జర్నలిస్టులకు అసలు అక్రెడిటేషన్లు ఎందుకివ్వాలి? ఏ ఇతర వృత్తులకూ లేనివిధంగా జర్నలిస్టులకు మాత్రమే ప్రభుత్వం అక్రెడిటేషన్ కార్డులు ఎందుకు ఇవాల్సి వస్తున్నది? ఈ విషయంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి గానీ, న్యూ అక్రెడిటేషన్స్ పాలసీ-2025 రూపకర్తలకు గానీ ఏ కొంచెమైనా స్పష్టత ఉన్నదా? అనే అనుమానం కలుగుతున్నది. లేకపోతే, మునుపెన్నడూ లేనిరీతిలో అక్రెడిటేషన్ల జారీ ప్రక్రియ ఇంత వివాదాస్పదంగా మారడమేంటి? ఉమ్మడి రాష్ట్ర పాలన నుంచి ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ప్రభుత్వానికి, జర్నలిస్టులకు మధ్య ఎంతో సామరస్యపూర్వక వాతావరణంలో ప్రతి రెండేండ్లకోసారి ఒక పద్ధతి ప్రకారం జరిగే అక్రెడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఇప్పుడు న్యాయస్థానాల మెట్లు ఎక్కడం ఏమిటి? బడ్జెట్లో వివిధ సంక్షేమ పథకాలకు కోతలేసినట్టుగానే ఇప్పటికే ఉన్న అక్రెడిటేషన్ కార్డుల సంఖ్యను కుదించేలా నిబంధనలు రూపొందించడం ఏమిటి?
నిజానికి, అక్రెడిటేషన్ కార్డు అనేది సంక్షేమ పథకం కాదు; రేషన్‌కార్డు లాంటిది అంతకన్నా కాదు. అదొక వృత్తిపరమైన గుర్తింపు కార్డు. ‘ఈ వ్యక్తి జర్నలిస్టు. వార్తలు సేకరించడం ఇతని వృత్తి. సమాజంలో జరిగే వివిధ సంఘటనలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందించేవాడు’ అని ప్రభుత్వం ఇచ్చే ఐడెంటిటీ కార్డు! నిజానికి, జర్నలిజం వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరికీ విధిగా అక్రెడిటేషన్లు జారీ చేయడం వల్ల ప్రభుత్వాలకు పోయేదేమీ ఉండదు. పైగా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తలెత్తే తలనొప్పులు కూడా తప్పుతాయి. అంతేకాకుండా, వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు సంబంధించిన సమగ్ర డాటా ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉంటుంది. మీడియా విస్తృతి పెరుగుతున్న నేపథ్యంలో ఇది అవసరం కూడా.
ఒకప్పుడు కేవలం పదుల సంఖ్యలో మాత్రమే పత్రికలు, న్యూస్ చానళ్లు ఉండేవి. ఆయా సంస్థల్లో పనిచేసే జర్నలిస్టుల సంఖ్య కూడా తక్కువగానే ఉండేది. దీంతో వార్తల కవరేజీ కోసం వచ్చిన జర్నలిస్టులను రాజకీయ నాయకులు, అధికారులు, పోలీసులు, ఇంజినీర్లు, వైద్యులు, సినీ ప్రముఖులు లాంటి వారు కూడా తేలికగా గుర్తించి పలుకరించేవారు! తమ ద్వారా ప్రజలకు చేరాల్సిన సమాచారాన్ని అధికారికంగానే కాకుండా ‘ఆఫ్ ద రికార్డ్’గా కూడా ఎటువంటి సంకోచం లేకుండా జర్నలిస్టులకు అందించేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి అలా లేదు.
పత్రికలు, శాటిలైట్, కేబుల్ న్యూస్ చానళ్లతోపాటు వెబ్సైట్లు, ఈ-పేపర్లు, యూట్యూబ్ చానళ్లు తదితర రూపాల్లో డిజిటల్ మీడియా విస్తరిస్తున్నది. వాటి మధ్య పోటీ కూడా పెరుగుతున్నది. మరే భాషలోనూ లేనివిధంగా తెలుగు రాష్ర్టాల్లో మండల స్థాయి దాకా రిపోర్టింగ్ నెట్‌వర్క్‌తోపాటు ప్రతి జిల్లాకూ ప్రత్యేకంగా డెస్క్‌లు ఏర్పాటయ్యాయి. ఇటు ప్రభుత్వాలు కూడా కొత్త జిల్లాలు, కొత్త మండలాలు, కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేస్తున్నాయి.
ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. తదనుగుణంగా మీడియా సంస్థలు కూడా తమ నెట్‌వర్క్‌ను విస్తరించుకోవాల్సిన అనివార్యత ఏర్పడుతున్నది. ఈ నేపథ్యంలో వివిధ మీడియా సంస్థల కోసం పనిచేస్తున్న జర్నలిస్టుల సంఖ్య కూడా పెరుగుతున్నది. అందుకనుగుణంగా ప్రభుత్వం అక్రెడిటేషన్లు జారీ చేయాల్సిన అవసరం ఉన్నది.
వృత్తి నిర్వహణలో జర్నలిస్టుల పరిధి చాలా విస్తృతమైనది. రాజకీయ సభలు, సమావేశాలు, ప్రభుత్వ యంత్రాంగం నిర్వహించే అధికారిక కార్యక్రమాలను కవర్ చేయడమే కాదు; వానలు, వరదలు, భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు, రైలు, రోడ్డు, విమాన ప్రమాదాలు, నేరాలు, ఘోరాలు ఇలా ఎక్కడ ఏ ఘటన జరిగినా ఉన్నపళంగా పరుగెత్తి, వివిధ కోణాల్లో సమాచారం సేకరించి, ప్రజలకు అందిస్తారు. కేవలం ఘటనలను రిపోర్ట్ చేయడమే కాకుండా రాబోయే ప్రమాదాల గురించి కూడా ప్రజలను అప్రమత్తం చేసే బాధ్యతను సైతం నిర్వర్తిస్తారు. ఆయా ఘటనల తీవ్రతను బట్టి ఒక్కోసారి ఎక్కువ సంఖ్యలో జర్నలిస్టులు ఘటనా స్థలానికి చేరుకుంటారు. ధర్నాలు, రాస్తారోకోలు, బంద్లాంటి సమయాల్లో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్లు కూడా గాయపడిన సంద్భాలు చాలా ఉన్నాయి.
ఒకవైపు విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, సందట్లో సడేమియా అన్నట్టు అసాంఘిక శక్తులు ప్రవేశించడం సమస్యాత్మకంగా మారుతున్నది. ఇలాంటి సందర్భాల్లో ఘటనా స్థలంలో గుమిగూడిన వారిలో ఎవరు జర్నలిస్టులో, ఎవరు అసాంఘిక శక్తులో నిర్ధారించుకొనేందుకు పోలీసులకు సహాయపడేది ప్రభుత్వం జారీచేసిన అక్రెడిటేషన్ కార్డులే! మరోవైపు, కొంతమంది తాము అసలు జర్నలిస్టులే కాకపోయినప్పటికీ, ‘ప్రెస్’ అంటూ సొంతంగా ఐడీ కార్డులు ముద్రించుకొని, ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ పరిణామం అసలైన జర్నలిస్టులకు కూడా ఇబ్బందికరంగానే మారుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు నిజమైన జర్నలిస్టో, ఎవరు నకిలీయో గుర్తించేందుకు దోహదపడేది ప్రభుత్వం జారీ చేసే అక్రెడిటేషన్ కార్డులే! అందుకే, ఇది ఆషామాషీ వ్యవహారం కాదు.
ప్రభుత్వం చిత్తశుద్ధితో, పారదర్శకంగా, ఎటువంటి లోపాలకు తావులేకుండా నిర్వర్తించాల్సిన ప్రక్రియ. దురదృష్టవశాత్తు, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన అక్రెడిటేషన్ పాలసీ-2025 అందుకు విరుద్ధంగా ఉన్నదనేది జర్నలిస్టుల ఆవేదన. ఈ పాలసీ వల్ల తమకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని, అందులోని లోపాలను ప్రస్తావిస్తూ కొంతమంది హైకోర్టును ఆశ్రయించారంటేనే పరిస్థితి తీవ్రత అర్థమవుతున్నది. అక్రెడిటేషన్ల జారీ విషయంలో అర్థరహితమైన నిబంధనలు, పరిమిత కోటా విధానాలు పెట్టి కొందరికి మాత్రమే గుర్తింపు కార్డులు ఇచ్చి,మరికొందరికి నిరాకరించడమంటే వృత్తి నిర్వహణలో వారికి ఆటంకాలు కలిగించడమే అవుతుంది.
పత్రికల సర్క్యులేషన్, న్యూస్ చానళ్ల రేటింగ్‌లు, వెబ్సైట్లు, యూట్యూబ్ చానళ్ల వ్యూయర్షిప్తో సంబంధం లేకుండా, ఆయా సంస్థల్లో పనిచేసే ప్రతి జర్నలిస్టుకూ వార్తా సేకరణలో సమానావకాశాలు, సమాన వసతులు, సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఎందుకంటే, జర్నలిజం అనేది కేవలం వృత్తి మాత్రమే కాదు; అదొక సామాజిక బాధ్యత. ఈ కర్తవ్య నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లు, అడ్డంకులు, ఇబ్బందులను అధిగమించడానికి ప్రాథమికంగా ఉపయోగపడేవి వారి వద్ద ఉండే గుర్తింపు కార్డులే.