హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల లైసెన్స్‌ల జారీలో ఎస్సీ, ఎస్టీ, గౌడ్లకు ప్రకటించిన రిజర్వేషన్ ప్రకారం దుకాణాల కేటాయింపు పూర్తయింది. అన్ని జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో లక్కీడ్రా ద్వారా గౌడ్లకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్ ప్రాతిపదికన దు కాణాలను సోమవారం కేటాయించారు. లాటరీ ప్రక్రియను ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ పర్యవేక్షించారు. మొత్తం దుకాణాల్లో గౌడ్లకు 363 (15 శాతం), ఎస్సీలకు 262 (10 శాతం), ఎస్టీలకు 131 (5 శాతం) దుకాణాలు కలిపి మొ త్తం 756 దుకాణాలు కేటాయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 2,216 వైన్స్‌లకు అదనంగా 404 దుకాణాలు ఏర్పాటుచేయనున్నట్టు అబ్కారీశాఖ అధికారులు తెలిపారు. దీంతో వైన్స్‌ల సంఖ్య 2,620కి పెరగనున్నది. దరఖాస్తులను బుధవారం నుంచి ఈ నెల 18 వరకు స్వీకరిస్తారని తెలిసింది. 20న కలెక్టర్ల సమక్షంలో డ్రా తీసి మద్యం దుకాణాలను కేటాయించనున్నట్టు సమాచారం.
క్యాటగిరీ : దుకాణాలు : శాతం
గౌడ్స్ :363 : 15
ఎస్సీలు :262 : 10
ఎస్టీలు :131 : 5
మొత్తం :756 : 30