హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌గా రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి రాజశేఖర్‌రెడ్డి నియామకం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి గడిచిన పన్నెండేండ్లుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీసీబీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. కానీ తాజాగా ఓ రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారిని ప్రత్యేకంగా నియమించారు. పీసీబీ చైర్మన్ బాధ్యతలను సీఎస్ నుంచి తొలగించి ప్రత్యేకంగా రిటైర్డ్ అధికారికి కట్టబెట్టడం వెనుక ఆంతర్యమేందనే చర్చ జరుగుతున్నది.
పర్యావరణ మంత్రిగా ఉన్న కొండా సురేఖను ఇటీవల పదవి నుంచి బర్తరఫ్ చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పీసీబీ వ్యవహారాలు మంత్రికి తెలియనీయకుండా నేరుగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు వచ్చాయి. మంత్రిని తొలగించిన వెంటనే పీసీబీకి కొత్త చైర్మన్‌ను నియమించడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు చైర్మన్ తర్వాతి పదవుల్లో ప్రిన్సిపల్ సెక్రటరీ, మెంబర్ సెక్రటరీలుగా ఐఏఎస్ అధికారులు ఉన్నారు.
ఐఆర్ఎస్ అధికారి కింద ఐఏఎస్‌లుగా ఉన్న తాము పనిచేయలేమనే భావనతో వారు ఉన్నట్టు తెలుస్తున్నది. రాజశేఖర్‌రెడ్డి ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న వెంటనే మెంబర్ సెక్రటరీ సెలవులో వెళ్తున్నారని పీసీబీ సర్కిల్స్‌లో చర్చ జరుగుతున్నది. ఈ వ్యవహారం ఇప్పుడు ప్రభుత్వం, పీసీబీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నెల 12న రెండో శనివారం సెలవు రోజు అయినప్పటికీ రాజశేఖర్‌రెడ్డి ఆగమేఘాల మీద వచ్చి చార్జి తీసుకున్నారు. ఆదివారం పీసీబీ ప్రధాన కార్యాలయం సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. సెలవు రోజులైనప్పటికీ అంత తొందరగా బాధ్యతలు స్వీకరించి, సమీక్ష చేయాల్సిన అత్యవసర పరిస్థితి ఏముందనే చర్చ జరుగుతున్నది.
పీసీబీ నిధులే లక్ష్యమా?
కాలుష్య నియంత్రణ మండలి స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఉద్యోగుల జీతాలు, బోర్డు నిర్వహణ మొత్తం సొంత నిధులతోనే కొనసాగుతున్నది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ సంస్థలకంటే మిగులు బడ్జెట్లో ఉన్నది. దీంతో కాంగ్రెస్ పెద్దల కన్ను కాలుష్య నియంత్రణ మండలిపై పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. పీసీబీ నిధులను మళ్లించేందుకే సీఎస్ నిర్వహిస్తున్న బాధ్యతలను ప్రత్యేక అధికారికి కట్టబెట్టినట్టు తెలుస్తున్నది. రిటైర్డ్ అధికారిని నియమిస్తే కాంగ్రెస్ పెద్దలు చెప్పినట్టుగా నడుచుకుంటారనే భావనతోనే ఈ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జరుగుతున్నది.
పీసీబీ ఆదాయం, పరిశ్రమల నుంచి వచ్చే ఆదాయం విషయం మంత్రికి తెలియకుండా నేరుగా ముఖ్యమంత్రికి చేరుతున్నట్టు అప్పటి మంత్రి ఆరోపించారు. అందుకే మంత్రిని తొలగించిన వెంటనే నూతన చైర్మన్‌ను నియమించాలని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అందులో భాగంగానే రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్‌లను కాదని రిటైర్డ్ ఐఆర్‌ఎస్‌ను చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టినట్టు పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.