సిటీబ్యూరో/హయత్నగర్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఓ యువకుడి కేసులో నిజానిజాలు వెలికి తీయడంలో హయత్నగర్ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన కుమారుడి మృతిని హత్య కోణంలో దర్యాప్తు చేయాలని నెల రోజులుగా పోలీస్స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా సరైన స్పందన లేదని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ కేసులో నల్గొండ జిల్లాకు చెందిన ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే పేరు ప్రస్తావనకు రావడంతో దర్యాప్తుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెల రోజుల క్రితం హయత్నగర్ పో లీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు బాధితులు, పోలీసుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి..
పని కోసం వెళ్లి.. శవమై తేలాడు..
సూర్యాపేట జిల్లా గొట్టిపర్తి గ్రామానికి చెందిన చింతకుంట్ల రాములు, పార్వతమ్మ దంపతుల రెండో కొడుకు అఖిల్(26)తో జీవనోపాధి కోసం కుటుంబంతో కలిసి హయత్నగర్ మిధాని కాలనీలో నివాసముంటున్నారు. గత నెల 15 న ఇంటి నుంచి పనికి వెళ్తున్నానని బయట కు వెళ్లిన అఖిల్ తిరిగి ఇంటికి రాలేదు. మూడు రోజుల తరువాత 18న అతడి మృతదేహం లభ్యమయ్యింది. మృత దేహం కుళ్లిపోయి ఉండడంతో పాటు చేతులు, కా ళ్లు తీవ్రంగా దెబ్బతిన్న స్థితిలో కన్పించడంతో కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. కుక్కలు పీక్క తినడంతో అలా జరిగి ఉండవచ్చని పోలీసులు చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
15వ తేదీన ఏమి జరిగింది. ..?
అఖిల్ మృతికి ముందు ఏమి జరిగిందో తెలుసుకునే ప్రయత్నంలో కుటుంబ సభ్యులకు కీలక సమాచారం తెలిసింది. మే 15న మద్యం మత్తులో ఉన్న అఖిల్ తొర్రూర్ రోడ్డులోని ఓ దుకాణానికి వెళ్లి గంజాయి అడిగినట్లు సమాచారం. దీంతో దుకాణ నిర్వాహకులు అతడిని నిలదీయగా, అక్కడ వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. అయితే ఈ వివాదమే ఈ పరిణామాలకు కారణమయ్యిందా? అనే అనుమానాలు కుటుంబ సభ్యులు పోలీసులకు వివరించారు. ఈ నేపధ్యంలో పోలీసులు కొందరిని విచారించినట్లు సమాచారం. అయితే విచారణకు పిలిచిన వారిలో కొందరు తామ ఓ ఎమ్మెల్యే అనుచరులమని చెప్పుకుంటూ పోలీస్స్టేషన్ వద్దే బాధితులను బెదిరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసుల సమక్షంలో బెదిరింపులు జరిగాయని బాధితులు చెబుతుండడం మరిన్ని సందేహాలకు తావిస్తోంది. బాధితుల ఆరోపణల ప్రకారం, అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ప్రభావం కారణంగా పోలీసులు ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేయడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు దర్యాప్తు వేగం, ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన అంశాలు, ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయని స్థానికులు చర్చించుకుంటున్నారు.
నిందితులను శిక్షించండి ః నిఖిల్ తల్లిదండ్రులు
తమ కుమారుడి మృతికి బాధ్యులను గుర్తించి వారిని శిక్షించాలని కోరుతూ అఖిల్ తల్లిదండ్రులు పార్వతమ్మ, రాములు గత నెల రోజులుగా హయత్నగర్ పోలీస్ స్టేష న్ చుట్టూ తిరుగుతున్నారు. ‘ తన కొడుకుది సహజ మర ణం కాదు… ఎవరో దాడి చేసి చంపినట్లుగా అనిపిస్తోంది, పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి నిజాలు బయటపెట్టాలి అని వారు కోరుతున్నారు. అయితే పోలీసులు మాత్రం పోస్టుమార్టం నివేదిక రావాల్సి ఉందంటూ కాలయాపన చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. హత్య అనుమానాలు వ్యక్తమవుతున్న కేసులో పోస్టుమార్టం నివేదికను త్వరగా తెప్పించేందుకు కూడా చర్యలు తీసుకోకపోవడం పలు ప్రశ్నలకు తావిస్తోందని బాధితులు వాపోతున్నారు. హయత్నగర్ పోలీస్ స్టేషన్ వద్ద విలేకరులకు మృతదేహ ఫోటోలను చూపిస్తూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
హయత్నగర్ ఠాణాపై గతం నుంచి వివాదాలు.. !
హయత్నగర్ పీఎస్ పరిధిలో నమోదైన పలు ఆత్మహత్య, హత్య కేసుల దర్యాప్తుపై గతంలోనూ విమర్శలు వ్యక్తమయ్యాయి. నిష్పాక్షికంగా దర్యాప్తు జరగడం లేదంటూ బాధితులు ఉన్నతాధికారులను ఆశ్రయించిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని కేసుల్లో తిరిగి దర్యాప్తు నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ నేపధ్యంలో అఖిల్ అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తుపై కూడా స్థానికంగా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఇక్కడ పనిచేసిన ఇన్స్పెక్టర్ బదిలీ కాగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఇన్స్పెక్టర్ శంకరయ్యను ఈ కేసు గూర్చి ప్రశ్నించగా నేను కొత్తగా వచ్చాను, ఈ కేసు వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉందని అన్నారు.