Revanth Reddy | హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): ‘ఈసా నది సమీపంలో ఉన్న మధుపార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ఎంతకాలం ఉన్నా జీరో వ్యాల్యూయే.. ఈరోజు కాకపోయినా రేపైనా ఆ అపార్టుమెంట్‌ను కూల్చివేస్తాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి తేల్చిచెప్పారు. మూసీ, ఈసా నదుల బఫర్‌జోన్ పరిధిలో ఉన్న భవన నిర్మాణాలను కూల్చివేస్తామని, అధీకృత అనుమతులతో భవన నిర్మాణాలు చేపట్టినా.. 2012 నాటి ‘సుప్రీంకోర్టు, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలకు అనుగుణంగా లేకపోతే కూల్చివేత తప్పదని హెచ్చరించారు. హైదరాబాద్ జ్యోతిబాఫూలే భవన్లో ఆదివారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో సీఎం పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. మధుపార్కు అపార్టుమెంట్ బాధితులు ప్రభుత్వం ఇచ్చే పరిహారం తీసుకొని వేరే చోటుకు వెళ్లిపోవాల్సిందేనని పరోక్ష హెచ్చరికలు జారీచేశారు.
కాకుంటే అపార్టుమెంట్లో తెలిసిన జర్నలిస్టు మిత్రులున్నందున.. వారికి కొంత మెరుగైన పరిహారం ఇస్తామని, అది తీసుకొని మరోచోట కట్టుకోవాలని హుకూం జారీచేశారు. మేటి నగరాలతో పోటీ పడేలా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రణాళికలు రూపొందించినట్టు చెప్పారు. హైదరాబాద్‌లో చెత్త పేరుకుపోవడానికి, దోమలు పెరగడానికి మూసీ నది కాలుష్యమే కారణమని చెప్పారు. దోమలను పారదోలడానికి మూసీ ప్రక్షాళనే ఏకైక మార్గం స్పష్టంచేశారు. ఢిల్లీలో యమునా రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, యూపీలో గంగా నది ప్రక్షాళన, గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు చేపట్టినట్టే తాను కూడా మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు చేసి తీరుతానని రేవంత్‌రెడ్డి తేల్చిచెప్పారు.
‘సుప్రీంకోర్టు, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాల మేరకు మూసీ నది బఫర్‌జోన్ విషయంలో 2012లో నిబంధనలు రూపొందించారని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. నాలా బఫర్‌జోన్ ఎంత ఉండాలి, చెరువులైతే ఎంతుండాలి, నదులైతే ఎంతుండాలనేది ఆనాడే ఖరారు చేశారని పేర్కొంటూ చట్టాలను ఉటంకించారు. మూసీ నది వెంట నాలా అయితే 10 మీటర్లు, నదికి 50 మీటర్ల బఫర్ జోన్ ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని, కాలుష్యకారక మూసీ నది పునరుజ్జీవ కార్యక్రమంలో భాగంగా బఫర్‌జోన్‌లో ఉన్న నిర్మాణాలను కూల్చి వేస్తామని తేల్చి చెప్పారు. నిర్వాసితులకు ప్రభుత్వం సరైన సహాయం అందిస్తుందని, ప్రాజెక్టును అడ్డుకోవడం కన్నా బాధ్యత కలిగిన వారంతా నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించడం లేదా వారికి మరే ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వంతో చర్చించవచ్చు’ అని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 18 ఏండ్లు నిండి కళాశాలలో చదువుతున్న విద్యార్థినులకు ఎలక్ట్రికల్ సూటీలు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. విద్యార్థినులకు ఉచిత స్కూటీలు ఇవ్వటం ద్వారా వారి విద్యకు, స్వావలంబనకు మరింత తోడ్పాటు లభిస్తుందని పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణలో భాగంగా హైదరాబాద్‌లో తిరిగే ఆర్టీసీ బస్సులను 2026 డిసెంబర్ 9 నాటికి నూరుశాతం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టబోతున్నామని వెల్లడించారు. అనంతరం ముఖ్యమంత్రి మహిళా జర్నలిస్టులను సతరించారు.
సోషల్ మీడియాలో ప్రచారమయ్యే వార్తలు, సమాచారంపై నియంత్రణ కోసం కొత్త చట్టాన్ని తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నదని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలపై ప్రజలు ఫిర్యాదులు చేసే విధంగా ప్రత్యేక చట్టాన్ని తేవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిపారు. ఈ అంశంపై త్వరలోనే అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పారు. నిజం, అబద్ధం.. తోడు నీడ వంటివని, నిజమైన జర్నలిస్టులకు, జర్నలిస్టుల ముసుగులో వ్యాపారాలు, వ్యవహారాలు చేసే వారికి తారతమ్యం ఉన్నదని తెలిపారు.
మధుపార్ రిడ్జ్ అపార్టుమెంట్ ఈసా నది ఒడ్డున ఉన్నదని, నది బఫర్‌జోన్‌ను నాలా అని చూపించి అకడ బిల్డర్ అపార్ట్మెంట్ కట్టారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆ అపార్ట్‌మెంట్‌పై బ్యాన్ విధించామని, దానిలోని ప్లాట్లు అమ్ముకోవడానికి, కొనడానికి వీలులేదని చెప్పారు. 2012 చట్టంప్రకారం మూసీ, ఈసా నది ఒడ్డున 50 మీటర్ల బఫర్‌జోన్‌లో ఎవరూ నిర్మాణాలు చేపట్టవద్దని, ఏదైనా నిర్మించినా వాటిని తొలగించాలని ఎన్జీటీ, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నాయని తేల్చి చెప్పారు. అది నివాసయోగ్యానికి అనుకూలంగా ఉంటుందేమో కానీ, అది ఎంతకాలం ఉన్నా జీరో వ్యాల్యూయేనని తెలిపారు.
ఈసా నది బఫర్‌జోన్‌లోని 7 ఎకరాల్లో ఉన్న మధుపార్క్ అపార్టుమెంట్‌ను ఇవ్వాళ కాకుంటే రేపు అయినా కూలగొడతామని స్పష్టం చేశారు. ఈ అపార్ట్‌మెంట్‌కు బదులుగా 7 ఎకరాల ప్రభుత్వం స్థలం కేటాయించి ఇప్పుడు ఎంత పరిమాణంలో నిర్మాణం జరిగిందో అంతే నిర్మాణానికి అవసరమయ్యే నిధులను బ్యాంకులో డిపాజిట్ చేస్తామని హామీ ఇచ్చారు. నష్టపరిహారం తీసుకొని వేరే చోట కొనుగోలు చేసుకుంటామన్నా అభ్యంతరం లేదని చెప్పారు. రాజకీయ నాయుకులు అకడికి వచ్చి సానుభూతి చూపుతున్నారని, సానుభూతితో ఈ సమస్యకు పరిషారం కాదని పేర్కొన్నారు.