శ్రీనగర్, సెప్టెంబర్ 26: లైంగిక దాడికి గురైన మైనర్ బాధితురాలి విషయంలో ఒక నిర్దిష్ట కేసులోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా గర్భస్రావానికి(అబార్షన్) చట్టం నిర్దేశించిన 24 వారాల గడువు దాటినంత మాత్రాన ఆమెకు రాజ్యాంగపరమైన రక్షణను నిరాకరించలేమని జమ్ము-కశ్మీర్, లద్దాఖ్ హైకోర్టు పేర్కొంది. ఈ పిటిషన్ న్యాయస్థానం పరిశీలనలో ఉన్న సమయంలోనే గర్భం 24 వారాలు దాటడంతో గర్భవిచ్ఛిత్తి కోసం 11 ఏండ్ల బాలిక చేసిన అభ్యర్థనను కోర్టు అనుమతించింది.
వైద్యపరమైన పరిశీలన, నిపుణులు సిఫార్సు చేసిన రక్షణ చర్యలకు లోబడి ఆ ప్రక్రియ కోసం తక్షణమే చర్యలు చేపట్టాలని జస్టిస్ వసీం సాదిక్ వర్గల్ ఈనెల 22న సంబంధిత అధికారులను ఆదేశించారు. అప్పుడు ఆమె గర్భం 22 వారాల ఐదు రోజుల దశలో ఉన్నట్టు నిర్ధారించారు. రక్తస్రావం, ఇన్ఫెక్షన్, రక్త మార్పిడి అవసరం వంటి ప్రమాదాలు ఉన్నప్పటికీ గర్భాన్ని తొలగించడం వైద్యపరంగా సాధ్యమేనని, ఆ ప్రక్రియకు ఆమె శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉందని బోర్డు నిర్ధారించింది. అయితే ఆర్టికల్ 226 కింద ఉన్న రాజ్యాంగపరమైన అధికార పరిధికి అతీతంగా తీర్పులు ఇవ్వొచ్చని న్యాయస్థానం పేర్కొంది.