ఎత్తిపోయడానికి నీళ్లే లేవంటూ సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన గంటల్లోనే ఎక్కడో వందలకిలోమీటర్ల దిగువన.. పట్టిసీమ, తాడిపూడి పంపులను ఆన్ చేసింది ఏపీ సర్కార్. తెలంగాణలో వానల్లేక పంటలు ఎండుతున్నా, మేడిగడ్డలో ప్రాణహిత వరద పారుతున్నా గోదావరి జలాలను ఎత్తిపోయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతులురావడం లేదు. కానీ, అందివచ్చిన అవకాశంగా చంద్రబాబు సర్కార్ మాత్రం నీటిని లిప్ట్ చేయడం ప్రారంభించింది. ఇప్పుడందరి మదిలో ఒక్కటే ప్రశ్న! కాళేశ్వరాన్ని పడావు పెట్టింది.. ఆంధ్రాకు నీళ్లు పారించేందుకా? పట్టిసీమకు గోదావరిని పంపేందుకే ఇక్కడ పట్టించుకోవడం లేదా?
హైదరాబాద్, జూలై 9(నమస్తే తెలంగాణ): రేవంత్ సర్కార్ తీరుతో ప్రాణహిత జలాలు తెలంగాణకు కాకుండా పోతున్నాయి. మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోయకుండా దిగువకు వదిలిపెడుతున్నది. మరోవైపు దిగువన ఏపీ రాష్ట్రం పట్టిసీమ, తాడిపూడి పంపులను ఆన్ చేసి ఎత్తిపోతలు ప్రారంభించి కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను మళ్లిస్తున్నది. మొత్తంగా ఏపీ కోసమే రేవంత్ సర్కార్.. కన్నెపల్లి పంపులను ఆన్‌చేయడం లేదని స్పష్టంగా తెలిసిపోతున్నది. ఎల్ నినో ప్రభావంతో ఇప్పటికీ ఒక్క గట్టివాన పడలేదు. ప్రధాన గోదావరిలో వరద జాడలేకుండా పోయింది.
అదీగాక ఎస్సారెస్పీ ఎగువన, దిగువన ఎల్లంపల్లి, సుందిళ్ల, అన్నారం వరకు వరదనే లేకుండా పోయింది. కానీ మేడిగడ్డ బరాజ్ వద్ద ప్రాణహిత నుంచి ఇప్పటికీ గురువారం రాత్రి 9గంటల వరకు 81వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్నది. వివరంగా చెప్పాలంటే 7టీఎంసీల ప్రవాహం. బరాజ్ వద్ద ప్రస్తుతం నదీ ప్రవాహం 97మీటర్లుగా ఉన్నది. మరోవైపు కన్నెపల్లి పంప్‌హౌస్‌లోని మోటర్లు సిద్ధంగా ఉన్నాయి. రోజుకు 2 టీఎంసీలను ఎత్తిపోసుకొనే సామర్థ్యమున్నది.
93.5మీటర్ల నుంచి నీటిని ఎత్తిపోసుకొనే అవకాశమున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రాణహిత జలాలను ఎత్తిపోయకుండా దిగువకు వదిలిపెడుతున్నది. సీజన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు సుమారు 50టీఎంసీల జలాలను దిగువకు తరలిపోయినట్టు గణాంకాలే వెల్లడిస్తున్నాయి. జూన్ 1నుంచి 30వరకు రోజుకు సగటున 3,300 క్యూసెక్కుల వరద రాగా 10 టీఎంసీలు జలాలు దిగువకు తరలిపోయాయి. అదే విధంగా జూలై 1నుంచి 9వ తేదీ వరకు 49.23 టీఎంసీలు వృథా పోయాయి.
మరోవైపు ఏపీ ప్రభుత్వం ఎల్ నినో నేపథ్యంలో అప్పుడే ఎత్తిపోతలను ప్రారంభించింది. మేడిగడ్డను దాటుకొని దిగువకు వెళ్లిన ప్రాణహిత జలాలను కృష్ణా డెల్టాకు మళ్లిస్తున్నది. పోలవరం డ్యామ్ పూర్తయ్యే వరకు కుడికాలువ ద్వారా గోదావరి జలాలను తరలించేందుకుని తాత్కాలికంగా ఏలూరు జిల్లాలో పట్టిసీమ లిఫ్ట్ స్కీమ్‌ను ఏపీ గతంలోనే చేపట్టింది. రోజుకు 8,500 క్యూసెక్కుల జలాలను గోదావరి నుంచి లిఫ్ట్ చేసి కుడికాలువ ద్వారా కృష్ణా డెల్టా ఆయకట్టుకు 80 టీఎంసీల మేరకు సాగునీటిని అందించడం ప్రధాన లక్ష్యం. 2015 నుంచి ఈ స్కీమ్ ద్వారా గోదావరి జలాలను మళ్లిస్తున్నది.
అదేవిధంగా పోలవరం కుడికాలువకు సమాంతరంగా తాడిపూడి కెనాల్‌ను సైతం నిర్మించింది. తాడిపూడి లిఫ్ట్ ద్వారా ఇక్కడా 1,400 క్యూసెక్కులను తరలించే ఏర్పాట్లు చేసింది. ఈ రెండు కాలువల ద్వారా గోదావరి జలాలను మళ్లిస్తున్నది. ప్రస్తుతం సూపర్ ఎల్ నినో నేపథ్యంలో పొరుగున ఏపీ ప్రభుత్వం పట్టిసీమ, తాడిపూడి లిఫ్ట్‌లను ప్రారంభించింది. సామర్థ్యం మేరకు గోదావరి జలాలను ఎత్తిపోసేందుకు సిద్ధమైంది. ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా జలహారతి ఇచ్చి ఆయా ఎత్తిపోతలను ప్రారంభించారు. మొత్తంగా తెలంగాణ ప్రభుత్వం వృథాగా వదిలేస్తున్న జలాలను ఏపీ ఎత్తిపోసుకోవడం గమనార్హం.
ఎస్సారెస్పీ సహా గోదావరి బేసిన్‌లోని ప్రతి జలాశయం ఇప్పటికే డెడ్‌స్టోరేజీకి చేరుకున్నాయి. వానలు కురిసే అవకాశమూ తక్కువగానే ఉన్నది. ఎగువ నుంచి వరద వచ్చే ఆశలు సన్నగిల్లుతున్నాయి. కన్నెపల్లిలో పంప్‌లను ఆన్ చేసి నీటిని లిఫ్ట్ చేస్తే తద్వారా ఎల్లంపల్లి సహా మధ్యమానేరు, దిగువ మానేరు, అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, మల్కపేట తదితర రిజర్వాయర్లను నింపుకొని కరువు బారిన పడకుండా ఉండేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
అదే విధంగా దేవాదుల నుంచి కూడా నీటిని ఎత్తిపోసుకొనే అవకాశమున్నా రేవంత్ సర్కార్ నీటిని లిఫ్ట్ చేయడం లేదు. కేవలం ఎన్డీఎస్ఏ నివేదికలను సాకుగా చూపుతూ ప్రాణహిత జలాలను ఒడిసిపట్టకుండా దిగువకు వదిలిపెడుతున్నది. కేవలం ఏపీలోని కృష్ణా డెల్టా కోసమే రేవంత్ సర్కార్ తెలంగాణ ప్రాజెక్టులను పడావు పెడుతున్నారని రాష్ట్ర నీటిరంగ నిపుణులు అభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నాయి. ప్రస్తుతం సర్కార్ వ్యవహరిస్తున్న తీరు సైతం అందుకు బలాన్ని చేకూర్చుతున్నది.

గురువారం రాత్రి మేడిగడ్డ వద్ద వరద ప్రవాహం
81వేల క్యూసెక్కులు.. అంటే 7 టీఎంసీలు
10 టీఎంసీలు జూన్ నెలలో రోజుకు సగటున 3300 క్యూసెక్కుల చొప్పున దిగువకు వెళ్లిన వరద
49.23 టీఎంసీలు జూలై 1 నుంచి ఇప్పటివరకు ప్రాణహిత నుంచి కిందికి తరలిన నీళ్లు
60 టీఎంసీలు మొత్తంగా ఈ సీజన్లో ఇప్పటివరకు వృథాగా పోయిన నీళ్లు సుమారు