తాడ్వాయి : ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో జరుగుతున్న మేడారం జాతరను (Medaram Jatara ) న్యూజిలాండ్ మావోరి తెగకు ( New Zealand Maori tribe ) చెందిన ప్రతినిధులు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా గద్దల ప్రాంగణంలో వారి హాకా నృత్య ప్రదర్శన ( Haca Dance ) ఆకట్టుకుంది.
తెలంగాణ, న్యూజిలాండ్ సాంస్కృతిక మార్పిడి కార్యక్రమంలో భాగంగా పంచాయతీ రాజ్, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో మావోరి తెగ ప్రతినిధులు మేడారం మహాజాతరను సందర్శించారు. హాకా నృత్య ప్రదర్శన మంత్రి సీతక్క స్వయంగా కళాకారులతో కలిసి నృత్యం చేసి వారిలో ఉత్సాహాన్ని పెంచారు.
హాకా నృత్యం అనేది మావోరి తెగలో యుద్ధానికి సిద్ధమయ్యే సమయంలో తమ సైనికుల్లో ఉత్సాహం నింపేందుకు, శత్రువుల్లో భయాన్ని కలిగించే విధంగా చేసే సంప్రదాయ నృత్యంగా ప్రసిద్ధి చెందిందని వారు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, ఆదివాసీ సంస్కృతికి దేశ సరిహద్దులు, భాషలు అడ్డుకావని, ప్రపంచంలోని ఎక్కడైనా ఆదివాసీలు అడవి, ప్రకృతి మీదే ఆధారపడి జీవనం సాగిస్తారని అన్నారు.
ఈ సందర్భంగా బంగారం, వన దేవతల ప్రసాదాన్ని అందజేసి మావోరి తెగ ప్రతినిధులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఐటీడీఏ పీవో చిత్రా మిశ్రా, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.