రాష్ట్రంలో ప్రభుత్వం లేదు. కేవలం ఒక మాఫియా రాజ్యం నడుస్తున్నది. ఈ దండుపాళ్యం ముఠాకు నాయకుడిలా రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తుంటే.. దోచుకో.. దాచుకో అన్నట్టుగా మంత్రులంతా కలిసి స్కామ్‌లు చేస్తున్నారు.
-కేటీఆర్
చోటే భాయ్.. బడే భాయ్ ఇద్దరూ కలిసి మూసీ భూములు కొల్లగొడుతున్నరు. మోదీకి నిజాయితీ ఉంటే పేదల భూములు లాకోవద్దని, పేదలకు అన్యాయం చేయవద్దని ఎందుకు ప్రశ్నించరు. రెండున్నరేండ్లు దాటినా ఒక హామీ కూడా నెరవేర్చేందుకు డబ్బులు లేవని చెబుతున్న రేవంత్‌రెడ్డి.. మూసీ కోసం మాత్రం లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నడు.
– కేటీఆర్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 21(నమస్తే తెలంగాణ) : గాంధీ మహాత్ముడి పేరుతో రేవంత్‌రెడ్డి చేస్తున్న మూసీ విధ్వంసాన్ని చూస్తే మహాత్ముడి ఆత్మ కూడా ఘోషిస్తుందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కమీషన్లు, కాసుల కోసం వేలాది మంది పేద, మధ్యతరగతి ప్రజల ఇండ్లను కూల్చేందుకు రేవంత్‌రెడ్డి చేస్తున్న కుట్రను స్వయంగా మహాత్మాగాంధీ మనుమడు తుషార్ గాంధీ కూడా వ్యతిరేకించారని, అయినా వినకుండా పేదలపై సీఎం తన ప్రతాపం చూపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి నమ్మేది గాడ్సేను అయినా మహాత్మా గాంధీ విగ్రహం పెడుతానని దొంగ మాటలు చెప్తున్నారని మండిపడ్డారు. గాంధీపై నిజంగా రేవంత్‌కు ప్రేమ ఉంటే పేదల ఇండ్లు కూల్చకుండా మహాత్ముడి విగ్రహం పెట్టాలని సూచించారు. ‘చివరికి పిల్లలు సైతం తమ ఇండ్లు కూలగొట్టవద్దు.. కిడ్డీ బ్యాంక్ డబ్బులైనా ఇస్తాం.. మమ్మల్ని వదిలిపెట్టండి’ అని వేడుకున్నా మనసు కరగని దుర్మార్గపు పాలన కొనసాగుతున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం శంషాబాద్ జేడీ కన్వెన్షన్‌లో రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.

మూసీ పేరుతో కాంగ్రెస్ చేస్తున్న విధ్వంస రాజకీయాలకు బీజేపీ కూడా మద్దతు ఇస్తున్నదని కేటీఆర్ ఆరోపించారు. చోటే భాయ్.. బడే భాయ్ ఇద్దరూ కలిసి మూసీ భూములు కూలగొడుతున్నారని విమర్శించారు. నిజంగానే మోదీకి నిజాయితీ ఉంటే పేదల భూములు లాకోవద్దని, పేదలకు అన్యాయం చేయవద్దని ఎందుకు ప్రశ్నించరు అని నిలదీశారు. ఒకవైపు స్థానికంగా మూసీ ప్రజలను మోసం చేస్తున్నారని స్థానిక బీజేపీ నేతలు ఈటల రాజేందర్, కిషన్‌రెడ్డి మాట్లాడుతుంటే.. కేంద్రంలోని ఉన్న బీజేపీ ప్రభుత్వం మాత్రం ఇండ్లు కూలగొట్టమని అనుమతులు ఇస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. రెండున్నరేండ్లు దాటినా ఒక హామీ కూడా నెరవేర్చేందుకు డబ్బులు లేవని చెబుతున్న రేవంత్‌రెడ్డి.. మూసీ కోసం మాత్రం లక్షన్నర కోట్ల ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నారని దుయ్యబట్టారు. కేవలం రాహుల్‌గాంధీకి ప్రతినెలా కమీషన్లు పంపేందుకే రేవంత్‌రెడ్డి ఇన్ని అరాచకాలు చేస్తున్నారని, డబ్బు కట్టలు పంపి రెన్యువల్ చేసుకోకుంటే ముఖ్యమంత్రి పదవి పోతుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
ఒక సినిమా ఫెయిల్ అయితే ప్రొడ్యూసర్లకు నష్టం వస్తుందని, కానీ ఇప్పుడు నడుస్తున్న రేవంత్‌రెడ్డి అనే సినిమాతో 4కోట్ల తెలంగాణ ప్రజలకు నష్టం వస్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే కాంగ్రెస్ సినిమా సగం అయిపోయిందని అది పూర్తి అట్టర్‌ఫ్లాప్ సినిమా అని ఎద్దేవా చేశారు. ‘అది డిజాస్టర్ అని అందరికీ తెలిసిపోయింది.. ఇంటర్వెల్ అయిపోగానే ఎప్పుడు పోతడు రా రేవంత్‌రెడ్డి అని అందరూ తలపట్టుకొని కూర్చున్నరు’ అంటూ సెటైర్ వేశారు. మూసీలో ఖర్చు పెడుతున్న రూ.లక్షన్నర కోట్లతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసే ప్రయత్నం చేయాలని కేటీఆర్ సూచించారు. కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలనే ఏకైక ఆలోచన ప్రజల్లో ఉన్నదని కేటీఆర్ తెలిపారు.
రాష్ట్రంలో ప్రభుత్వం లేదని కేవలం ఒక మాఫియా రాజ్యం నడుస్తున్నదని కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దండుపాళ్యం ముఠాకు నాయకుడిలా రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తుంటే.. ఆయన ఆధ్వర్యంలో దోచుకో.. దాచుకో అన్నట్టుగా మంత్రులంతా కలిసి స్కామ్‌లు చేస్తున్నారని విమర్శించారు. సామాన్యుల భూములు లాకొని గూండాయిజం చేసే రేవంత్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కొడుకు గూండాయిజాన్ని ప్రతి ఒకరూ చూశారని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ కనుసన్నల్లోనే శంషాబాద్‌లో 180 ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు రాసిచ్చిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. రెండున్నరేండ్లుగా హైదరాబాద్‌లో ఒక ఇల్లు కూడా కట్టని కాంగ్రెస్ ప్రభుత్వం.. వేలాది ఇండ్లను కూల్చేందుకు మాత్రం సిద్ధమవుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఉన్న సిటీని వదిలిపెట్టి కేవలం తాను కబ్జా చేసిన వేలాది ఎకరాలను కాపాడుకునేందుకే ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌పై కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అభివృద్ధి పేరుతో పార్టీ మారితే ఈ రెండున్నరేండ్లలో చేసిన ఒక్క అభివృద్ధి పని అయినా చెప్పగలరా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ రాజేంద్రనగర్ ప్రజలకు ద్రోహం చేశాడని విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే పోయినా బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి ఢోకా లేదని, రాజేంద్రనగర్‌లో పార్టీ బాధ్యతలు కార్తిక్‌రెడ్డి భుజాల మీద ఉన్నదని కేటీఆర్ చెప్పారు. రానున్న ఎన్నికల్లో కేసీఆర్‌ని తిరిగి ముఖ్యమంత్రిగా చేసి గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వ నమోదుతో పాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)పై కార్యకర్తలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.