Districts | తెలంగాణపై కేసీఆర్ ముద్రను చెరిపేసేందుకు రేవంత్ సర్కార్ మరో విఫలయత్నం చేస్తున్నది! దాంట్లో భాగమే జిల్లాల పునర్విభజన పేరిట తేనెతుట్టెను కదుపుతున్నది. తెలంగాణలో నిర్మాణాత్మక అభివృద్ధిని వదిలేసి, ఉన్నవాటిని కూలగొట్టేపనిలో నిమగ్నమైన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు జిల్లాలపై పడింది. ఎందుకీ కుదింపు కుదుపు?
33 జిల్లాల ఏర్పాటేమీ ఆశామాషీగా జరుగలేదు. ప్రజల డిమాండ్ మేరకు, స్థానిక అవసరాలకు అనుగుణంగా, పరిపాలనా సౌలభ్యం కోసం జరిగింది. సిద్దిపేట జిల్లా అక్కడి ప్రజల దశాబ్దాల పోరాటం. సిరిసిల్ల, జనగామ, గద్వాల, ములుగు వంటివి ప్రజలు రోడ్డెక్కి ఆందోళనలు చేసి సాధించుకున్నవే. ఏవీ ఉత్తుత్తిగా ఇచ్చినవో, ఉదారంగా వచ్చినవో కావు. జనామోదం లేకుండా ఏర్పాటు చేసినవి అసలే కావు. మరి అలాంటి జిల్లాలపైకి రేవంత్ సర్కార్ ఎందుకు దండెత్తుతున్నది.
సర్కార్ చెప్తున్న ‘యూనిఫాం పాపులేషన్ ఆధారంగా’ అనేది సాకు మాత్రమే. శాస్త్రీయత ఓ ముసుగు మాత్రమే. దానికి నిపుణుల కమిటీ అంటూ ఏవేవో చెప్తున్న ప్రభుత్వం.. మరి ఏ సరిసమాన జనసంఖ్య ఆధారంగా జీహెచ్ఎంసీని విభజించింది? ఏ శాస్త్రీయ అధ్యయనం ఆధారంగా జోన్లను ముక్కలు చేసింది? ఏ కమిటీ నివేదిక ఇచ్చిందని కమిషనరేట్లలో మార్పు చేసింది? ఎవరు కోరారని ఫ్యూచర్ సిటీ అనబడే త్రిశంకు నగరాన్ని బలవంతంగా జనం నెత్తిన రుద్దుతున్నది?
పొందికగా అమరిన తెలంగాణను చూసి ఎందుకు కంటగింపుగా ఉన్నది? మంచిగున్న జిల్లాలను చూసి ఎవరికి కడుపునొస్తున్నది? ఆధునిక భవనాలు, అందుబాటులోకి పాలనతో అందంగా ఒదిగిన 33 జిల్లాల మణిహారాన్ని ఇచ్చగొడుతున్నది ఎందుకు? ఉన్నది పారబోసుకుని.. మళ్లీ ఏరుకునే అనాలోచిత చర్యలు ఎవరి ఆదేశాల మేరకు? తెలంగాణకు శాశ్వత నష్టం చేయడానికీ సిద్ధమవడం ఎందుకోసం..? ఎవరి కోసం?
ప్రజల సౌలభ్యం, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా జిల్లాల పునర్ వ్యవస్థీకరణ మరోసారి జరుగాల్సిన అవసరం ఉన్నది. జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై రిటైర్డ్ జడ్జి, విశ్రాంత అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తం. ఆరు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని కోరుతం. ఆ నివేదిక ఆధారంగా మరోసారి జిల్లాలను శాస్త్రీయంగా విభజిస్తం. జిల్లాల పేర్లు, పరిధిపై ఫిర్యాదులు ఉన్నాయి. వీటి ఆధారంగా మార్పులు చేస్తం.
– సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయాలనే విద్వేషంతో సీఎం రేవంత్‌రెడ్డి మరో దుస్సాహసానికి తెగబడుతున్నారు. ప్రజల ముంగిట్లోకి సుపరిపాలన తీసుకువచ్చి, అన్ని రంగాల్లోనూ ప్రగతిని పరుగులు పెట్టించిన చిన్న జిల్లాల ఏర్పాటును అపహాస్యం చేసే కుట్రలకు తెరలేపారు. కేసీఆర్ పరిపాలన, నిర్మాణాత్మక వ్యూహాలకు కలికితురాయిగా నిలిచిన చిన్న జిల్లాల స్వరూపాన్ని గందరగోళపరచడానికి వారం రోజుల నుంచి మంత్రులతో ప్రకటనలు చేయించిన ముఖ్యమంత్రి తాజాగా తానే రంగంలోకి దిగారు. ఆరు గ్యారెంటీల అమలు, కృష్ణా, గోదావరి జలాల చౌర్యం మీద రోజురోజుకూ పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను తప్పించుకోవడానికి, పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజ ల దృష్టిని మళ్లించడానికి ‘గురువు’ చేసిన సూచనలకు అనుగుణంగా సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి జిల్లాల పునర్విభజన అంశాన్ని తెర మీదికి తీసుకువచ్చినట్టు సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
శాస్త్రీయ విభజన సాకుతో అవసరం లేకున్నా సిరిసిల్ల, సిద్దిపేట, నారాయణపేట, ములుగు జిల్లాలతోపాటు మరో ఆరు జిల్లాలను రద్దు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. చిన్న జిల్లాలను పకనున్న పెద్ద జిల్లాల్లో విలీనం చేసేవిధంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ముఖ్యమంత్రి నిర్ణయం పార్టీని నిండా ముంచుతుందని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఆర్థిక ప్రగతి లేక ఇప్పటికే కుదేలైన రాష్ర్టాన్ని ఈ నిర్ణయం మరింత దిగజారుస్తుందని, రియల్ ఎస్టేట్ పడిపోతుందని, ప్రజలు సెంటిమెంట్‌తో మరోసారి రోడ్ల మీదికి వచ్చే ప్రమాదం ఉందని సీనియర్ నేతలు భయపడుతున్నారు.
ఎనిమిదేండ్ల కిందట 2016 అక్టోబర్‌లో జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ప్రారంభమైంది. 10 జిల్లాలు, 48 రెవెన్యూ డివిజన్లు, 466 మండలాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ర్టాన్ని పరిపాలనా సౌలభ్యం, పారదర్శకమైన పాలన కోసం మొదటి దశలో 31 నూతన జిల్లాలు, 74 రెవెన్యూ డివిజన్లు, 584 మండలాలుగా విభజించారు. ప్రజల నుంచి విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో పరిశీలించి, 2020-21లో నారాయణపేట, ములుగు జిల్లాలతోపాటు మరికొన్ని మండలాలను నూతనంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 33 జిల్లాలు, 74 రెవెన్యూ డివిజన్లు, 612 మండలాలు ఉన్నాయి. కేసీఆర్ ఆలోచనల నుంచి పురుడు పోసుకున్న కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిపాలనలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ప్రతి శాఖపైన నిఘా పెరిగింది. మారుమూల ప్రాంతాలకు సత్వర సేవలందడమే కాదు, ప్రజా సమస్యలకు త్వరగా పరిషారం దొరికింది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సంక్షేమ ఫలాలు నేరుగా గడపగడపకూ చేరడంతోపాటు ప్రతి పనిలోనూ పారదర్శకత ఏర్పడింది. అన్ని జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లు, పోలీస్ కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. ఇవి ప్రజలకు అందుబాటులో ఉండి, వారి అవసరాలను సులువుగా తీర్చాయి. మండలాలు, పంచాయతీల సంఖ్య పెరిగి రాజకీయంగానూ అవకాశాలు పెరిగాయి. ఇంకోవైపు ఆయా విభాగాల్లో లెకకు మించిన ఉద్యోగాలు, ఉద్యోగోన్నతులు, బదిలీల ప్రక్రియ వేగవంతం అయింది. కేసీఆర్ అధికారంలో లేకున్నా.. ఇవన్నీ చూసి ప్రజలు ఆయన్ను గుర్తు చేసుకుంటున్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత జోనల్ వ్యవస్థను నూతనంగా అమల్లోకి తేవడంతో రంగారెడ్డి జిల్లా నుంచి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోకి చేరిన గండీడ్, మహ్మదాబాద్ మండలాల్లో సమస్యలు ఉత్పన్నమయ్యాయని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారు. నల్లగొండ, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జోగుళాంబ గద్వాల, రాజన్న సిరిసిల్లతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ పలు మండలాల్లో పాలనాపరంగా సమస్యలున్నట్టు విజ్ఞప్తులు వచ్చాయని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీడియాకు చెప్తున్నారు. ఈ చిన్న చిన్న సాకులతోనే ఆయా జిల్లాలను రద్దు చేయాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. వాస్తవానికి రాజకీయ కారణాలతో ఆయా జిల్లాలను రద్దు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ నిర్ణయానికి అనుగుణంగా అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అసెంబ్లీ బయట మంత్రి పొన్నం ప్రభాకర్, వరంగల్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని బహిర్గతంగా ప్రకటించారు. ఏయే జిల్లాలను రద్దుచేయాలనే అంశంపై ఇప్పటికే రేవంత్‌రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్టు చెప్తున్నారు. జిల్లాల కుదింపు, రెవెన్యూ డివిజన్లు, మండలాల్లోనూ మార్పులు ఖాయమని తెలుస్తున్నది. అయితే ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుందని తెలియడంతో రిటైర్డ్ న్యాయమూర్తి, విశ్రాంత అధికారుల కమిటీని తెర మీదికి తెచ్చారనే ప్రచారం జరుగుతున్నది. కమిటీ నివేదిక ఎలా ఉన్నా సరే పైన పేర్కొన్న జిల్లాలను రద్దు చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. పరిగి నియోజకవర్గంలోని మహ్మదాబాద్, గండీడ్ మండలాలు మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్నాయి. మహబూబ్‌నగర్ జోగుళాంబ జోన్లో ఉంది. ఇప్పుడు ఈ రెండు మండలాలను పరిగి నియోజకవర్గం ఉన్న వికారాబాద్ జోన్లోకి మారిస్తే జోన్ సమస్య తలెత్తుతుంది. వికారాబాద్ జిల్లా చార్మినార్ జోన్లోకి వస్తుంది. ఇదంతా గజిబిజి వ్యవహారం. పునర్వ్యవస్థీకరణ, డివిజన్లు, మండలాలు మారిస్తే తుగ్లక్ నిర్ణయం అవుతుందని అధికారులు అంటున్నారు.
నూతన జిల్లాల ఏర్పాటు అనంతరం కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని రెండు మల్టీజోన్లు, ఏడు జోన్లుగా విభజించింది. దీనిప్రకారం ఉద్యోగుల నియామకం, ఉద్యోగోన్నతులు చేపడుతున్నారు. ఇప్పుడు పునర్ వ్యవస్థీకరణ చేస్తే జోన్లలోనూ మార్పులు చేయాల్సి ఉంటుంది. జిల్లాల పేరు మార్పులపై రైల్వే, పోస్టల్, సర్వే ఆఫ్ ఇండియా తదితర సంస్థల నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపట్టిన జనగణనను ఈ ఏడాది నాటికి పూర్తి చేయనున్నది. ఈ ప్రక్రియ పూర్తిచేసేంతవరకు జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల సరిహద్దుల్లో రాష్ట్రాలు మార్పులు చేస్తే ఇబ్బందులు తలెత్తుతాయని సూచించిందని ఓ అధికారి తెలిపారు. రాష్ట్రంలో మార్పులు చేస్తే కేంద్రం నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని పేరొన్నారు.
సిద్దిపేట, సిరిసిల్ల, సూర్యాపేట, గద్వాల, ములుగు జిల్లాలు రద్దు వంటి వార్తలను కాంగ్రెస్ పార్టీ అనుబంధ సోషల్ మీడియా విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ ప్రచారం ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నది. రియల్ ఎస్టేట్ విలువలు పడిపోతాయని, మౌలిక సదుపాయాల కల్పన ఆగిపోతుందని భయపడుతున్నారు. ఆయా జిల్లాల్లో పని చేస్తున్న ఉద్యోగులను సర్దుబాటు చేయటం పెద్ద తలనొప్పిగా మారే ప్రమాదం ఉందని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఒకవైపు కొత్త ఉద్యోగాలు వేయాలనే డిమాండ్‌తో నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్న నేపథ్యంలో, కొత్త జిల్లాల కుదింపుతో ఉన్న ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. జిల్లాను రద్దు చేస్తే ఊరుకునేది లేదని, ప్రజలతో కలిసి పోరాటం చేస్తాం అని బీఆర్ఎస్ నేతలు గట్టిగానే హెచ్చరిస్తున్నారు. జిల్లాలను తాకడం అంటే ప్రజల సెంటిమెంట్‌ను దెబ్బతీయడమేనని ప్రతిపక్షం వాదిస్తున్నది.
పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్ వ్యవస్థీకరణ చేపడుతాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించి అశాస్త్రీయంగా జిల్లాల విభజన చేసింది. వాటన్నింటినీ సరిచేస్తాం. త్వరలోనే జిల్లాల పునర్విభన ప్రక్రియ చేపడుతాం.
– రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ప్రస్తుతం ఉన్న మూడు పోలీస్ కమిషనరేట్లను ప్రభుత్వం హైదరాబాద్, సైబరాబాద్, మలాజిగిరి, ఫ్యూచర్ సిటీగా మార్చి న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జిల్లాల హద్దులను కూడా కమిషనరేట్ల పరిధితో అనుసంధానం చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది జనవరి నాటికే ఈ ప్రక్రియను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రస్తుతం 16 మండలాలుగా ఉన్న హైదరాబాద్ జిల్లా పరిధిని మార్చాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. తిరుమలగిరి, మారేడ్‌పల్లి మండలాలు, అమీర్‌పేట మండలంలోని బేగంపేటను మలాజిగిరి జిల్లాలో కలుపాలనే ఆలోచనతో ఉ న్నారు. ఇప్పటివరకు బండ్లగూడ, బహదూర్‌పుర వరకే ఉన్న జిల్లా హద్దులు, ఇకపై శంషాబాద్, రాజేంద్రనగర్ మండలాల వరకు విస్తరించనున్నట్టు తెలిసింది. జీహెచ్ఎంసీ పరిధి వరకు హైదరాబాద్ జిల్లా కిందికి తీసుకువస్తారని తెలుస్తున్నది.
మాజీ సీఎం కేసీఆర్ దేశంలోనే అత్యుత్తమ శాస్త్రీయ ప్రమాణాలతో జిల్లాల విభజన చేశారు. దాదాపు 8 కేంద్ర ప్రభుత్వ శాఖల నుంచి అనుమతి తీసుకొని, వాటి ఆమోదంతోనే కొత్త జిల్లాల భౌగోళిక స్వరూపం నిర్ధారించారు. అందుకే పునర్విభజన సమయంలో ప్రజల నుంచి వ్యతిరేకత రాలేదు. ఒకటి రెండుచోట్ల కొంత భిన్నాభిప్రాయాలు రాగా, వాటిని పరిగణనలోకి తీసుకున్న తరువాతే జిల్లా స్వరూపాన్ని నిర్ధారించారు. ఉమ్మడి జిల్లా భౌగోళిక స్వరూపాన్ని, పరిమాణాన్ని బట్టి కొన్ని మూడు, నాలుగు జిల్లాలుగా ఏర్పడ్డాయి. అప్పటివరకు చిన్న చిన్న పట్టణాలుగా ఉన్నవి జిల్లా కేంద్రాలుగా మారాయి. గతంలో ఒకే కలెక్టర్ పాలన కింద ఉన్న ఉమ్మడి జిల్లాలకు ముగ్గురు నలుగురు కలెక్టర్లు అందుబాటులోకి వచ్చారు. ఈ 8ఏండ్లలో అన్ని కొత్త జిల్లాల్లో మౌలిక వసతులు ఏర్పడ్డాయి. సమీకృత కార్యాలయాలు అందుబాటులోకి వచ్చాయి. గ్రామాల నుంచి మండల, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలను కలుపుతూ డబుల్ రోడ్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఓ వైపు వ్యవసాయ రంగం, మరోవైపు రియల్ ఎస్టేట్ రంగాలు పోటీపడుతూ పరుగులు పెట్టాయి.
జనాభా ఆధారంగా మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలను రేషనలైజ్ చేస్తామని ప్రకటించడమే అశాస్త్రీయం అని ప్రణాళిక శాఖ అధికారులు అంటున్నారు. కేవలం జనాభా ప్రాతిపదికన జిల్లాల సరిహద్దులను నిర్ణయించడం సమర్థనీయం కాదని వారు అంటున్నారు. పరిపాలన సౌలభ్యం, స్థానిక భౌగోళిక స్థితి, ప్రజాభిప్రాయం, ప్రజల జీవనశైలి, సంస్కృతులు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని జిల్లాల విభజన చేస్తారని ఆ శాఖ అధికారులు చెప్తున్నారు. విశాలమైన భారతంలో 779 జిల్లాలు ఉన్నాయని, అన్ని జిల్లాల్లో ఒకే తరహా జనాభా ఏమీ లేదని వారు గుర్తుచేస్తున్నారు. భౌగోళికంగా పర్వత ప్రాంతాలు, అడవులు, ఎడారి, లోయ ప్రాంతాల్లో జన సాంద్రత తక్కువగా ఉంటుందని, మైదాన ప్రాంతాల్లో జన సాంద్రత ఎక్కువగా ఉంటుందని ప్రణాళిక శాఖ అధికారులు చెప్తున్నారు.
పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలోని మహే జిల్లాలో కేవలం 42 వేల మంది జనాభా మాత్రమే ఉంటుందని, ఇది దేశంలోనే అతి చిన్న జిల్లా అని రికార్డులు చెప్తున్నాయి. ఇక అతి పెద్ద జిల్లాగా మహారాష్ట్రలోని థానే ఉన్నది. ఈ జిల్లా జనాభా కోటీ పది లక్షలు(1.10 కోట్లు)గా చెప్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జనాభా 10 మిలియన్లకు పైగా ఉంటుందని అంచనా. అలాగే అన్ని నియోజకవర్గాలకు యూనిఫాం సంఖ్యలో ఓటర్లు ఉండరని వారు పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో జిల్లాల విభజన శాస్త్రీయ ప్రమాణాలతో ఉన్నదని, ఆయా ప్రాంతాల ప్రజల అవసరాలు, పాలనా సౌలభ్యం ఆధారంగా విభజన జరిగిందని వారు చెప్తున్నారు. తెలంగాణలో 3.80 కోట్ల జనాభా ఉండగా.. 33 జిల్లాలు ఉన్నాయి. ఈ లెక్కన ప్రతి జిల్లాకు సగటున 11.51 లక్షల మంది జనాభా చొప్పున నివసిస్తున్నారు. రాష్ట్ర జనాభాతో పోలిస్తే జిల్లా సగటు జనాభా 3.03శాతంగా ఉన్నది.