హైదరాబాద్ : తెలంగాణ యువ ఇంజినీర్ల ప్రతిభను ‘ క్రిమినల్ వేస్ట్’ ( Criminal Waste ) అంటూ అవమానించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అహంకారానికి నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి.రామారావు ( KTR ) మండిపడ్డారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. వెంటనే యువ ఇంజినీర్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ యువత సామర్థ్యాన్ని కించపరిచేలా మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి ఏముందని ప్రశ్నించారు. తన జీవితంలో ఎప్పుడైనా ఒక పోటీ పరీక్ష రాశారా? ఏదైనా ఉద్యోగానికి ఇంటర్వ్యూకు హాజరయ్యారా? ఏదైనా వృత్తిపరమైన సంస్థలో పనిచేసిన అనుభవం ఉందా? అంటూ నిలదీశారు. రేవంత్ రెడ్డి గతాన్ని ప్రజలు మరచిపోలేదని, రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా ప్రారంభమైన ఆయన ప్రయాణం బ్లాక్మెయిల్ రాజకీయాల వరకు వెళ్లిందని విమర్శించారు.
దివాళా తీసిన కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవిని కొనుగోలు చేసి అధికారంలోకి వచ్చిన వ్యక్తి, దేశానికి సాంకేతిక నిపుణులు, ఇంజినీర్లను అందిస్తున్న తెలంగాణ యువతను అవమానించడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. తెలంగాణ యువత కృషి, ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతుండగా, వారిని అవమానించే వ్యాఖ్యలను ముఖ్యమంత్రి వెంటనే ఉపసంహరించుకుని రాష్ట్ర యువతకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.