BuildNow Portal | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 28 ( నమస్తే తెలంగాణ ) : సామాన్యులు సైతం సులభంగా ఇంటి నిర్మాణ, లే అవుట్ అనుమతులు పొందేలా ‘బిల్డ్‌నౌ’ విధానాన్ని అందుబాటులో కి తెచ్చామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, ఆచరణలో అది అంతా డొల్ల అని తేలిపోయింది. బిల్డ్‌నౌ యూజర్ ఫ్రెండ్లీగా పనిచేస్తుందని, డ్రాయింగ్స్ పరిశీలన నిమిషాల్లోనే పూర్తవుతుందని, ఇంటి అనుమతులు సులభతరం అవుతాయంటూ ఈ నెల 20న రవీంద్రభారతి వేదికగా ‘బిల్డ్‌నౌ’ విధానానికి శ్రీకారం చుట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇదే వేదికగా ముగ్గురికి ఇంటి అనుమతుల పత్రాలను కూడా మంజూరు చేశారు. ఇది జరిగి ఎనిమిది రోజులైనా ఈ విధానం ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. అనేక లోపాలు వెంటాడుతునే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న టీజీ బీ-పాస్ విధానాన్ని ఏప్రిల్ 2 నుంచి పూర్తిస్థాయిలో నిలిపివేస్తున్నట్టు ఇప్పటికే టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులు ప్రకటించారు. ప్రాసెస్‌లో ఉన్న దరఖాస్తులు తప్ప కొత్తవి బిల్డ్‌నౌ విధానంలోనే తీసుకుంటామని తేల్చి చెప్పారు. అనుమతుల కోసం బిల్డ్‌నౌను ఆశ్రయిస్తున్న దరఖాస్తుదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఓసీ (ఆక్యుపెన్సీ సర్టిఫికెట్/భవన ని ర్మాణం పూర్తయిన తర్వాత ఇచ్చేది), ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్)కు సంబంధించిన ఆప్షన్స్ ఈ విధానంలో కనబడటం లేదని నిర్మాణదారులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
జీహెచ్ఎంసీలో ఇంటి నిర్మాణ అనుమతులకు ఏ స్థాయిలో దరఖాస్తులు వస్తాయో, అంతే స్థాయిలో భవన నిర్మాణం పూర్తి చేసుకున్నాక సదరు యాజమాని ఓసీ (ఆక్యుపెన్సీ సర్టిఫికెట్) పొందేందుకు దరఖాస్తులు చేసుకుంటారు. జీహెచ్ఎంసీ పరిధిలో రోజూ వందల సంఖ్యలో ఓసీ దరఖాస్తులు కొత్తగా వస్తుంటాయి. బిల్డ్‌నౌ విధానంలో ఓసీ ఆప్లికేషన్కు అవకాశం లేదు. దరఖాస్తు సమయంలో ఈ ఆప్షన్ కనబడటం లేదు. దీనికి తోడుగా ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) అనుమతులకు స్థానం కల్పించలేదు. టీడీఆర్ పత్రం కలిగిన వారు, జీహెచ్ఎంసీ బహుళ అంతస్థుల భవనాల నిర్మాణానికి ఇచ్చే అనుమతికి అదనంగా చేపట్టే నిర్మాణ వైశాల్యాన్ని నిబంధనలను అనుసరించి క్రమబద్ధీకరించుకోవచ్చు. టీడీఆర్‌తో అదనపు అంతస్థు కట్టాలనుకునే వారికి నిరాశే ఎదురవుతున్నది. వచ్చే నెల 2 నుంచి టీజీ బీ-పాస్ ఉండదని చెప్తున్న అధికారులే… వారం రోజుల ముందు నుంచే పాత విధానంలో ఏ ఒక్క అనుమతినీ తీసుకోకపోవడం పట్ల నిర్మాణదారులు, అర్కిటెక్ట్‌లు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
టీజీ బీ-పాస్ నిర్వహణను సాఫ్ట్‌టెక్ కంపెనీ చూస్తున్నది. ఈ కంపెనీకి సంబంధించిన దాదాపు 30 మందికిపైగా ఉద్యోగులు జీహెచ్ఎంసీలో పనిచేస్తున్నారు. కొత్త విధానం రాకతో వీరి ఉద్యోగాలకు ఫుల్స్టాప్ పడనున్నది. ఒకరిద్దరు మినహా పాత వారిని అందరినీ పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నెల వ్యవధిలో అందరికీ నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
ఏదైన నూతన విధానాన్ని ఆమలు చేసే ముందు పూర్తిస్థాయిలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి. ఎదురయ్యే సమస్యలను ముందే అంచనా వేసి అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ బిల్డ్‌నౌ విధానంలో ఇదే లోపించింది. నిర్మాణ అనుమతులను నిర్ణీత కాలవ్యవధిలో పొందడంతోపాటు అన్ని అనుమతులను సింగిల్‌విండో సిస్టంలో తీసుకునేలా రూపొందించామని, దేశంలోనే తొలిసారిగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ టెక్నాలజీతో రూపొందించిన బిల్డ్‌నౌ నిర్మాణరంగ అనుమతుల్లో నూతన విప్లవం అని ప్రభుత్వం చెప్తున్నది. కానీ, కొత్త విధానం ఆమల్లోకి వచ్చి ఎనిమిది రోజులు గడిచినా కొన్ని అనుమతులకు అవకాశం కల్పించలేదు. నూతన విధానం అమలులో సమస్యలు రావడం సహజమని, తొలి ఆరు నెలలపాటు సమస్యలు ఏదో రూపంలో వస్తుంటాయని అధికారులు చెప్తున్నారు. దీనినిబట్టి వచ్చే ఆరునెలలపాటు అధికారులకు, నిర్మాణాదారులకు ఇబ్బందులు తప్పవనే సంకేతాలు కనబడుతున్నాయి.