హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఖజానాలో డబ్బుల్లేవని సాకు చెప్తూ ఆరు గ్యారెంటీలను రెండున్నరేండ్లుగా రేవంత్ సర్కార్ ఎగబెడుతూ వస్తున్నది. ఇప్పటికే రూ.4 లక్షల కోట్లకు పైగా ప్రభుత్వం అప్పులు చేసింది. ఇది సరిపోదన్నట్టు మరో భారం నెత్తిన వేసుకుంటున్నది. కొత్త హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకోవాలని రేవంత్ సర్కార్ యోచిస్తున్నది. ఇందుకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసినట్టు తెలిసింది. అతిత్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉపయోగించేందుకు ప్రపంచంలోనే అత్యాధునిక ప్రమాణాలతో కూడిన ‘ఎయిర్‌బస్ 160’ హెలికాప్టర్ రాబోతున్నది. ఇప్పటివరకు దేశంలోని రాజకీయ నాయకుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దీన్ని ఉపయోగిస్తుండగా, వ్యాపారవేత్తల్లో ముఖేష్ అంబానీ ఈ మోడల్ హెలికాప్టర్‌ను వాడుతున్నారు. దేశంలోని మరే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ తరహా హెలికాప్టర్‌ను ఉపయోగించడంలేదు. అనేక ప్రత్యేకతలున్న ఎయిర్‌బస్ హెలికాప్టర్ 160 విలువ 180 కోట్ల రూపాయలకుపైనే ఉంటుంది. దీనికి అదనంగా కొన్ని ఖర్చులుంటాయి. అన్నీ కలిపితే రూ.200 కోట్ల వరకు అవుతుందని నిపుణులు చెప్తున్నారు. ఈ హెలికాప్టర్ ప్రయాణికులకు అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది.
సాధారణంగా ప్రభుత్వం హెలికాప్టర్లను కొనదు. కొంటే దాని నిర్వహణ భారంగా మారుతుంది. హెలికాప్టర్ పార్కింగ్, పైలెట్లు, ఇతర సిబ్బంది నియామకం వంటివన్నీ ఇబ్బంది. అందుకే అద్దెకు తీసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకోబోతున్న హెలికాప్టర్‌కు గంటకు రూ.పది లక్షలు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. దేశంలోనే అత్యాధునిక హెలికాప్టర్ కావడంతో అద్దె విషయంలో కూడా అత్యధికంగానే వసూలు చేస్తారు. బెంగళూరుకు చెందిన ఓ సంస్థ హెలికాప్టర్లను అద్దెకు ఇస్తుంటుంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా ఆ సంస్థతోనే చర్చలు జరుపుతున్నారు. గంటకు రూ.10 లక్షల చొప్పున అద్దె చెల్లించాలని, ఇందుకు అదనంగా జీఎస్టీ సహా పన్నులన్నింటిని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని సదరు సంస్థ నిబంధన పెట్టినట్టు తెలిసింది. హెలికాప్టర్‌ను ఉపయోగించినా, ఉపయోగించకపోయినా నెల రోజులకు సంబంధించిన అద్దె ముందే చెల్లించాలన్న నిబంధన పెట్టినట్టు సమాచారం. నెలకు రూ.4 కోట్లను కేవలం అద్దె కోసం, నిర్వహణ, పన్నులకు మరో రూ.కోటి కట్టాల్సి ఉంటుంది. ఈలెక్కన ఏడాదికి రూ.60 కోట్లు హెలికాప్టర్ అద్దె కోసమే ఖర్చు చేయబోతున్నది.
సీఎం ఉపయోగించేందుకు ఎయిర్‌బస్ 160 హెలికాప్టర్‌ను తీసుకోవాలని, మంత్రుల కోసం ఇప్పుడు వాడుతున్న పాత హెలికాప్టర్ లీజును పొడిగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది.