కంటోన్మెంట్. సెప్టెంబర్ 26: ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని పరిపాలన చేతగాక ప్రతిపక్ష పార్టీలపై తప్పుడు ఆరోపణలు చేస్తూ అక్రమ కేసులు పెడుతూ తుగ్లక్ పాలన సాగిస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా కంటోన్మెంట్ మడ్ఫోర్ట్ దోభీఘాట్లో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తామనే భయంతో అసెంబ్లీ నుంచి తమను సస్పెండ్ చేశారని విమర్శించారు.
పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు వారసత్వంగా వచ్చిన భూములను 22 ఏలో కాంగ్రెస్ ప్రభుత్వం చేర్చిందని ఈ అధికారం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. 22ఏ వెనుక ఎలాంటి కుట్రలు ఉన్నాయో ప్రజలకు తెలిసిపోయిందని తమ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్పై నెడుతుందని మండిపడ్డారు.
భూమి కోసం, భుక్తి కోస పేద ప్రజల పక్షాన పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ పోరాటపటిమ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఐలమ్మ త్యాగాలకు గుర్తింపుగా కేసీఆర్ ప్రభుత్వం అధికారికంగా ఆమె జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర బేవరేజేస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జెల నాగేశ్, బోయిన్పల్లి మార్కెట్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, బోర్డు మాజీ వైస్ చైర్మన్ జక్కుల మహేశ్వర్ రెడ్డి రజకసంఘం ప్రతినిధులు శంకర్, సత్యనారాయణ. భాస్కర్, సతీశ్ తదితరులు
పాల్గొన్నారు.