షాబాద్, డిసెంబర్ 7: యాసంగిలో రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి వెంకటేశం అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కక్కులూర్, ముద్దెంగూడ, బొబ్బిలిగామ, కొమరబండ తదితర గ్రామాల్లో యాసంగిలో వరికి బదులు ఇతర పంటలు సాగు చేసుకోవాలని వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాసంగిలో తెలంగాణలో ఉత్పత్తి చేయబడిన వరిని భారత ప్రభుత్వం/ఎఫ్‌సీఐ సేకరించడం లేదని తెలిపారు. అందువల్ల యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని చెప్పారు. వరికి బదులుగా పెసర, మినుము, నువ్వులు, పొద్దుతిరుగుడు తదితర పంటలు వేసుకోవాలని సూచించారు. మండలంలోని 41 గ్రామ పంచాయతీల్లో సమావేశాలు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించామని తెలిపారు. కార్యక్రమంలో కక్కులూర్ సర్పంచ్ భానూరి మమత, ఎంపీటీసీ మంగళి కరుణాకర్, ఏఈవో లిఖిత, మాజీ ఎంపీటీసీ జీవన్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్, రైతులు న్నారు.
ఇతర పంటలు సాగు చేయాలి
కొందుర్గు : ప్రస్తుత యాసంగిలో రైతులు వరి పంటకు బదులుగా ఆరుతడి పంటలు వేసుకోవాలని ఏవో మధుసూదన్ అన్నా రు. శ్రీరంగాపూర్, టెకులపల్లి, ముట్పూర్ గ్రామాల్లో ఆరుతడి పంటలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుతడి పంటలు వేసుకోవడం వల్ల అధిక దిగుబడులు వస్తాయని వివరించారు. భూసారం కూడా పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
పంట సాగుపై అవగాహన
శంకర్పల్లి : రైతులు యాసంగిలో వరికి బదులుగా ఆరుతడి పంటలు వేసుకోవాలని శంకర్పల్లి మండల వ్యవసాయాధికారి సురేశ్‌బాబు అన్నారు. మంగళవారం మండలంలోని టంగటూరు గ్రామంలో ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి, పంటల సాగుపై రూపొందించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. కూరగాయలను కూడా యాసంగిలో పండించవచ్చని తెలిపారు. యాసంగిలో వరి ధాన్యాన్ని ఎఫ్‌సీఐ వారు తీసుకునే పరిస్థితి లేక పోవడంతో రైతులు ఇతర పంటలను సాగు చేయాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ గోపాల్, వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు.
ఇతర పంటలే మేలు..
మొయినాబాద్ : వరికి బదులుగా రైతులు ఇతర పంటలు సాగు చేసుకుంటే మేలు జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి ఎన్ రాగమ్మ అన్నారు. ఎన్కేపల్లి గ్రామంలో రైతులకు ఇతర పంటల సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వరి పంట సాగు చేయరాదని సూచించారు. వరి సాగు చేస్తే ధాన్యాన్ని కొనడానికి కేంద్ర ప్రభుత్వం, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిద్ధంగా లేదని చెప్పారు. కార్యక్రమంలో ఏఈవో సునీల్, రైతులు పాల్గొన్నారు.