నాయకుడి మాటే శిరోధార్యం. ఏది సరైనదో, ఏది కాదో నాయకుడికే తెలుసు. సందేహాలను పక్కనపెట్టి, ప్రశ్నలు వేయకుండా నాయకుడిని అనుసరించాలి” అనే భావంతో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ఈ పోస్టులో పవన్ కళ్యాణ్ ఫోటోను కూడా నాగబాబు షేర్ చేశారు.
నాగబాబు వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించారు. “మేము గొర్రెలం కాదు, బానిసలమూ కాదు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ప్రతి పౌరుడి హక్కు. ఏ నాయకుడైనా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది” అంటూ ఆయన కౌంటర్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వ్యవహారంపై తాజాగా రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించారు. “ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ సమస్యలను పరిష్కరిస్తాడనే నమ్మకంతో ఒక నాయకుడికి బాధ్యతాయుతమైన పదవిని అప్పగిస్తారు. అతనికి రాజుగా పట్టాభిషేకం చేయరు” అంటూ ఆర్జీవీ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీసింది.
గతంలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన అంశాలపై తరచూ స్పందించిన రామ్ గోపాల్ వర్మ, ఇటీవల కొంతకాలంగా అలాంటి వివాదాలకు దూరంగా ఉన్నారు. అయితే నాగబాబు-ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ వార్ నేపథ్యంలో ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు మరోసారి రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆర్జీవీ వ్యాఖ్యలకు కొందరు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో మరింత హాట్ టాపిక్‌గా మారింది.