ది మిస్టరీస్ ఆఫ్ ద్వారకా-6
అన్ని ప్రశ్నలకు రుద్ర కరెక్ట్‌గా సమాధానాలు ఇవ్వడంతో నవరత్నాలన్నీ కలిసి ఒక పెద్ద మణిగా మారింది. అలా మారగానే, ఆ మణి వెలుగులో కొన్ని మాటలు ఇలా కనిపించాయి. ‘ఇది శమంతకమణి.. దీన్ని దక్కించుకోవడం అంత సులువు కాదు.. కొంచెం మెదడు వాడితే దీన్ని ఇట్టే పసిగట్టవచ్చు’ అని కొన్ని అక్షరాలు కనిపించాయి.
ఆవాక్యం రుద్ర చదవడం పూర్తి చేశాడో లేదో.. శమంతకమణి పది భాగాలుగా విడిపోయి.. ఒకే సైజులో ఒకేరకమైన పది రత్నాలుగా తయారయ్యాయి. ఇది చూసిన రుద్ర అండ్ టీమ్ ఆశ్చర్యపోయారు. అసలేం జరుగుతుందో అర్థంకాక ఒకరి ముఖాలు ఒకరు చూసుకొన్నారు. ఇంతలో ఆ 10 రత్నాలపై సూర్యకాంతి ప్రసరించి ఆ వెలుగులోంచి కొన్ని మాటలు ఇలా వినిపించాయి. ‘శమంతకమణి గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఎందుకో తర్వాత మీకే అర్థం అవుతుంది. ముందు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి.. ద్వాపరయుగంలో సత్రాజిత్తు అనే మహారాజు భక్తికి మెచ్చి సూర్యుడు ప్రసాదించిందే ఈ శమంతకమణి. ఈ మణి రోజుకి 8 బారువుల బంగారం ఇస్తుంది.
8 బారువులు అంటే దాదాపు వంద కిలోలు. ఈ మణి ఎక్కడుంటే అక్కడ కరువు కాటకాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించవు. సత్రాజిత్తు ఓసారి శ్రీ కృష్ణుడికి ఈ మణిని చూపించాడు. కృష్ణుడు అడిగినా ఇవ్వలేదు. ఈ మణిని సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు మెడలో ధరించి ఓసారి వేటకు వెళ్లాడు. అయితే, ఈ మణిని మాంసం ముక్క అనుకొన్న ఓ సింహం ప్రసేనుడిని చంపేసి మణిని తీసుకెళ్లిపోయింది. ఆ సింహంతో పోరాడి మణిని సాధించిన జాంబవంతుడు దాన్ని తన కుమార్తె జాంబవతికి ఇచ్చాడు. అయితే, మణి కోసం ప్రసేనుడిని కృష్ణుడే చంపాడని నింద వచ్చింది. తనపై పడిన నిందను మాపుకొనేందుకు శ్రీ కృష్ణుడు ఆ మణిని వెతుకుతూ వెళ్లి జాంబవంతుడితో పోరాడి ఆ మణిని తీసుకొచ్చి సత్రాజిత్తుకి తిరిగి ఇచ్చాడు.
అప్పుడు సత్యభామతో పాటూ ఆ మణిని కూడా సత్రాజిత్తు కృష్ణుడికి ఇచ్చేశాడు. ఇలా మరికొన్ని ఘటనలు జరిగాయి. చివరికి తన నిర్యాణానికి సమయం ఆసన్నమయ్యిందని తెలుసుకొన్న కృష్ణుడు.. సూర్యుడిని ప్రార్థించి ఈ మణిని తిరిగి ఇచ్చేసి…అవతారం చాలించాడు. ఇప్పుడు సూర్యప్రభతో మళ్లీ ఈ మణి మీకు దక్కాలంటే ఈ 10 రత్నాల్లో శమంతకమణి ఎక్కడ ఉందో మీరు కనిపెట్టాలి. తప్పు జరిగిందో.. శంబాలకు శమంతకం చేరుతుంది. జాగ్రత్త! మణిని కనిపెట్టడానికి ముందు నేను చెప్పిన శమంతకమణి కథతో శ్లోకం చదవండి’ అంటూ మాటలు ఆగిపోయాయి.
ఇది విన్న అందరూ షాకయ్యారు. రామస్వామి మాట్లాడుతూ.. ‘సార్.. శమంతకమణి చరిత్రను నేను ఇప్పటికే చదివా. అయితే, ఈ శంబాలా ఏమిటీ?’ అంటూ ప్రశ్నించాడు. దీనికి ధరణి స్పందిస్తూ.. ‘యుగాంతంలో కల్కి జన్మించేది ఈ శంబాలలోనే అని కొందరు చెప్తారు. భగవంతుడి రాక కోసం ఎదురుచూస్తూ.. శమంతకమణి అక్కడే వేచి ఉంటుందని కూడా అంటారు. అందుకేనేమో.. తప్పు జరిగిందో.. శంబాలకు శమంతకం చేరుతుంది అని ఆ హెచ్చరిక చేశారు’ అని ధరణి ముగించకముందే.. ‘మరి, శమంతకమణి కోహినూరు డైమండ్ ఒక్కటే అని, వాషింగ్టన్లో ఉన్న హోప్ డైమండ్ కూడా శమంతకమణినే అనే ప్రచారం కూడా జరుగుతుంది కదా’ అన్న స్నేహిల్ ప్రశ్నకు అదేమీ రుజువు కాలేదని ధరణి సమాధానమిచ్చింది. ఇంతలో హరిశ్వ కలుగజేసుకొంటూ.. ‘పూరీ జగన్నాథ్ విగ్రహం హృదయంలో ఉన్న బ్రహ్మపదార్థమే ఈ శమంతకమణి అని చెప్తారు కదా.. ఇంకొందరు ఈ మణికి సోమనాథ్ ఆలయానికి ముడి పెడ్తారు కదా’ అని ప్రశ్నించాడు. అవన్నీ ఊహాగానాలేనని, నిరూపించే ఆధారాలేమీ ఇంకా లభించలేదని ధరణి సమాధానం ఇచ్చింది. ఇంతలో కలుగజేసుకొన్న జయ.. ‘సమయం మించిపోతున్నది. ముందు మనం.. ఈ 10 రత్నాల్లో శమంతకమణి ఏంటో కనిపెట్టాలి. దాని తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం’ అన్న జయ మాటలతో అందరూ అవునంటూ తలూపారు.
అయితే, అదృశ్య వ్యాఖ్యలు చెప్పిన శమంతకమణి కథతో శ్లోకం ఎలా? అని అందరూ ఆలోచనలో పడగానే, శ్లోకాన్ని పఠించడం మొదలు పెట్టాడు రుద్ర. ‘సత్రాజితో మణిం లబ్ధ్యా సూర్యదత్తం మహాప్రభమ్.. ప్రసేనో మృగయాం యాతః సింహేన నిహతో వనే’ అంటూ రుద్ర పూర్తి చేయగానే.. సూర్యకాంతిలో కొన్ని మాటలు ఇలా వినిపించాయి. ‘ఈ పది రత్నాల్లో ఒక్క రత్నం మినహా మిగతా 9 రత్నాలు సమాన బరువుతో ఉన్నాయి. ఆ మినహాయించిన అధిక బరువు ఉన్న రత్నమే శమంతకమణి. పక్కనున్న త్రాసును మూడుసార్లు మాత్రమే ఉపయోగించి శమంతకమణిని గుర్తించాలి. తప్పుగా గుర్తిస్తే, శంబాల నగరానికి శమంతకం ప్రయాణమవుతుంది. సరిగ్గా శమంతకాన్ని గుర్తించారో.. మీ లక్ష్యం నెరవేరినట్టే. మీకు 10 సెకండ్ల సమయం మాత్రమే’ అంటూ ఆ మాటలు ముగియగానే అందరూ కంగారుపడిపోయారు. అయితే, రుద్ర వాయువేగంతో పజిల్‌ను సాల్వ్ చేసి శమంతకమణిని గుర్తించాడు. ఎలాగో మీరు చెప్పగలరా?
– రాజశేఖర్ కడవేర్గు