బీఆర్ఎస్కు గతం తప్ప భవిష్యత్తు లేదని, ఆ పార్టీ కాలపరిమితి ముగిసిందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సెలవిచ్చారనే వార్త దిగ్భ్రాంతి కలిగిస్తున్నది. కాంగ్రెస్‌లో చేరిన కొన్నేండ్లకే సీఎం అయిన రేవంత్ ఇలా వ్యాఖ్యానించడం వింతగా ఉన్నది. తాజాగా ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఇలా నోరు పారేసుకోవడం ఆయన రాజకీయ పరిజ్ఞానానికి అద్దం పడుతున్నది.
బీఆర్ఎస్పై రేవంత్ వ్యాఖ్యలు విన్నవారికి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఐదు నెలలకు జాతిపిత మహాత్మాగాంధీ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. రాజకీయపక్షంగా కాంగ్రెస్ అవసరం తీరిపోయిందని, ఇక అది ప్రజాసేవలో నిమగ్నమయ్యే సంస్థగా మారిపోవాలని 1948 జనవరిలో గాంధీజీ కోరారనే విషయం జగమెరిగిన సత్యం. దేశ విముక్తి కోసం పోరాడిన భారత జాతీయ కాంగ్రెస్ ఉద్యమ పార్టీగా నిర్వహించిన పాత్ర బాపూజీకి తెలుసు. అదేవిధంగా స్వాతంత్య్రం రావడానికి కొంతకాలం ముందు, వచ్చిన తర్వాత కొన్ని నెలలపాటు పాలకపక్షంగా కాంగ్రెస్ నడక ఎలా అడ్డదిడ్డంగా ఉందో గాంధీకి ఎరుకే. విభిన్న సిద్ధాంతాలను నమ్మిన అనేక రాజకీయ పక్షాలతో కూడిన గొడుగు సంస్థ కాంగ్రెస్ దేశ ప్రజల స్వేచ్ఛాస్వాతంత్య్రాల కోసం ఎలా పోరాటం నడిపిందీ ఈ శాంతిదూతకు స్వీయానుభవమే.
సామ్యవాద భావాలున్న సోషలిస్టులు, కమ్యూనిస్టులు..కాంగ్రెస్ లోపల ఉనికిలో ఉన్న కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ (సీఎస్పీ)లో కొనసాగారు. కాంగ్రెస్‌లో ఉంటూనే నేటి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తండ్రి, రాజీవ్ ముత్తాత మోతీలాల్ నెహ్రూ బయట స్వరాజ్ పార్టీ నడిపారు. స్వాతంత్య్రం సిద్ధించిన 1947 ఆగస్ట్ 15 నాటికే భారత్‌కు విముక్తి ఒక్క కాంగ్రెస్ వల్లే వచ్చిందనే ప్రచారం ఊపందుకుంది. పలువురు మహానేతలు, అనేక రాజకీయ సంస్థల ఉమ్మడి కృషితో ఎదిగిన ‘బ్రాండ్ కాంగ్రెస్’ పేరు చెప్పుకుని కాంగ్రెస్ నేతలు నానారకాలుగా పండ్లు అమ్ముకుంటారనే విషయం 1948 జనవరి నాటికి కలుగబట్టే ఆ పార్టీని రద్దు చేయాలని, దానిని ఇకనుంచి ‘లోక్ సేవక్ సంఘ్’ అనే ప్రజా సేవా సంస్థ పేరుతో నడుపాలని గాంధీ తన వీలునామాలో ఆకాంక్షించారు.
కాంగ్రెస్ భవిత్యంపై చెప్పిన మాటలను తన హత్యకు మూడు రోజుల ముందు గాంధీజీ రూపొందించిన ప్రతిపాదనలతో కూడిన సలహా (నోట్)లో పొందుపరిచారు. స్వతంత్ర భారతంలో కాంగ్రెస్ అనుసరించాల్సిన నియమావళిలో చేర్చడానికి గాంధీ కొన్ని ప్రతిపాదనలు ఈ నోట్లో రాశారు. ఈ అంశాలను కాంగ్రెస్ విస్తృత చర్చావేదిక ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) చర్చించి ఆమోదించాలనేది బాపూ ఆకాంక్ష.
1948 జనవరి 30న మతోన్మాద శక్తుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయే నాటికే అప్పటి అధికారపక్షం కాంగ్రెస్ దృష్టిలో చెల్లని నాణెంగా గాంధీ మారారు. కాంగ్రెస్ కాలపరిమితి ముగిసిందనే మాటలు ఆయన నోటి నుంచి రాలేదు. రాజకీయ అధికారం కోసం ఇతర పార్టీలతో పోటీపడే రాజకీయపక్షంగా కాంగ్రెస్ ఇక ఉండకూడదని మాత్రమే గాంధీ కోరుకున్నారు. అంతేగానీ నేటి కాంగ్రెస్ సీఎం రేవంత్ మాదిరిగా ఆ పార్టీకి గతమేగానీ, భవిష్యత్తు లేదంటూ హేతుబద్ధంకాని సూత్రీకరణలు చేయలేదు.
కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ కావాలని కోరుకున్న పలువురు నేతలు, కార్యకర్తలతో పాతికేండ్ల క్రితం 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్) అవతరించింది. 2001 స్థానిక సంస్థల ఎన్నికలకు కొన్ని నెలల ముందు పురుడుపోసుకున్న టీఆర్ఎస్ ఆ ఎన్నికల్లో గణనీయ విజయాలు సాధించింది. సుదీర్ఘ పోరాటంలో భాగంగా వచ్చిన 2004, 2009 పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలతో పొత్తు పెట్టుకోవటానికి కూడా టీఆర్ఎస్ వెనుకాడలేదు. 2004, 2009 సాధారణ ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో ఈ ఉద్యమ పార్టీ చెప్పుకోదగ్గ చారిత్రక విజయాలు సాధించింది.
టీఆర్ఎస్ అకుంఠిత దీక్షతో పదమూడేండ్లకు పైగా సాగిన ఉద్యమం ఫలితంగా 2014 జూన్‌లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. అదే సమయంలో ఏప్రిల్‌మేలో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటరిగా పోరులో దిగింది. ఫలితంగా తెలంగాణ అసెంబ్లీలో మెజారిటీ సీట్లు సాధించింది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ నాయకత్వాన మొదటి ఐదేండ్ల పాలనలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతుబంధు వంటి వినూత్న పథకాలతో బంగారు తెలంగాణ లక్ష్యం దిశగా వడివడిగా అడుగులు వేసింది. నీళ్లు, నియామకాలు, నిధుల విషయంలో రాష్ట్ర ప్రజలకు న్యాయం జరిగేలా కృషి ప్రారంభించింది. అప్పటికే దాదాపు పదిహేనేండ్లలో రాజధాని హైదరాబాద్‌లో సాధించిన వినూత్న అభివృద్ధిని కేసీఆర్ సర్కార్ శరవేగంతో ముందుకు తీసుకెళ్లింది.
‘తెలంగాణ వస్తే హైదరాబాద్‌కు కుంటినడక తప్పదు’ అనే విష ప్రచారం దుష్ప్రచారం మాత్రమేనని కేసీఆర్ సర్కార్ నిరూపించింది. నిండైన ఆత్మవిశ్వాసంతో తన మొదటి పదవీకాలం ముగియటానికి ఆరు నెలల ముందే 2018 డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిపించారు కేసీఆర్. ఈ ఎన్నికల్లో తెలంగాణ తొలి పాలకపక్షం టీఆర్ఎస్ తన బలాన్ని బాగా పెంచుకున్నది. ఆ తర్వాత ఐదు సంవత్సరాల పాలనలో (20182023) రాష్ట్ర ప్రజానీకం కోసం కేసీఆర్ ఎన్నెన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు రూపొందించి పకడ్బందీగా అమలు చేశారు.
2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పాలకపక్షంగా మారింది. ఈ ఎన్నికలకు కేవలం ఆరేండ్ల ముందు..అంటే 2017లో పార్టీలో చేరిన రేవంత్‌రెడ్డి నాయకత్వాన కాంగ్రెస్ పాలన ఎలాంటి గందరగోళాలు, సంక్షోభాల మధ్య గత రెండున్నరేండ్లుగా సాగుతున్నదో చూస్తూనే ఉన్నాం. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశాన్ని కాంగ్రెస్ 54 ఏండ్లు పరిపాలించింది.
అనేక దశాబ్దాలపాటు కేంద్రం, అత్యధిక రాష్ర్టాల్లో పాలకపక్షం కాంగ్రెసే. 1977లో ఈ పార్టీ ఆధిపత్యానికి అడ్డకట్ట పడే వరకూ ఆడిందే ఆటపాడిందే పాట. అలాంటి కాంగ్రెస్ గత పన్నెండేళ్లుగా కేంద్రంలో ప్రతిపక్షంగానే కొనసాగుతున్నది. ఈ పార్టీకి గుర్తింపు పొందిన ప్రతిపక్షంగా లోక్‌సభలో హోదా దక్కింది మాత్రం 2024లోనే. ఇప్పుడు దేశంలోని 28 రాష్ర్టాల్లో కేవలం మూడుచోట్ల (హిమాచల్, కర్నాటక, తెలంగాణ) హస్తం పార్టీ అధికారంలో ఉన్నది. అయినా, భవిష్యత్తు అంతా తమదే అన్నట్టు రేవంత్‌రెడ్డి వంటి కాంగ్రెస్ నేతలు భ్రమాజనిత లోకంలో విహరిస్తున్నారు.
– నాంచారయ్య మెరుగుమాల