కాంగ్రెస్ సర్కార్‌లో ‘చీకటి’ సామంతులు రాజ్యమేలుతున్నారు. ముఖ్యనేతలు, కీలక నేతల ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ‘షాడో’లు.. సమాంతర అధికార వ్యవస్థను నడుపుతున్నారు. ఓవైపు అధికారికంగా జరుగాల్సిన పనులను అనధికారికంగా చక్కబెడుతూ, మరోవైపు భూ దందాలు, సెటిల్మెంట్లతో వందల కోట్లు కొల్లగొడుతున్నారు. ఇప్పటికే షాడో సీఎంవో వ్యవహారం రచ్చకెక్కి అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు ప్రభుత్వంలో తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ‘షాడో సీసీఎల్ఏ’ తెరమీదికి వచ్చింది. ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కేంద్రంగా నడుస్తున్నదని, ప్రత్యేక కార్యాలయం, రిటైర్డ్ అధికారులతో కూడిన ప్రైవేట్ సైన్యంతో భారీ భూ దందాలు, సెటిల్మెంట్లు చేస్తున్నదని రెవెన్యూ వర్గాల్లో హాట్‌హాట్‌గా చర్చ జరుగుతున్నది.
హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : రెవెన్యూశాఖకు సంబంధించి సీసీఎల్ఏ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాలు నాంపల్లిలో ఉన్నాయని మాత్రమే అందరికీ తెలుసు. కానీ హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఈ రెండు శాఖలకు అనధికారిక కార్యాలయాలు ఉన్నాయట. ప్రభుత్వంలోని ఓ కీలక మంత్రి నేతృత్వంలో కోకాపేటలో కార్పొరేట్ తరహాలో ప్రత్యేకంగా ఆఫీస్‌ను ఏర్పాటు చేశారని విశ్వసనీయంగా తెలిసింది. ఈ ఆఫీస్ కేంద్రంగా అనధికారిక రెవెన్యూ పాలన సాగిస్తున్నట్టు ఆ శాఖ వర్గాల్లోనే జోరుగా చర్చ జరుగుతున్నది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలకు చెందిన రిటైర్డ్ అధికారులు ఇక్కడి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారని చెప్తున్నారు. వీరు చేసే సెటిల్మెంట్లు, భూ దందాలకు మంత్రి పీఏ మధ్యవర్తిత్వం నెరుపుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మొత్తంగా ఇదొక ‘షాడో సీసీఎల్ఏ’గా పనిచేస్తున్నదని చెప్పుకొంటున్నారు. ఎక్కడ ఏ పని జరుగాలన్నా ఈ కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాల్సిందేనని, లేదంటే ఫైల్ ఇంచు కూడా కదలదనే చర్చ జరుగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విలువైన ప్రభుత్వ భూములు, మరీ ముఖ్యంగా హైదరాబాద్‌తోపాటు శివారు జిల్లాల్లోని భూములపై సదరు మంత్రి కన్నేసినట్టు సమాచారం. ఇందుకోసం హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో జిల్లా రిజిస్ట్రార్లుగా, సబ్ రిజిస్ట్రార్లుగా, ఆర్డీవోలుగా తనకు వంతపాడేవారిని నియమించుకున్నట్టు సచివాలయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. వీరిలో చాలామంది ఓడీలపై ఉన్నట్టు తెలిసింది.
తమ దందాలకు తగ్గట్టుగానే ‘షాడో సీసీఎల్ఏ’ ఆఫీస్‌ను కోకాపేటలోని ఓ అద్దాల మేడలో తెరిచినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఇందులో పని చేసేందుకు రెవెన్యూ, స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖల నుంచి రిటైర్డ్ ఆర్డీవోలు, ఎమ్మార్వోలు, సర్వేయర్లు, సబ్ రిజిస్ట్రార్లను నియమించుకున్నారని, మొత్తంగా డజనుకుపైగా మందితో ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ శాఖ నుంచి ఇటీవలే ఉద్యోగ విరమణ చేసిన మరో ఇద్దరు ఉన్నతాధికారులు తాజాగా ఇందులో చేరినట్టు విశ్వసనీయంగా తెలిసింది. భూ దందాల్లో ఆరితేరడం, అత్యంత విలువైన భూముల సమాచారం తెలిసి ఉండటం, తిమ్మిని బమ్మిని చేయగల సామర్థ్యమే ప్రధాన అర్హతలుగా వీరిని నియమించుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది.
షాడో సీసీఎల్ఏలో వీరికి ఒక్కొక్కరికి ప్రత్యేకంగా చాంబర్లు ఏర్పాటు చేయించినట్టు సమాచారం. వారి ప్రావీణ్యతను బట్టి జిల్లాలను, సబ్జెక్టులను, ఫైళ్లను అప్పగించినట్టు చర్చ జరుగుతున్నది. వీరికి నెలకు రూ.2-5 లక్షల వరకు జీతాలు చెల్లిస్తున్నట్టు చెప్పుకొంటున్నారు. ఇక ఈ ప్రైవేట్ సైన్యానికి ప్రభుత్వంలోని కొందరు ఉన్నతాధికారులు సైతం సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారికి కావాల్సిన సమాచారం ఇవ్వడంతోపాటు అప్పుడప్పుడు ప్రైవేట్ ఆఫీసుకు వెళ్లి ‘విలువైన’ సలహాలు ఇస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
నాంపల్లిలోని సీసీఎల్ఏ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు నామ్‌కే వాస్తే ఉన్నాయని, జరగాల్సిన తతంగం మొత్తం షాడో సీసీఎల్ఏ నుంచే జరుగుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీవోలు, ఎన్వోసీలు, బదిలీలు, పోస్టింగుల ఆర్డర్లన్నీ అక్కడే తయారవుతున్నాయని, సచివాలయం నుంచి బయటకు వస్తున్నాయని రెవెన్యూ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా భూ దందాల్లో షాడో కార్యాలయం అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ప్రైవేట్ సైన్యంలోని అధికారులు ప్రతి జిల్లాలో రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్, ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయాలపై ప్రత్యేకంగా నిఘా పెట్టినట్టు తెలిసింది. భూ వివాదాలకు సంబంధించిన అప్పీళ్లు, తీర్పులు, వ్యాలిడేషన్లు, రిలీజ్ ఆర్డర్లు, విచారణలు ఇలా అక్కడ జరిగే భూ లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. వాటి ఆధారంగా ఫైళ్లు తెప్పించుకొని, సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో విలువైన భూములకు సంబంధించిన ఎలాంటి వివాదమైనా షాడో సీసీఎల్ఏకు రావాల్సిందేనని తెలుస్తున్నది. అక్కడే సెటిల్మెంట్కు ప్రయత్నాలు జరుగుతున్నట్టు చెప్తున్నారు. అక్కడ బేరం కుదిరితేనే.. రెవెన్యూ కార్యాలయాల్లో ఫైల్ కదులుతుందని, పని పూర్తవుతుందని ప్రచారం జరుగుతున్నది. కొన్ని దందాల్లో భూముల్లో వాటా డిమాండ్ చేస్తుండగా, మరికొన్ని దందాల్లో నగదు తీసుకుంటున్నారని సమాచారం. భూములు అయితే కనీసం 30 శాతం వాటా డిమాండ్ చేస్తున్నట్టు చర్చించుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో విలువైన భూములపై వారే వివాదం సృష్టిస్తున్నారని, తర్వాత దాన్ని తొలగించే మార్గాన్ని వారే చూపించి భారీగా దండుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.
ఇలా అనేక భూములను ఉద్దేశపూర్వకంగానే 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారని, ఇప్పుడు వాటిని తొలిగించేందుకు భారీ మొత్తంలో వాటాలు డిమాండ్ చేస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. అక్కడ బేరం కుదిరిన వెంటనే సదరు ఆఫీస్‌కు ఫోన్లు వెళ్తాయని, ఆ తర్వాత పనులు వేగంగా పూర్తవుతాయని రెవెన్యూ వర్గాలు తెలిపాయి. ప్రైవేట్ ఆఫీస్‌తోపాటు సదరు మంత్రి పీఏ నుంచి ఆర్డీవోలకు, ఎమ్మార్వోలకు, జిల్లా రిజిస్ట్రార్లకు ఫోన్లు వెళ్తున్నాయని తెలిసింది. కొన్ని సందర్భాల్లో పీఏ బెదిరింపులకు కూడా దిగుతున్నట్టు అధికారులు తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారట.
విలువైన భూములే టార్గెట్
సదరు మంత్రి విలువైన భూములపైనే కన్నేసినట్టు తెలుస్తున్నది. మరీ ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాలతోపాటు మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం, సిద్దిపేట జిల్లాలను టార్గెట్‌గా పెట్టుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ప్లాన్‌లో భాగంగా ఆయా జిల్లాల రెవెన్యూ విభాగాల్లోని కీలక స్థానాల్లో తనకు వంతపాడేవారినే నియమించుకున్నట్టు రెవెన్యూ, స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో చర్చ జరుగుతున్నది. వీరిలో కీలకమైన ఎనిమిది స్థానాల్లోని అధికారులు ఓడీలపై ఉన్నట్టు తెలిసింది. దీంతో ఆయా జిల్లాల పరిధిలో భూ లావాదేవీలకు సంబంధించి చీమ చిటుక్కుమన్నా సదరు మంత్రికి, ప్రైవేట్ సైన్యానికి తెలిసిపోతున్నదట. వెంటనే వారు రంగంలోకి దిగుతున్నారని చెప్పుకొంటున్నారు.
ప్రైవేట్ సైన్యం చేస్తున్న అరాచకాలకు ఏపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే ఉదంతాన్ని ఉదాహరణగా రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. ఏపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేకు కోకాపేటలో నాలుగు ఎకరాల భూమి ఉండగా, దానిని షాడో సీసీఎల్ఏ ఆదేశాల మేరకు నిషేధిత జాబితాలో పెట్టినట్టు తెలిపాయి. పరిష్కారం కోసం సదరు మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వంలోని ఓ కీలక మంత్రిని ఆశ్రయించినట్టు సమాచారం. ఆయన నిర్మొహమాటంగా ఎకరం భూమిని వాటాగా అడిగినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ విషయాన్ని ఆ మాజీ ఎమ్మెల్యే ఏపీలోని మరో కీలక నేతకు చెప్పగా, ఆయన నేరుగా తెలంగాణలోని ముఖ్యనేతకు ఫోన్ చేసి చెప్పినట్టు సమాచారం. ఈ వివాదం ఇంకా కొనసాగుతున్నదని తెలిసింది. ఇలా సమస్య సృష్టించడం, పరిష్కారానికి వాటాలు అడగడం, బెదిరింపులకు దిగడం పరిపాటిగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటివి కోకొల్లలుగా జరుగుతున్నాయని చెప్పుకొంటున్నారు.