హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, తన సోదరులు, అనుచరులు కలిసి రాష్ర్టాన్ని పందికొక్కుల్లా దోచుకుంటున్నారని బీఆర్ఎస్ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద ధ్వజమెత్తారు. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి కొండా సురేఖ కుమార్తె సైతం బహిర్గతం చేసిందని గుర్తుచేశారు. మంగళవారం తెలంగాణ భవన్లో మీడియాతో వివేకానంద మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందోననే భయం, ఆక్రోశంతోనే సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతూ కేసీఆర్‌పై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
తండ్రి సమానుడైన కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి అసభ్యంగా మురికి భాష మాట్లాడటం ఆయన సంస్కారహీనతను చూపుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో ఎన్టీఆర్, కరుణానిధి, జయలలిత, చంద్రబాబు వంటి అగ్రనేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా వ్యవహరించారో గుర్తుచేశారు. అసెంబ్లీ నియమ నిబంధనల మేరకే కేసీఆర్ సభకు హాజరవుతున్నారని, త్వరలోనే ఆయన పూర్తిస్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజా సమస్యలపై పోరాడుతారని స్పష్టంచేశారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రధాన ప్రతిపక్ష నేతను రాజీనామా చేయాలంటూ అడుగుతున్న ఏకైక సీఎం రేవంత్‌రెడ్డేనని విమర్శించారు. రేవంత్‌రెడ్డి అసలు నిజస్వరూపం పూర్తిగా బయటపడాలంటే ఆయనను ఐదేండ్లపాటు సీఎంగానే కొనసాగించాలని వివేకానంద కాంగ్రెస్ అధిష్ఠానానికి సూచించారు.
రేవంత్‌రెడ్డి స్వయంగా ఒక ఆర్టీఐ ఏజెంట్ అని, సీఎం అయ్యాక కూడా తన బ్లాక్మెయిల్ నైజాన్ని మానలేదని కేపీ వివేకానంద మండిపడ్డారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎమ్మెల్యే పనితీరు ర్యాంకింగ్స్‌లో రేవంత్ 7వ స్థానంలో నిలిచారని, అటు ఎమ్మెల్యేగా, ఇటు ఎంపీగా పూర్తిగా విఫలమైన వ్యక్తి రాష్ట్రానికి సీఎంగా ఎలా పనికొస్తారని ప్రశ్నించారు. భవిష్యత్తులో ‘రేవంత్ కాంగ్రెస్’ పేరిట సొంత రాజకీయ పార్టీని స్థాపించేందుకే వసూళ్ల దందాకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ నాయకులు ప్రజల్లోకి వెళ్తే ప్రజలే బట్టలు విప్పి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై శ్వేతపత్రం విడుదల చేసి సమగ్రచర్చ చేపట్టాలని, రేవంత్‌రెడ్డి.. నందో, పందో, పందికొకో అకడే తేల్చుకోవాలని వివేకానంద సవాల్ విసిరారు. రేవంత్‌రెడ్డిని గద్దె దించేందుకు బీఆర్ఎస్ సమగ్ర కార్యాచరణ సిద్ధం చేసిందని, దమ్ముంటే అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలు, పాలనపై చర్చకు రావాలని ఓపెన్ చాలెంజ్ చేశారు. 2001లో కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి గోడలకు సున్నాలు వేసుకునేవాడని ఎద్దేవా చేశారు.
మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌లకు తానే పదవులు ఇచ్చానని రేవంత్‌రెడ్డి చెప్పుకోవడం విడ్డూరంగా ఉన్నదని, ఆయన కంటే ముందే పార్టీలో ఉన్న వారిని జీతగాళ్లలా చూడటం రేవంత్‌రెడ్డి అహంకారానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఆ మంత్రులు, పీసీసీ చీఫ్ తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని హితవు పలికారు. సమావేశంలో బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.