Districts | హైదరాబాద్, జనవరి 12(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో జిల్లాలు, మండలాలను పునర్వ్యవస్థీకరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం హైకోర్టు లేదా సుప్రీంకోర్టుకు చెందిన రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. సోమవారం సచివాలయంలో టీజీవో అసోసియేషన్ నూతన డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించి సీఎం మాట్లాడారు. జిల్లాలు, మండలాల రేషనలైజేషన్‌పై విజ్ఞప్తులు, డిమాండ్లు వస్తున్నాయని తెలిపారు. అందుకే జిల్లాల పునర్వ్యవస్థీకరణకు నిర్ణయించినట్టు తెలిపారు.
కమిషన్ రాష్ట్రమంతా పర్యటించి ప్రజల సూచనలు, సలహాలు తీసుకుంటుందని, త్వరలో నిర్వహించే బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశంపై అన్ని పార్టీలతో చర్చిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా అప్పులపై మరోసారి అవే అబద్ధాలను సీఎం వల్లెవేశారు. మొన్నటివరకు నెలకు అసలు, వడ్డీ కలిపి రూ.6 వేల కోట్లు చెల్లిస్తున్నట్టు చెప్పిన సీఎం, తాజాగా నెలకు రూ.22 వేల కోట్లు అప్పులకు చెల్లిస్తున్నట్టు చెప్పడం గమనార్హం. రాష్ట్ర ఆదాయం రూ.18 వేల కోట్లని, కానీ, ప్రతినెలా రూ.22 వేల కోట్లు అప్పులకు చెల్లించాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు. అంటే ఆదాయం పోగా ఇంకా రూ.4 వేల కోట్లు లోటు ఏర్పడుతుందన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో సంక్షేమం, ఉద్యోగుల వేతనాలు, ఇతర ఖర్చులకు నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
సమయం, సందర్భం లేకుండా సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై నోరు పారేసుకున్నారు. నిన్నటిదాకా చావు భాష వాడిన సీఎం.. నేడు కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులను రాక్షసులతో పోల్చారు. దేవతలు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు భగ్నం చేయడానికి ప్రయత్నిస్తారంటూ బీఆర్ఎస్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఒక శుక్రాచార్యుడు ఫామ్‌హౌస్‌లో ఉండి అసెంబ్లీకి మారీచుడి లాంటి వాళ్లను పంపిస్తున్నారంటూ అహంకారపు వ్యాఖ్యలు చేశారు.