హైదరాబాద్ : రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ ప్రచారంపై నమోదైన కేసు దర్యాప్తును సీఐడీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు సెలబ్రిటీలను సిట్ ఇప్పటికే విచారించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ విచారణలో విజయ్ దేవరకొండతో పాటు ప్రకాశ్ రాజ్, రానా తదితరులు హాజరయ్యారు. అయితే ఈ దర్యాప్తులో భాగంగా నటి నిధి అగర్వాల్ (Nidhhi Agerwal), యాంకర్ శ్రీముఖి (Sreemukhi), నటి అమృతా చౌదరి (Amrutha Chowdary) నేడు విచారణకు హాజరయ్యారు. శ్రీముఖి విచారణ ఇప్పటికే పూర్తికాగా.. నిధి అగర్వాల్, అమృత చౌదరిలను అధికారులు ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు.
కొన్ని నెలల కిందట బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో బెట్టింగ్ యాప్‌ల అక్రమ కార్యకలాపాలపై లోతుగా దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం సీఐడీ సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ విచారణ ద్వారా యాప్‌ల నిర్వాహకులు, ప్రమోటర్ల పాత్రపై మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.