నా పాటికి నేను ఉత్సాహంగా, ఉల్లాసంగా ఆడుతూ పాడుతూ కాసేపు డిగ్రీ పుస్తకాలు, మరి కాసేపు పత్రికలు, నవలలూ చదువుతున్న రోజుల్లో నా జీవితం ఒక మలుపు తిరిగింది. మలుపు అనగానే అదేదో పెద్దదని భయపడకండి, ఊరికే సస్పెన్స్ ఉండాలని అట్లా రాసానంతే!
ఒక రోజు మా ఇంటికి దగ్గరలో ఉన్న సత్తెమ్మ అనే కోమట్లావిడ మా యింటికి వచ్చింది. వాళ్లకు పెద్ద రైస్‌మిల్లు, వడ్లు కొని అమ్మే వ్యాపారం ఉంది. ఇంకా వాళ్లుండే పెద్ద ఇల్లు కాక రైస్‌మిల్‌ను ఆనుకొని మూడు పోర్షన్ల ఇల్లు, రైల్వే స్టేషన్ దగ్గరలో మరో ఇల్లు ఉండేవి. మూడు పోర్షన్లలో ఎవరో ఉద్యోగులు ఉండేవారు. మరో ఇంట్లో వాళ్ల చిన్న కొడుకు కుటుంబం ఉండేది. సత్తెమ్మ చాలా సమర్థురాలనీ, నిర్వహణ అంతా ఆమే చూస్తుందనీ అందరూ చెప్పుకొనేవారు.
ఇంతకూ సత్తెమ్మ మా ఇంటికి వచ్చింది ఎందుకంటే వాళ్ల ఇద్దరు అమ్మాయిలకు ట్యూషన్ చెప్పమని నన్ను అడుగుదామని. ‘నా బిడ్డలిద్దరు ఒక్కటే క్లాసు. వాండ్లకు బళ్లే పాఠాలు సరిగ అయిత లెవ్వు. సార్లు మంచిగ చెప్పుతలేరా, లేకుంటె వీండ్లకు అర్థమయిత లెవ్వా తెలుస్తలేదు. మీ అమ్మాయి చక్రవర్తి సారింట్ల ఒక్క నెల రోజులు లెక్కలు చెప్పినప్పుడు మా పిల్లలకు మంచిగ అర్థమయినయట. గందుకే ట్యూషన్ చెప్పమని అడుగుదామని వచ్చిన. ఆడిపిల్లలను ఎటు పడితే గటు మగ టీచర్ల దగ్గరికి, వాండ్ల ఇండ్లకు పంపలేము గాదండీ! మీ అమ్మాయి మా ఇంటికి వచ్చినా సరే! లేకుంటె మీ ఇంటికి మా పిల్లలను పంపుమన్నా సరే! మీ ఇంటికయితే నాకు ఎటువంటి భయం లేదు. పిల్లలను పంపగలుగుత! చదువు చెప్పుకుంటూ నాలుగు మంచి మాటలు గూడ చెప్తరని నా ఆశ. మీరంటే మాకు శాన గౌరవం. నా మాట కాదు అనకండి’ అని అమ్మానాన్నలతో అన్నది. అసలు ఆమె వచ్చి రాగానే నాన్నతో మాట్లాడుతుండగా అమ్మను పిలిచాడు. ఆమె వెళ్లిపోయాక ‘మీరు మాట్లాడొచ్చు గద, నన్నెందుకు పిలిచిన్రు? ఆమె ఏమన్న మిమ్ములను మింగుతదా?’ అని అమ్మ కాసేపు నాన్నను బనాయించింది. ‘అరె! నేనేం మాట్లాడుతనమ్మా ఆడోండ్ల తోటి? నిన్ను పిలిస్తే తప్పా?’ అన్నాడు నాన్న. అది వేరే సంగతి లెండి!
‘ఇంతకూ నేను ట్యూషన్ చెప్పడమేంటి?’ అని కాసేపు ఆశ్చర్యపోయాను. అప్పుడప్పుడే ఇంటర్ దాటి డిగ్రీలో అడుగు పెట్టిన దాన్ని. ఇంకా ఆడుతూ, పాడుతూ, జామ చెట్లు ఎక్కి కాయలు కోసుకుంటూ, చెట్లూ, పుట్టలూ, పొలం గట్లూ పట్టుకుని తిరుగుతూ ఉండేదాన్ని. నాకు నేనే చదువుకుంటూ.. ఎవరైనా ఓ గురువు దొరికితే బాగుంటుందని అనుకుంటూ ఉన్నదాన్ని. ఇట్లా క్రమం తప్పకుండా పాఠాలు చెప్పగలనా అనిపించింది. నాన్న ఎప్పుడూ మమ్మల్ని అడగకుండా మా గురించి నిర్ణయాలు తీసుకునేవాడు కాదు, మా తరఫున ఎలాంటి హామీలు కూడా ఇచ్చేవాడు కాదు. అందుకని నన్ను పిలిచి ‘పాపం! ఆమె ఇంత దూరం మన ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది. వాండ్ల పిల్లలకట నువ్వు ట్యూషన్ చెప్తవా? నీ ఇష్టం మరి’ అని అడిగాడు.
వాళ్లిద్దరూ కూడా ఎయిత్ క్లాస్‌లో ఉన్నారు. నాకెటూ తోచక ఏం చేయమంటావని అమ్మని అడిగాను. ‘నువ్వు చదువుకున్న పాఠాలే కదా, టెన్త్ క్లాస్ వరకు నువ్వు నీ తోటి పిల్లలకు ఇదివరకు చెప్పిన దానివే! నీకు కూడా కొంచెం టైం పాస్ ఉంటది. ఎడ్డి ముచ్చట్లు, పిచ్చి ఆటలకు బదులు ఇది మంచిదే గద!’ అని ‘నా మాటే శాసనం’ అన్న లెవెల్లో ఒక విధంగా డిసైడ్ చేసింది అమ్మ.
నాకు కూడా అప్పటికి వేరే పనేమీ లేదు కనుక సరే అన్నాను. ఆ మర్నాటి నుండే అక్కాచెల్లెళ్లిద్దరూ రావడం మొదలుపెట్టారు. అక్క స్వయంజ్యోతి, చెల్లెలు ఉమామహేశ్వరి. ఇద్దరిలో ఉమామహేశ్వరి చదువులో బాగా తెలివైనది. స్వయంజ్యోతి అప్పటికే ఓణీలు వేసుకునేది, చాలా అందంగా ఉండేదా అమ్మాయి. మంచి సంస్కారవంతురాలు, ఎంతో వినయంగా ఉండేది. పది రోజులు గడిచేసరికి బిలబిలమంటూ ఎంతోమంది పిల్లలు మేమొస్తాం, మేము కూడా వస్తామంటూ వచ్చి నా దగ్గర చేరారు. అందరూ కూడా సెవెంత్, ఆపై క్లాసుల వాళ్లే. నాకు బయట ఇంత ఫాలోయింగ్ ఉందా అనుకుని కొంచెం గర్వపడబోయాను! కానీ… శ్రద్ధగా, పర్సనల్ కేర్‌తో చదువు చెప్పేవాళ్లు లేరని కొందరు, బడి నుంచి ఇంటికి రాగానే పిల్లలు ఎటో బజార్లు తిరుగుతారు లేదా ఆడతారని మరికొందరు, బాగా చదువుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుందని ఇంకొందరు అనుకుని ఎవరో ఒకరు కాసేపు కదలకుండా కూర్చోబెడితే చాలనుకుని నా దగ్గరికి పంపుతున్నారని అర్థమయి, ‘అంత లేదమ్మా!’ అనుకున్నాను.
నా ట్యూషన్ ఫీజు నెలకు ఒక్కరికి పది రూపాయలుగా సత్తెమ్మ నిర్ణయించడంతో, మిగతా పిల్లలందరూ అదే ఫాలో అయ్యారు. నిజానికి అప్పటికి కూడా అది తక్కువే. కానీ, నా సమయం విలువ, శ్రమ విలువ నాక్కూడా అప్పటికి తెలియదు. పైగా బేరాలాడడం అస్సలు రాదు. బోలెడంత మొహమాటం కూడా. ఎవరినైనా నాకు రావాల్సిన డబ్బుల గురించి అడగాలన్నా ఈనాటికీ నా వల్ల కాదు. అందుకని నేనేమీ అడగలేదు. అలా 1978 లో నా పదహారవ ఏట నెలకు రెండు వందల దాకా సంపాదించిన నేను అంతకు ఎన్నో రెట్లు ఆ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాను. రానురానూ 1984 వచ్చేసరికి బయట ఒక్కో స్టూడెంట్‌కి 150 తీసుకునే రోజుల్లో నేను 50 తీసుకుని కూడా నెలకు వెయ్యి రూపాయలు సంపాదించే స్థితికి వచ్చాను. ఆ తొలి సంపాదన నాకెంతో ధైర్యాన్నీ, ఆత్మ విశ్వాసాన్నీ ఇచ్చింది. అంతకు ఎన్నో రెట్లు ఆ పిల్లల ప్రేమాభిమానాలు, గౌరవం నాకు దక్కాయి. అలా నా టీచర్ అవతారం మొదలైంది.