ఇటీవల జరిగిన గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్లో తాను దేవున్ని నమ్మనంటూ అగ్ర దర్శకుడు రాజమౌళి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ ఈవెంట్లో తలెత్తిన సాంకేతిక సమస్యతో చిరాకుపడిన రాజమౌళి ‘నేను దేవున్ని నమ్మను. అయితే హనుమంతుడు నాకు అండగా ఉంటాడని మా నాన్న ఓసారి నాతో చెప్పారు. అయినా ఇలా జరిగింది’ అంటూ రాజమౌళి అన్న మాటల పట్ల హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయితే ఈ విషయంలో అగ్ర దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ రాజమౌళికి మద్దతుగా నిలుస్తూ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 మతపరమైన భావప్రకటన స్వేచ్ఛను రక్షణ కల్పిస్తుందని గుర్తు చేశారు. నాస్తికుడిగా ఉండటం నేరమేమీ కాదని అన్నారు.
రాజమౌళి దేవున్ని నమ్మకపోయినా ఆయనకు ఆ దేవుడే అద్భుత విజయాలను అందించాడంటూ తనదైన శైలిలో వ్యంగ్యంగా స్పందించారు. ‘రాజమౌళి దేవున్ని నమ్మకపోతే తన సినిమాల్లో దేవున్ని ఎందుకు చూపిస్తున్నారని కొందరు మూర్ఖులు ప్రశ్నిస్తున్నారు. ఇదే లాజిక్ అయితే..గ్యాంగ్‌స్టర్ సినిమాలు తీసే దర్శకులు గ్యాంగ్స్టర్స్ అయి ఉండాలా? హారర్ సినిమా తీసేవాళ్లు దయ్యాలను నమ్మాలా? అని ప్రశ్నించారు. దేవున్ని నమ్మకుండానే రాజమౌళి గొప్ప స్థాయిలోకి వచ్చాడు కాబట్టి చాలా మంది జెలసీ ఫీలవుతున్నారని, అందుకే ఆయనపై విమర్శలు చేస్తున్నారని ఆర్జీవీ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్‌మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి.