హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తేతెలంగాణ): ‘బీఆర్ఎస్ పాలనలో రోడ్లపై తిరిగే వాళ్లను, ఆర్ఎంపీ డాక్టర్‌ను టీజీపీఎస్సీ (తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్) మెంబర్లను చేశారు.. వాళ్లు పల్లీ బఠాణీల లెక్క క్వశ్చన్ పేపర్లను అమ్ముకున్నరు’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ముస్లిం పిల్లలు ఏదైనా చూస్తేనే నేర్చుకుంటరు.. చదువుకుంటే మరచిపోతరు’ అంటూ అవహేళనగా మాట్లాడారు. అలాంటి వారికి స్కిల్స్ నేర్పించేందుకే హైదరాబాద్‌లోని నాలుగు ఐటీఐలను ఏటీసీ (అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు)లుగా అభివృద్ధి చేశామని చెప్పుకొచ్చారు. గురువారం హైదరాబాద్‌లోని కుమ్రంభీం ఆదివాసీ భవన్లో నిర్వహించిన మైనారిటీ ఎక్స్‌లెన్స్ సమ్మిట్‌కు హాజరైన సీఎం.. ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులు, ఉద్యోగాలు సాధించిన ముస్లిం మైనారిటీ యువకులను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ వచ్చిన తర్వాత నిఖత్ జరీన్‌కు రూ.3 కోట్లు ఇచ్చానని, పదో తరగతి పాసైన క్రికెటర్ సిరాజుద్దీన్‌ను డీఎస్పీని చేశానని చెప్పుకొన్నారు. క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన అజారుద్దీన్ ఎమ్మెల్యేగా ఓడిపోయారని, అలాంటి ఆయనకు మంత్రి పదవి ఇచ్చి తన పక్కన కూర్చోబెట్టుకున్నానని చెప్పారు. నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీచేసి ఓటమిపాలైనా షబ్బీర్ అలీని ప్రభుత్వ సలహాదారుగా పెట్టుకున్నానని తెలిపారు. పాతబస్తీలోని ముస్లింలకు విద్యుత్తు చోరీ చేస్తారనే అపవాదు ఉన్నదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తున్నందున ఇప్పుడు అలాంటి సమస్యలు లేకుండా పోయాయని పేర్కొన్నారు. ‘సర్’ ప్రక్రియ ముసుగులో కొందరు ఓటు చోరీకి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం నియమించిన బీఎల్వోలు సక్రమంగా పనిచేయకపోయినా మీరంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మైనారిటీ ఎక్స్‌లెన్స్ సమ్మిట్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ముస్లింలను, మంత్రి అజారుద్దీన్‌ను, ప్రభుత్వ సలహాదారును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో వేదికపై ఉన్నవారు, సభికులు తీవ్ర ఆశ్చర్యం వ్యక్తంచేశారు. వారికి తానే పదవులు ఇచ్చానని చెప్పుకోవడం, ముస్లిం పిల్లలు చూస్తేనే నేర్చుకుంటారని మాట్లాడటంపై లోలోన అసంతృప్తిని వ్యక్తంచేశారు. ఓ వైపు ముస్లింలను ఉద్ధరించింది కాంగ్రెస్సేనని చెప్పుకొంటూనే మరోవైపు అవమానించేలా మాట్లాడటంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేయడం కనిపించింది.
టీజీపీఎస్సీ సభ్యులను అవమానించేలా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీజీపీఎస్సీ మాజీ మెంబర్ సుమిత్రా ఆనంద్ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఇప్పటికైనా సీఎం వాస్తవాలు మాట్లాడాలని, మరోసారి టీజీపీఎస్సీలో మెంబర్లుగా పనిచేసిన తమను అవమానిస్తే సహించేదిలేదని హెచ్చరించారు. కేసీఆర్ ఉన్నతవిద్యావంతులనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్లుగా నియమించారని తేల్చి చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి.. ఆచరణలో ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు. నిరుద్యోగుల మేలుకోసమే తాము మూడేండ్ల పదవీకాలాన్ని వదులుకున్నామని గుర్తుచేశారు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీజీపీఎస్సీలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారిని అందలమెక్కించారని ఆరోపించారు.
రోడ్లపై తిరిగేవాళ్లను బీఆర్ఎస్ హయాంలో టీజీపీఎస్సీ మెంబర్లుగా చేశారని సీఎం చేసిన వ్యాఖ్యలపై టీజీపీఎస్సీ మాజీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రాజకీ య లబ్ధికోసం వారిని అవమానించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. సీఎంకు అంత పరిజ్ఞానం ఉంటే కేసీఆర్ నియమించిన వారిలో ఎవరికీ చదువురాదో? ఎవరు రోడ్లపై తిరిగారో? సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎం వ్యాఖ్యలను తెలంగాణకు చెందిన మేధావులు, రిటైర్డ్ అధికారులు కూడా తప్పుబడుతున్నారు. ఆనాడు తప్పుచేస్తే వారిని ఇప్పుడు ఎందుకు శిక్షించడం లేదని నిలదీస్తున్నారు.