Pharma City | హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): ఫార్మా విలేజ్ల ప్రతిపాదనపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఫార్మా అనగానే ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో పునరాలోచనలో పడింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల ప్రాంతంలో సిద్ధం చేసిన ఫార్మాసిటీలోనే జనరల్ ఇంజినీరింగ్ పార్క్‌ను ఏర్పాటు చేయాలని, అనంతరం అక్కడే ఫార్మా విలేజ్‌ను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు పారిశ్రామిక వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
ఫార్మాసిటీకి బదులుగా రాష్ట్రం నలువైపులా 10 ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన కాంగ్రెస్ సర్కారు.. తొలుత వికారాబాద్, జహీరాబాద్ ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేసేందుకు నోటిఫికేషన్ జారీచేసిన విషయం విదితమే. కానీ, ఆ జిల్లాలోని లగచర్లలో ఫార్మా విలేజ్ భూసేకరణపై ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవడంతో రావడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. అక్కడ ఫార్మా విలేజ్ స్థానంలో ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది.
జహీరాబాద్‌లో సైతం ఫార్మా విలేజ్ పట్ల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో అక్కడ లగచర్ల రైతుల తిరు గుబాటు తరహా ఘటనలు తలెత్తకుండా చూ సేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. భూసేకరణ కోసం బలప్రయోగానికి దిగితే అక్కడ కూడా ప్రజలు తిరగబడే అవకాశం ఉన్నదని ప్రభుత్వానికి నివేదించినట్టు సమాచారం. దీంతో ప్రజావ్యతిరేకతను మరింత పెంచుకోవడం కంటే ఉన్న అవకాశాలను వినియోగించుకోవడమే ఉత్తమమని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
ఫార్మాసిటీ స్థానంలో జనరల్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసేందుకు టీజీఐఐసీ ఇప్పటికే లేఅవుట్‌ను కూడా సిద్ధం చేసింది. అక్కడ ముందుగా ఫార్మా పరిశ్రమలను కాకుండా సాధారణ పరిశ్రమలతోపాటు కాలుష్యానికి ఆస్కారంలేని ఔషధ కంపెనీలను అనుమతించాలని నిశ్చయించినట్టు తెలిసింది. ఔషధ పరిశ్రమలో ఫార్ములేషన్లు, బల్క్‌డ్రగ్స్ తయారీ విభాగాలు ఎంతో కీలకమైనవి. ఇవి కాలుష్యాన్ని సృష్టించేవి కావడంతో తొలుత రసాయనాల శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేయాలని, ఆ తర్వాతే ఔషధ పరిశ్రమలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం. ఇలా చేస్తే రద్దయిన ఫార్మాసిటీ మళ్లీ మనుగడలోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.