సిటీబ్యూరో, జూలై 20 (నమస్తే తెలంగాణ): అధికార పార్టీ నాయకులు ఏది చెబితే అదే చేస్తామనే ధోరణితో కొందరు పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఆనందోత్సవాలతో నగరంలో జరుపుకుంటున్న బోనాల పండుగకు మల్కాజిగిరి పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. కొన్నిచోట్ల చీకట్లోనే బోనాల పండుగను జరుపుకునే పరిస్థితికి తీసుకొచ్చారు. అంగరంగా వైభవంగా జరుపుకునే పండుగకు ఆలయాల పరిసర ప్రాంతాలు, బస్తీలు, కాలనీల్లో ప్రత్యేకంగా లైట్లు ఏర్పాటు చేసి, ఆ వెలుగుల్లో బోనాలు తీసుకురావడంతో ఆ ప్రాంతమంతా భక్తుల కోలహాలంగా ఉంటుంది.
ఆయా ప్రాంతాల్లో బోనాలతో వచ్చే వారికి స్వాగతం పలికేందుకు వేదికలు సైతం ఏర్పాటు చేస్తూ భక్తి శ్రద్ధలతో ఇప్పటి వరకు పండుగలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల మల్కాజిగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ నాయకులపై దౌర్జన్యానికి పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మల్కాజిగిరిలో రౌడీయిజాన్ని ప్రోత్సహించే విధంగా అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు వ్యవహరిస్తున్నా పోలీసులు మాత్రం అలాంటి వారిపై చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.
అయితే ఆదివారం బోనాల పండుగకు స్థానిక ప్రజలు ఎవరికి వారు వారి ఏర్పాట్లలో నిమగ్నమై ఆలయాలు, ఆలయాలకు వచ్చిపోయే రూట్లలో లైట్లు ఏర్పాటు చేస్తుండడం, స్టేజీలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుండడంతో మల్కాజిగిరి పోలీసులు అడ్డుకున్నారు. ఆదివారం బోనాలు చేసి, సోమవారం ఫలారం బండ్లు తీయడం నగరంలో ఆనవాయితీగా వస్తుంది. ఇదే క్రమంలో మల్కాజిగిరిలోను ఫలారం బండ్లు ప్రతియేడు తీస్తుంటారు. ఇందులో భాగంగా చిన్నయాదవ్ మల్కాజిగిరి ప్రాంతంలో సోమవారం ఫలారం బండి తీసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.
అందులో భాగంగానే గాంధీ పార్కు సమీపంలో ప్రత్యేకంగా లైట్లు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తుండడంతో మరో పక్క స్థానికులు బోనాల పండుగ కోసం వేదికలను ఏర్పాటు చేస్తున్నారు. ఇంతలోనే మల్కాజిగిరి పోలీసులు వచ్చి ఎలాంటి అనుమతులు లేవంటూ లైట్లు ఏర్పాటు, వేదికలను తొలగించాలంటూ అడ్డు చెప్పారు. దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి, స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు.
తెలంగాణలో వైభవంగా చేసుకునే బోనాల పండుగకు పోలీసులు ఎందుకు అడ్డుపడుతున్నారంటూ ప్రశ్నించారు. పక్కనే ఉన్న నేరెడ్మెట్ ప్రాంతంలో అంత సాఫీగా జరుగుతుండగా మీరెందుకు ఆంక్షలు విధిస్తున్నారంటూ ప్రశ్నించాడు. అయితే మల్కాజిగిరి పోలీసులు మాత్రం మేం మా పోలీస్‌స్టేషన్ పరిధిలో చేసే వాటికి ఇతరులతో పోల్చవద్దంటూ మాట్లాడారు. అందరు తెలంగాణలోనే ఉన్నారని, నేరెడ్మెట్, మల్కాజిగిరి రెండు కూడా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే ఉన్నాయని, ఒక దగ్గర ఒక రూల్.. మరో దగ్గర ఇంకో రూల్ ఎలా ఉంటుందంటూ పోలీసులను నిలదీశారు. అయితే స్థానిక పోలీసులు మాత్రం మీకు అన్ని విషయాలు మేం చెప్పం.. మేం చెప్పింది మీరు చేయండంటూ స్థానికులను బెదిరించారు. లైట్లు పెట్టడం, వేదికలు ఏర్పాటు చేస్తే మీపై కేసులు పెడుతామంటూ హెచ్చరికలు జారీ చేశారు.
అడుగడుగునా అడ్డంకులు..
బోనాల పండుగ వేళ సాయంత్రం అయ్యిందంటే అమ్మవారి ఆలయాలకు బోనాలు ఎక్కువ మంది తీసుకొస్తుంటారు. దీంతో బోనాల పండుగ అంటేనే దీపాల వెలుగుతో పండుగ లు ప్రజలు ఆనందోత్సవాలతో జరుపుకుంటారు. గాంధీ పార్కు ఏరియాలో ప్రతి యేడు బోనాల పండుగ రోజు ప్రత్యేక లైటింగ్‌తో ఆ ప్రాంతమంతా వెలుగులు విరజిమ్మేవి. కానీ ఆదివారం రాత్రి మాత్రం సరైన వెలుతురు లేకుండానే ఉన్న వీధి దీపాల వెలుగులతోనే స్థానిక ప్రజలు పండుగ జరుపుకున్నారు.
తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బోనాల పండుగకు మల్కాజిగిరి పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలోను అంగరంగ వైభవంగా ప్రత్యేక దీపాల వెలుగులతో పండుగలు నిర్వహిస్తున్నారని, అలాంటిది మల్కాజిగిరి ప్రాంతంలో పోలీసులు కనీసం లైట్లు కూడా వేయనీకుండా అడ్డుకోవడం ఏంటంటూ స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.