హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు బషీర్‌బాగ్‌లోని ఎస్సీఈఆర్టీ ప్రాంగణంలో ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు ఈ ఫలితాలను విడుదల చేస్తారని వెల్లడించారు. విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ డాక్టర్ నవీన్ నికోలస్లు కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. మార్చి 14 నుంచి మే 13వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించగా, 5.15 లక్షల మంది విద్యార్థులు హాజరైనట్టు తెలిపారు. కాగా, ఈ ఫలితాల కోసం https://www.ntnews.com, https:// telanganatoday.com వెబ్సైట్లను సంప్రదించవచ్చు.
పదో తరగతి ఫలితాలను తొలిసారిగా వాట్సాప్ ద్వారా తెలుసుకునే వెసులుబాటును అధికారులు కల్పించారు. ఇందుకోసం విద్యార్థులు 8096958096 నంబర్‌ను సంప్రదించాలి. ఇప్పటికే వాట్సాప్ ద్వారా హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్న వారికి ఆటోమెటిక్‌గా ఫలితాలు వస్తాయి. డౌన్లోడ్ చేయని వారు పైన పేర్కొన్న నంబర్‌కు హాయ్ అని సందేశం పంపించాలి. ఆపై ఎస్సెస్సీ రిజల్ట్స్ అని టైపు చేసి వారి హాల్‌టికెట్ నంబర్‌ను నమోదు చేస్తే వెంటనే ఫలితాలు ప్రత్యక్షమవుతాయి.