న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: దేశంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు గత నెలలో సుమారు 15 శాతం పెరిగాయి. ఆగస్టులో జీఎస్టీ స్థూల ఆదాయం దాదాపు రూ.2 లక్షల కోట్లుగా నమోదైంది. మార్కెట్లో పెరిగిన లావాదేవీలు, దానికి తగ్గట్టుగా జరిగిన దిగుమతులే ఇందుకు కారణమని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. లావాదేవీల నుంచి రూ.1,37,249 కోట్లు, దిగుమతుల ద్వారా రూ.62,604 కోట్లు.. మొత్తంగా 14.8 శాతం వృద్ధితో రూ.1,99,853 కోట్లు వచ్చాయని మంగళవారం విడుదలైన అధికారిక గణాంకాల్లో తేలింది. గత ఏడాది ఆగస్టుతో పోల్చితే ఈసారి దేశీయ లావాదేవీలు 9.3 శాతం, ఆయా దేశాల నుంచి దిగుమతులు 29 శాతం ఎగబాకినట్టు చెప్తున్నారు.
కాగా, ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్)గాను దేశ జీడీపీ గణాంకాలు అంచనాలను మించి 7.8 శాతంగా నమోదైన విషయం తెలిసిందే. పశ్చిమాసియా సంక్షోభం, అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ముడి చమురు ధరలు, అమెరికా వాణిజ్య సుంకాల మధ్య కూడా దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిస్థాపకతను ప్రదర్శించిందని, దానికి తాజా జీఎస్టీ వసూళ్లు అద్దం పడుతున్నాయని పలువురు ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఇదిలావుంటే ఈసారి సెంట్రల్ జీఎస్టీ వసూళ్లు రూ.38,413 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ రాబడి రూ.46,316 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ ఆదాయం రూ.1.15 లక్షల కోట్లుగా ఉన్నాయి. అయితే రిఫండ్స్ కూడా 68 శాతం ఎగిసి రూ.31,795 కోట్లుగా ఉన్నాయి. దీంతో నికర జీఎస్టీ ఆదాయం ఈ ఆగస్టులో రూ.1.68 లక్షల కోట్లుగా ఉన్నది. నిరుడు ఇదే నెలతో పోల్చితే 8.3 శాతం పెరిగింది. కాగా, ఈ పండుగ సీజన్ దృష్ట్యా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో జీఎస్టీ వసూళ్లు ఇంకా పెరుగుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.