‘అధికారులెవరూ నా మాట వినడం లేదు. నేనిచ్చిన ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారు. తీవ్రం నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు’ ఈ నిస్సహాయత వ్యక్తం చేసింది సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే. తన మాటలు ఎవరూ వినడం లేదంటూ ముఖ్యమంత్రే ఇలా నిస్సహాయత వ్యక్తంచేయడం గమనార్హం.
హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): వర్షాకాల సన్నద్ధతపై హైదరాబాద్ ఎంసీఆర్హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్‌లో ఉన్నతాధికారులతో ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జూన్ 9న కోర్ అర్బన్ రీజియన్‌లో కురిసిన వర్షం కారణంగా ఏర్పడిన పరిస్థితులపై ఆయన ఆరా తీశారు. సైబరాబాద్‌తోపాటు అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడటాన్ని ప్రస్తావించారు. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ మున్సిపల్, పోలీస్, ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తం కాలేదని పేర్కొన్నారు. వర్షాల సన్నద్ధతపై జూన్ 1న సమీక్ష నిర్వహించి తాను స్వయంగా అనేక సూచనలు చేశానని గుర్తుచేశారు. అయినా అధికారులు తన మాట వినకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పారు.
జూన్ 9న వర్షం సమయంలో మున్సిపల్, పోలీస్ అధికారుల మధ్య సమన్వయం లోపించిందని తెలిపారు. ‘నేను చెప్తే వినరు, శాఖల మధ్య సమన్వయం లేదు, అధికారుల మధ్య సమన్వయం లేదు. ఇలా అయితే ఎలా?’ అని ప్రశ్నించారు. వర్షాల సమయంలో అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టాలని స్పష్టంచేశారు. అలసత్వంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వర్షాల సమయంలో అన్నిశాఖల అధికారులు రోడ్లపైకి రావాల్సిందేనని, అవసరమైతే తాను కూడా రోడ్డుపైకి వస్తానని ముఖ్యమంత్రి చెప్పారు. వర్షం కారణంగా ట్రాఫిక్ సమస్య ఏర్పడితే ఇకపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
సర్కార్ నిర్లక్ష్యం ప్రజలకు ప్రాణ సంకటంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కీలకమైన వర్షాకాలానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై ప్రభుత్వం ఇప్పటివరకు పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. ‘ఎవరికి వారు యమునా తీరే’ అన్నట్టుగా సీఎం పైపై సమీక్షలు చేయడం, మంత్రులెవరూ పట్టించుకోకపోవడం, ఇదే అదునుగా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో క్షేత్రస్థాయిలో పరిస్థితులు భయానకంగా మా రాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్లపై నీళ్లు నిలిచి, చెట్లు కూలి, విద్యుత్తు స్తంభాలు, వైర్లు తెగిపోయిన దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే విద్యుదాఘాతంతో ఆరుగురు మృత్యువాత పడ్డారు. శనివారం నగరంలో కురిసిన భారీ వర్షానికి చెట్లు విరిగిపడటంతో విద్యుత్తు తీగలు సైతం తెగిపోయాయి. దీంతో విద్యుత్తు షాక్‌కు గురై తండ్రి, కూతురు ప్రాణాలు విడిచారు. సంగారెడ్డిలో మరొకొరు విద్యుత్తు షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయారు.
ఈ నెల 9న నగరంలో కురిసిన చిన్నపాటి వర్షానికి నగరం అస్తవ్యస్తమైంది. ఐటీ కారిడార్ నరకప్రాయకంగా మారింది. ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోవడంతో నగరమంతా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. కిలోమీటరు దూరం ప్రయాణానికి 3 గంటల పట్టిందంటే పరిస్థితి మారింది. ఓవైపు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ అందుకు తగ్గట్టుగా రక్షణ, సహాయ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం, అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం, మంత్రుల నుంచి ఆదేశాలు, సూచనలు లేకపోవడంతో అధికారులు సైతం అదే విధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. తన మాట అధికారులు వినడం లేదని స్వయంగా ముఖ్యమంత్రే అంటే.. రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వ్యవసాయ సీజన్‌కు అధికారులు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. ముఖ్యంగా విత్తనాలు, యూరి యా పంపిణీపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. యూరియా స్టాక్ , పంపిణీ కోసం స్థానిక వ్యవసాయ అధికారిని బాధ్యుడిగా నియమించడంతోపాటు రెవెన్యూ సిబ్బందిని కూడా భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు.