హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని తలసేమియా, సికిల్‌సెల్ ఎనీమియా బాధితులకు పింఛన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అర్హులను గుర్తించి వచ్చే పంద్రాగస్టు నుంచి పింఛన్లు పంపిణీ చేయాలని సూచించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై మంత్రి సీతక్కతో కలిసి ముఖ్యమంత్రి గురువారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని వితంతు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులందరికీ సంతృప్తికర స్థాయిలో పింఛన్లు మంజూరు చేయాలని ఆదేశించారు. దివ్యాంగులు చనిపోయినప్పుడు వారి భార్యలకు తక్షణమే పింఛన్లు ఇవ్వాలని చెప్పారు. మండల స్థాయిలో అన్ని శాఖల పరిధిలో చేపట్టే అభివృద్ధి పనులను ఎంపీడీవోలు పర్యవేక్షించేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
మండల పరిషత్తు సమావేశాలను 45 రోజులకు ఒకసారి నిర్వహించాలని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించాలని సూచించారు. రాష్ట్రంలోని తారు రోడ్డు లేని ఊరు ఉండవద్దని సీఎం అన్నారు. ప్రతి పంచాయతీకి పంచాయతీ కార్యాలయం నిర్మించాలని చెప్పారు. కోటి మంది మహిళలకు పంపిణీ చేసే చీరలు పూర్తి నాణ్యతతో, ఆకట్టుకునే డిజైన్లలో ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఇందిరమ్మ చీరలకు మహిళల నుంచి మంచి స్పందన వచ్చినందున, నాణ్యత, రంగుల విషయంలో ఎటువంటి రాజీపడొద్దని చెప్పారు.
ఎల్‌నినో నేపథ్యంలో తాగునీటి సరఫరాలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గ్రామీణ తాగునీటి పథకాల పరిధిలో పనిచేసే వారికి ఎట్టి పరిస్థితుల్లో అయిదో తేదీలోపు వేతనాలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. సమీక్షలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ శ్రీధర్, పీఆర్, ఆర్డీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దానకిశోర్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, సీఈవో సెర్ప్ దివ్యా దేవరాజన్ తదితరులు పాల్గొన్నారు.