Tollywood Piracy | టాలీవుడ్ సినిమా పైరసీ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన ఐబొమ్మ రవిపై హైదరాబాద్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అతనిపై మొత్తం ఐదు వేర్వేరు కేసులు నమోదు అయినట్లు సమాచారం.
కేసుల వివరాలు చూసుకుంటే.. పైరసీ సెల్ ఇచ్చిన ఫిర్యాదుతో ఒక కేసు నమోదు కాగా, బెట్టింగ్ యాప్ ప్రమోషనల్ వ్యవహారంలో మరో కేసు నమోదైంది. దీనితో పాటు పలువురు సినీ దర్శకులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కూడా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ ఐదు కేసుల విషయంలో పోలీసులు ఐబొమ్మ రవిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. మరోవైపు, ఐబొమ్మ రవిని సైబర్ క్రైమ్ పోలీసులు ఐదు రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. ఇందులో భాగంగా రెండో రోజు కస్టడీలో విచారణను వేగవంతం చేశారు.
ఈ విచారణలో పైరసీ వ్యవహారంలో రవికి ఎవరెవరు సహకరించారు? అతని వెనుక ఇంకెవరి పాత్ర ఉంది? అతను ఒక్కడే ఈ పెద్ద పైరసీ నెట్‌వర్క్‌ను నడిపాడా, లేక గ్రూపుగా పనిచేశారా? ఐబొమ్మ వెబ్సైట్ నిర్వహణకు, వీడియోల అప్లోడ్ చేయడానికి సాంకేతికపరంగా ఎవరు సహాయం అందించారు? అనే కోణాల్లో సైబర్ క్రైమ్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ విచారణ ద్వారా పైరసీ నెట్‌వర్క్‌లోని మరికొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.